Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?

Anakapalli Tragedy

Anakapalli Tragedy

Anakapalli Tragedy: అనకాపల్లి జిల్లాలోని బుచ్చయ్యపేట మండలం పెదమదిన గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన మైనర్ బాలిక, యువకుడు వేర్వేరు ఘటనల్లో ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇద్దరూ పక్కపక్క ఇళ్లలో నివసిస్తున్నట్లు సమాచారం. పెదమదిన గ్రామానికి చెందిన మజ్జి రేవతి (16) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. రేవతి కొమ్మాదిలో ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు తెలిసింది.

అయితే, ఇదే సమయంలో రేవతి ఇంటికి పక్కనే నివసించే ఎర్రంశెట్టి కనక (25) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పురుగుల మందు సేవించిన కనకను కుటుంబ సభ్యులు, స్థానికులు చికిత్స కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే అతడు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే, మైనర్ బాలిక, యువకుడు పక్కపక్క ఇళ్లలో నివసించడంతో పాటు దాదాపు ఒకే సమయంలో ఆత్మహత్యలకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ రెండు ఘటనలకు మధ్య ఏదైనా సంబంధం ఉందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక, ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరి మృతికి గల కారణాలు, ఘటనలకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఒకే గ్రామంలో మైనర్ బాలిక, యువకుడు మృతి చెందడంతో పెదమదినలో విషాద వాతావరణం నెలకొంది.