మలయాళంలో 2013లో మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’ను తెలుగులో అదే పేరుతో వెంకటేశ్ రీమేక్ చేశారు. 2014లో విడుదలైన ఆ సినిమా ఇక్కడా చక్కని విజయాన్ని అందుకుంది. మాతృకలో మోహన్ లాల్ భార్యగా నటించిన మీనా, తెలుగు రీమేక్ లో వెంకీకి భార్యగా నటించారు. అదే కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ‘దృశ్యం’ సీక్వెల్ ఈ యేడాది ఫిబ్రవరిలో మలయాళంలో వచ్చింది. ఇప్పుడు ఆ సీక్వెల్ నూ తెలుగులో వెంకటేశ్ రీమేక్ చేశారు. అదిప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆరేళ్ళ క్రితం కథ ఎక్కడ ఆగిందో, ఈ సీక్వెల్ ను దర్శకుడు జీతూ జోసఫ్ అక్కడే మొదలు పెట్టారు. తన ఇంట్లో హత్యకు గురైన వరుణ్ అనే కుర్రాడి శవాన్ని రాంబాబు (వెంకటేశ్) కన్ స్ట్రక్షన్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లో పాతిపెట్టడంతో ‘దృశ్యం’ సినిమా ముగుస్తుంది. వరుణ్ శవం దొరక్కపోవడం, అతను హత్యకు గురైన రోజున రాంబాబు తన కుటుంబం ఊర్లోనే లేదని ఆధారాలు సృష్టించడంతో పోలీసులు కేసును క్లోజ్ చేస్తారు. అయితే… ఉద్యోగ విరమణ అనంతరం అమెరికాకు వెళ్ళిన వరుణ్ తల్లి గీత (నదియా) ఎలాగైనా రాంబాబు మీద పగ తీర్చుకోవాలనే పంతంతో ఉంటుంది. పేరుకు కేసును క్లోజ్ చేసినా, ఆమె స్నేహితుడు, ప్రస్తుతం ఐజీపీగా ఉన్న గౌతమ్ సాహు (సంపత్ రాజ్) సాయంతో రాంబాబుపై నిఘా పెడుతుంది. ఆరేళ్ళ తర్వాత తిరిగి పోలీసులు సరికొత్త సాక్ష్యాలతో రాంబాబు కుటుంబాన్ని కోర్టుకు ఈడ్చినప్పుడు ఈసారి అతను ఎలా దాని నుండి బయట పడ్డాడు అనేదే ‘దృశ్యం -2’ కథ.
‘దృశ్యం’ చిత్రంలో కేబుల్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న రాంబాబు… ఇప్పుడీ సీక్వెల్ లో థియేటర్ ఓనర్. తన భార్య జ్యోతి (మీనా) పేరుతోనే ఓ థియేటర్‌నూ నిర్వహిస్తుంటాడు. మొదటి భాగంలో సినిమాల పిచ్చి ఉన్న ఆ రాంబాబు, ఇప్పుడు సినిమా స్టోరీ రైటర్ గా మారిపోతాడు. ఒకప్పటి పాపులర్ ఫిల్మ్ రైటర్ వినయ్ చంద్ర (భరణి) సాయంతో ఓ సినిమా నిర్మించడానికి సిద్ధమౌతాడు. అయితే భర్తను సినిమా నిర్మాణమనే రొంపిలోకి దిగవద్దని, పెద్ద కూతురు అంజు (కృతిక) పెళ్ళి చేయమని జ్యోతి పోరుతూ ఉంటుంది. ఇదే సమయంలో వీరిద్దరి చిన్నకూతురు అను మీద కూడా పోలీసులు నిఘా పెడతారు. ఊర్లో వారంతా రాంబాబే వరుణ్ ను హత్య చేశాడని నమ్ముతూ ఉంటారు. ఆరేళ్ళు గడిచినా ఆ విషయాన్ని మాట్లాడుకుంటూనే ఉంటారు. మారిన పోలీసు అధికారులు, అందివచ్చిన సరికొత్త సాంకేతికతతో రాంబాబు ఫ్యామిలీని ఎలా ట్రాప్ చేశారు? అతన్ని ఎలా ఉచ్చులోకి లాగారు? దాని నుండి రాంబాబు ఎలా బయటపడ్డాడనే అంశాలను జీతూ జోసఫ్ మొదటి చిత్రం కంటే ఆసక్తికరంగా ఈ సీక్వెల్ లో చూపించాడు. సినిమా క్లయిమాక్స్ కు చేరేసరికీ రాంబాబును పోలీసులు ట్రాప్ చేశారా? లేక రాంబాబే పోలీసులను ట్రాప్ చేశాడా? అనే సందేహం సినిమా చూసే వారికి కలుగుతుంది. కన్నకొడుకును కోల్పోయిన గీత, ప్రభాకర్ లకు ఊరట నిచ్చే ముగింపుతో పాటు, ఓ హత్యను దాచిపెట్టాలని చూసే వ్యక్తి మానసికంగా ఎంత కృంగిపోతాడో ఈ సినిమాలో చూపించారు. నిజానికి అంతకు మించిన శిక్ష వేరే ఏదీ ఉండదని డైరెక్టర్ చాలా కన్వెన్సింగ్ గా చెప్పాడు.
సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ పకడ్బందీగా సీన్స్ రాసుకుని, ఆసక్తికరంగా దానిని తెరకెక్కించడంలో జీతూ జోసఫ్ సక్సెస్ అయ్యాడు. ఆరంభంలో కాస్తంత బోర్ కొట్టినా, పోలీసులు రాంబాబు కుటుంబాన్ని ఎలా ట్రాప్ చేశారనే విషయాన్ని రివీల్ చేసిన దగ్గర నుండి కథ చకచకా సాగిపోయింది. పోలీస్ స్టేషన్‌లోని సన్నివేశాలే కాకుండా కోర్టు డ్రామా కూడా బాగా పండింది. ‘దృశ్యం’ చిత్రం పలు భాషల్లో రీమేక్ అయ్యి విజయం సాధించడం, ఇప్పటికే మలయాళంలో వచ్చిన సీక్వెల్ సైతం చక్కని ఆదరణ పొందడంతో జీతూ జోసఫ్ ఎక్కడా తడబడకుండా ధైర్యంగా దీనిని తీశారని పించింది. మలయాళ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన సతీశ్ కురుప్ తెలుగు సినిమాకూ వర్క్ చేశారు. కేరళలోని పచ్చని పొలాలు, చెట్లు తెలుగు రీమేక్‌లో లేకపోయినా పల్లె అందాలను సతీశ్ తన కెమెరాలో బంధించారు. అలానే అనూప్ రూబెన్స్ చక్కని నేపథ్య సంగీతం అందించారు. కానీ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఏమంతగా ఆకట్టుకోలేదు. మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ బాగుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలను మార్చడం, కథను మరింత ఆసక్తికరంగా చెప్పడంతో మలయాళ మాతృక కంటే ఇది బెటర్ గా ఉంది.
నటీనటుల విషయానికి వస్తే వెంకటేశ్ మరోసారి రాంబాబు పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. నిజానికి ‘దృశ్యం’లో కంటే ఈ సీక్వెల్ లో చాలా ఈజ్ తో ఆ పాత్రను పోషించాడు. బహుశా మొదటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించిన కారణంగా ఆ కాన్ఫిడెన్స్ వెంకటేశ్ కు కలిగి ఉండొచ్చు. అలానే ‘దృశ్యం’ రీమేక్ ను అప్పట్లో నటి సుప్రియ డైరెక్ట్ చేయగా, ఇప్పుడీ సీక్వెల్ రీమేక్ ను మాతృకను తెరకెక్కించిన జీతూ జోసఫ్ డైరెక్ట్ చేయడం మరో కారణం కావచ్చు. మీనా నటన బాగుంది. కానీ ఆమెకు డబ్బింగ్ అంతగా సూట్ కాలేదు. ఇక వారి పిల్లలుగా నటించిన కృతిక, ఎస్తర్ అనిల్ కు ఇందులో నటనకు పెద్దంత స్కోప్ లేకపోయింది. విశేషం ఏమంటే ‘దృశ్యం’ తర్వాత వీరిరువురూ ఒకటి రెండు తెలుగు సినిమాలలో నటించారు. ‘దృశ్యం’లోని కొన్ని పాత్రలు ఇందులో మిస్ అయ్యాయి. ఆ స్థానంలోకి కొత్తగా కొన్ని పాత్రలు వచ్చి చేరాయి. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో వినయ్ వర్మ, రాంబాబు లాయర్ గా పూర్ణ, అతని పక్కింటి వ్యక్తులుగా సత్యం రాజేశ్, సుజీ బాగా చేశారు. ‘దృశ్యం’లోనూ చక్కని నటన కనబరిచిన నదియా, నరేశ్ ఇందులోనూ అదే సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సంపత్ రాజ్, తనికెళ్ళ భరణి, అన్నపూర్ణమ్మ, చమ్మక్ చంద్ర, సమ్మెట గాంధీ, సీవీఎల్ నరసింహారావు, నాయుడు గోపి తదితరులు ఇతర పాత్రలను పోషించారు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ డీజీపీ గా గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు. ఇక ఊరిలో రాంబాబు కుటుంబం గురించి చెవులుకొరుక్కొనే బ్యాచ్ లో కమెడియన్స్ చాలామందే కనిపించారు. మొత్తంగా అందరి నుండి దర్శకుడు జీతూ చక్కని నటన రాబట్టుకున్నాడు. ఈ సినిమాను ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతితో కలిసి సురేశ్ బాబు లిమిటెడ్ బడ్జెట్ లోనే నిర్మించారు. అయితే కథానుగుణంగా ఖర్చు పెట్టారనేది మూవీ చూస్తుంటే అర్థమౌతోంది.
‘దృశ్యం’ మొదటి భాగంతో పోల్చితే సీక్వెల్ బెటర్ మూవీ. అలానే ఈ మూవీ ప్రథమార్థంతో పోల్చితే ద్వితీయార్థం ఉత్కంఠభరితంగా సాగింది. సహజంగా సీక్వెల్స్ మొదటి చిత్రమంత గ్రిప్పింగ్ తో అవి ఉండవు. పైగా వాటి మీద ఏర్పడే అంచనాలనూ అవి రీచ్ కాలేవు. కానీ ‘దృశ్యం’ సీక్వెల్ అంచనాలు అందుకోవడమే కాకుండా, అలరించే విధంగానూ ఉంది. ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్ ఎంచక్కా ఈ థ్రిల్లర్ మూవీని చూసి ఎంజాయ్ చేయొచ్చు.
ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
ఆకట్టుకునే కథ, కథనాలు
ఉత్కంఠభరితమైన పతాకసన్నివేశం
మైనెస్ పాయింట్స్
కాస్తంత బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్
అలరించని నేపథ్య గీతం
రేటింగ్: 3.5/5
ట్యాగ్ లైన్: థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్!