దుండగులు కిరాతకానికి పాల్పడ్డారు. కర్నూలు జిల్లాలో ఏపీ హైకోర్టు న్యాయవాది వి.వెంకటేశ్వర్లును దారుణంగా హతమార్చారు. కర్నూలు నగర శివారులోని సఫా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర వెంకటేశ్వర్లు మృత దేహాన్ని గుర్తించారు పోలీసులు. హత్య చేసి రోడ్డు పక్కన పారేసి ఉంటారని భావిస్తున్నారు పోలీసులు. ఆవుల వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఈ నెల 7 వ తేదీనుంచి ఆయన కనిపించడం లేదు. ఆయన అదృశ్యంపై కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. చింతకుంటలో తమ్ముని వద్దకు వెళ్లి తిరిగివస్తూ కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మహానంది పీఎస్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
మృతుడు వెంకటేశ్వర్లు కర్నూలు నగరంలోని టెలికాం నగర్ లో నివాసం ఉంటున్నారు. రియల్ ఎస్టేట్ వివాదాల్లో వకాలత్ తీసుకొని కోర్టులో ఆయన వాదిస్తున్నారు. భూ వివాదం క్రమంలోనే.. ఆయనను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. న్యాయవాది హత్య జిల్లాలో కలకలం రేపింది.
