NTV Telugu Site icon

Jaipur: టీనేజ్ బాలికపై మామ, అతని కొడుకు అత్యాచారం.. పరువు కోసం గర్భం తీయించిన కుటుంబం..

Rape

Rape

Jaipur: కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కాటేశాడు. రాజస్థాన్ జైపూర్‌కి చెందిన 16 ఏళ్ల బాలికపై మామ, అతని కొడుకు కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గత మూడు నెలలుగా బాలికపై ఇద్దరూ అత్యాచారానికి పాల్పడుతున్నారని, బాలిక గర్భవతి కావడంతో ఈ విషయం తెలిసిందని పోలీస్ అధికారులు వెల్లడించారు. బాలిక కుటుంబ సభ్యులు ఆమె గర్భంతో ఉందని గుర్తించి, పిండాన్ని తొలగించడానికి ఆస్పత్రికి వెళ్లినప్పుడు ఈ సంఘటన తెరపైకి వచ్చింది. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు, త్వరలో పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Read Also: Bihar Politics: సీఎంగా నితీష్.. బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రులుగా ఇద్దరు..

గతేడాది అక్టోబర్ నెలలో కుటుంబ సభ్యులు లేని సయమంలో నిందితులిద్ధరూ బాలికపై తొలిసారిగా లైంగిక దాడికి పాల్పడ్డారని, ఆ తర్వాత ఇద్దరూ పలుమార్లు బెదిరిస్తూ గత మూడు నెలలుగా ఆమెపై అనేక సార్లు అత్యాచారానికి ఒడిగట్టారని, బాలిక సోదరుడు ఇచ్చిన ఎఫ్ఐఆర్ పేర్కొంది. కడుపునొప్పి గురించి ఇంట్లో చెప్పడంతో, ఆమెను కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి గత సోమవారం తీసుకెళ్లారు, బాలిక రెండు నెలల గర్భవతి అని వైద్యులు కనుగొన్నారు. కుటుంబం పరువు కాపాడుకోవడానికి వారు వెంటనే పిండాన్ని తొలగించారు.

మొదటగా బాలిక ఈ ఘటనపై మాట్లాడేందుకు నిరాకరించనప్పటికీ.. తర్వాత సంఘటన గురించి వెల్లడించింది. ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత, నిందితులు ఇద్దరిపై కేసు నమోదు చేయడానికి బాలిక సోదరుడు శుక్రవారం సదర్ పోలీస్ స్టేషన్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 376 డి, 376 ఎన్, అలాగే లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అమ్మాయికి వైద్యపరీక్షలు నిర్వహించారు, నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. నిజానిజాలు తేలిన వెంటనే నిందితులను పట్టుకుని, విచారిస్తామన్నారు.