Site icon NTV Telugu

Crime News: మహిళ ప్రాణాలు తీసిన రూ. 2 వేలు

Woman Killed For 2k

Woman Killed For 2k

రెండు వేలు.. కేవలం రెండు వేల రూపాయలు కనిపించలేదని నెలకొన్న గొడవలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో వ్యక్తి ప్రాణాలు కాపాడబోయి, తాను దారుణ హత్యకు గురైంది. కల్సంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. సరూర్‌నగర్‌లో రాములమ్మ (50) తన ఇద్దరు కూతుళ్లు (విజయలక్ష్మి, అమ్ములు), వారి అల్లుళ్ళ (నందు, రాజు)తో కలిసి జియాగూడ ఏకలవ్యనగర్‌లో ఉంటోంది. రాములమ్మకు వరుసకు అన్న అయ్యే కే. రాజు సరూర్‌నగర్‌లో ఉంటున్నాడు.

ఇటీవల రాములమ్మ కుమార్తె అమ్ముడు తమ ఇంటికి రావాలని కే. రాజుని కోరింది. దీంతో, అతడు శుక్రవారం వారి ఇంటికి వెళ్ళేటప్పుడు మద్యం (కల్లు) తీసుకుని వెళ్ళాడు. అమ్ములు, విజయలక్ష్మి భర్త నందుతో కలిసి తాగాడు. అనంతరం మధ్యాహ్నం సమయంలో నిద్రపోయాడు. తిరిగి లేచే చూసేసరికి.. తన వద్ద ఉండే రెండు వేలు పోయాయంటూ, అక్కడే ఉన్న ఒక సెల్‌ఫోన్ తీసుకొని సరూర్‌నగర్ వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న నందు.. కే. రాజుని వెతుక్కుంటూ వెళ్ళాడు. అయితే.. అతడు కనిపించకపోయేసరికి, నందు తన అత్త రాములమ్మని తీసుకొని ఏకలవ్యనగర్‌కు వెళ్ళాడు.

తన కోసం నందు వచ్చాడన్న విషయం తెలుసుకొని.. కే. రాజు వెంటనే ఏకలవ్యనగర్‌కి వెళ్లి నందుతో గొడవ పెట్టుకున్నాడు. అక్కడే ఉన్న ఇతర కుటుంబ సభ్యులు సైతం రాజుతో గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో నందు రోకలితో రాజుపై దాడి చేసేందుకు యత్నించగా.. రాములమ్మ అడ్డుపడింది. దీంతో, ఆమె తల పగిలింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై ఏడుగురి మీద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version