Shraddha Walkar Case: దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జైలులో ఉన్న నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు తీహార్ జైలులో భద్రత కల్పించాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. తోటి ఖైదీలు తన ముఖంపై పదునైన ఆయుధాలతో దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని అఫ్తాప్ కోర్టుకు చెప్పడంతో జైలు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. గత 10 రోజులుగా కొందరు ఖైదీలు తనను బెదిరిస్తున్నారని, ముఖాన్ని కోస్తామని అంటున్నారని కోర్టుకు అఫ్తాబ్ తెలిపారు.
ప్రస్తుతం తాను తీహార్ జైలులో 4A నంబర్ జైలులో ఉన్నానని అఫ్తాబ్ కోర్టుకు తెలిపాడు. అక్కడ ప్రత్యేక సెల్‌తో పాటు శిక్షా వార్డు కూడా ఉందని వివరించాడు. అయినప్పటికీ తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. అఫ్తాబ్ వాదనల్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం, అతడి భద్రత కోసం చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించింది. త్వరలో నివేదిక సమర్పించాలని జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. తనను ఐదుగురు ఖైదీలు బెదిరిస్తున్నారని, వారి పేర్లను కూడా అఫ్తాబ్ కోర్టుకు చెప్పారు.
శ్రద్ధాను దారుణంగా చంపిన అఫ్తాబ్..
20222లో 27 ఏళ్ల కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధావాకర్‌ను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా దారుణంగా హత్య చేశాడు. ఆమెతో సహజీవనం చేసున్న అఫ్తాబ్ గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. ఆ తర్వాత ఢిల్లీలోని వివిధ ప్రదేశాల్లో పారేశాడు. ఢిల్లీలోని మెహ్రౌలీలో అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లో ఈ హత్య జరిగినట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఈ కేసులో అఫ్తాబ్‌ను 2022 నవంబర్ 12న అరెస్టు చేశారు. 2023 నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది. శ్రద్ధావాకర్ మరణం తర్వాత న్యాయం కోసం పోరాడుతున్న ఆమె తండ్రి వికాస్ వాకర్ 2025లో మరణించారు.

