ప్రేమ.. పలకడానికి రెండు అక్షరాలే. కానీ, నిజంగా ప్రేమించినవాళ్లకు ఆ పదం వెనుకున్న అసలు అర్థం ఏంటో తెలుస్తుంది. ప్రేమ అంటే ఒక బాధ్యత. కానీ, ఈ తరంలో కొందరు యువతీయువకులు మాత్రం దాన్ని టైంపాస్ గా తీసుకుంటున్నారు. తమ కోరికలు తీర్చుకోవడం కోసం ‘ప్రేమ’ను అడ్డగోలుగా వాడుకుంటున్నారు. ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నారు. నిజంగా ప్రేమించిన వారిని దారుణంగా మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఓ యువకుడు ప్రేమ పేరుతో ట్రాన్స్ జెండర్ ను మోసం చేసిన ఘటన తాజాగా హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది.
ఇందిరా నగర్ లో నివాసముంటోన్న ట్రాన్స్ జెండర్ రోజాకు, స్థానికంగా ఉంటోన్న గోపీ అలియాస్ బాబు అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటోన్న వీళ్లిద్దరు.. ఏడాది నుంచి సహజీవనం చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు బాబు ఆమెని వదిలేసి, మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఆల్రెడీ అతని ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. దీంతో రోజా పోలీసుల్ని ఆశ్రయించింది. బాబుకు అతని తల్లిదండ్రులు వేరే అమ్మాయితో ఖమ్మంలో నిశ్చితార్థం జరిపించారని, తనకు న్యాయం చేయాలని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బాబుకు మొబైల్ స్విచ్చాఫ్ వస్తోందని, ట్రాన్స్ జెండర్ సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం వెళ్లి న్యాయ పోరాటం చేస్తానని రోజా తెలిపింది.
తమ వర్గానికి చెందిన రోజా మోసపోవడంతో.. పలువురు ట్రాన్స్ జెండర్ లు ఆమెకు బాసటగా నిలిచారు. రోజాను బాబు రెండేళ్లు వాడుకొని మోసం చేశాడని, ఇప్పుడు మరొక అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ట్రాన్స్ జెండర్ ప్రతినిధి సోనీ రాథోడ్ ప్రశ్నించారు. వేరే అమ్మాయిని బాబు పెళ్లి చేసుకుంటే, ఆ అమ్మాయి జీవితం నాశనమవుతుందని, బాబుపై తాము బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని అన్నారు. తమకు న్యాయం చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
