Suicide : పార్వతీపురం జిల్లా కొమరాడ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మద్యం బానిసైన ఓ యువకుడు భార్య మందలించిందన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోటవాని వలస గ్రామానికి చెందిన కిషోర్ (30) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే గత కొంతకాలంగా మద్యం వ్యసనానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించినా అలవాటు విడిచిపెట్టలేకపోయాడు.
ఇటీవలి రోజుల్లో పనులు కూడా మానేసి మద్యం మత్తులోనే రోజులు గడిపేవాడు. ఈ కారణంగా అప్పుల పాలయ్యాడు. మద్యం మానుకోవాలనే విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ వాగ్వాదాలు జరిగేవి. తాజాగా కూడా చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకోగా భార్య భార్గవి కోపంతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోవడంతో కిషోర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
గురువారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన కిషోర్ విక్రాంపురం సమీపంలోని ఓ మామిడి తోటకు వెళ్లి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొంతసేపటికి అతడు అపస్మారక స్థితిలో పడిపోయినట్టు గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు అతడిని పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
భర్త మరణవార్త తెలుసుకున్న భార్య భార్గవి, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒక్క క్షణికావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం ఆ కుటుంబాన్ని శాశ్వత దుఃఖంలో ముంచింది. మద్య వ్యసనం అనేక కుటుంబాలను దుఃఖంలోకి నెడుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Justice Surya Kant: భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్..
