NTV Telugu Site icon

రివ్యూ : ‘ఉప్పెన’ లాంటి ప్రేమ…!

మెగా ఫ్యామిలీ నుండి ఓ కొత్త హీరో వస్తున్నాడంటే భారీ అంచనాలు ఏర్పడటం సహజం. అది ‘ఉప్పెన’ విషయంలో భారీ నుండి అతి భారీకి చేరుకుంది. కారణం దానిని నిర్మిస్తోంది ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కావడం, దర్శకత్వం వహించిన సానా బుచ్చిబాబు ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు కావడం! అలానే బాల నటుడిగా చేసింది రెండు మూడు సినిమాలే అయినా క్యూట్ గా ఉండే వైష్ణవ్ ఫస్ట్ టైమ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం, ఇప్పటికే ప్రకటన ద్వారా పాపులారిటీ పొందిన కృతీశెట్టి హీరోయిన్ గా అరంగేట్రమ్ చేయడం!! ఇక సుక్కు అంటే ప్రాణం పెట్టే దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు కావడం కూడా ‘ఉప్పెన’పై అంచనాలు అంబరాన్ని తాకడానికి  కారణమయ్యాయి. మరి ఆ సముద్రపు అలల మాదిరి ఉవ్వెత్తున లేచిన అంచనాలను సినిమా అందుకుందో లేదో చూద్దాం.

ఉప్పాడ సముద్రతీర గ్రామంలో రాజకీయ నేత రాయుడు (విజయ్ సేతుపతి). అతని ఒక్కగా నొక్క కూతురు బేబమ్మ (కృతీశెట్టి). కులం కోసం, పరువు కోసం ప్రాణం పెట్టే వ్యక్తి రాయుడు. వారికి కొద్ది దూరంలో బేస్త పల్లెలో ఉండే ఆశీర్వాదం (వైష్ణవ్ తేజ్) కు చిన్నప్పటి నుండీ బేబమ్మ అంటే అభిమానం, పెద్దయ్యాక అది ప్రేమగా మారుతుంది. ఒకానొక సందర్భంలో ఆశీని చూసి తొలిచూపు ప్రేమలో పడుతుంది బేబమ్మ. పరువు ప్రతిష్ఠలకు ప్రాధాన్యమిచ్చే రాయుడు వీళ్ళను ఎలా విడదీయాలని చూశాడు? అతని ఎత్తుల నుండి జిత్తుల నుండీ వీళ్ళిద్దరూ ఎలా తప్పించుకుని ఒక్కటయ్యారన్నది సినిమా కథ.

డబ్బున్నవాళ్ళ అమ్మాయిని పేదింటి కుర్రాడు ప్రేమించడం అనేది దశాబ్దాలుగా మనం చూస్తున్న కథే. అయితే… దానిని ఆసక్తికరంగా మలచడంలోనే దర్శకుడి ప్రతిభ దాగి ఉంది. కొత్త కథను పాత పద్థతిలో చెప్పడం, పాత కథను కొత్తగా చూపడంలోనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. అందుకే తాను తీసుకున్నది పాత కథని తెలిసిన దర్శకుడు బుచ్చిబాబు దానికి కొత్తగా చూపే ప్రయత్నం చేశాడు. ప్రథమార్ధం అంతా… ఆశీ, బేబమ్మ ప్రేమచుట్టూ సాగుతుంది. యువత మెచ్చే విధంగా ఈ సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించాడు. అయితే… ఈ ప్రేమతతంగం అంతా… కాస్త స్లోగా సాగుతుంది. ఇక ద్వితీయార్థంలో బేబమ్మ ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత సన్నివేశాలన్నీ చకచకా సాగిపోయాయి. ఫస్ట్ హాఫ్ లో కథ హీరోని ఎలివేట్ చేసేట్టు సాగితే… ద్వితీయార్థాన్ని బేబమ్మ తన చేతుల్లోకి తీసుకుంది. మరీ ముఖ్యంగా క్లయిమాక్స్ లో తండ్రితో ఆమె చెప్పే సంభాషణలు సినిమాను నిలబెట్టాయి. ఓ సున్నితమైన అంశాన్ని తీసుకుని, ప్రీ క్లయిమాక్స్ దానిని దర్శకుడు హోల్డ్ చేసిన తీరు ఆసక్తికరంగా ఉంది. ఆ పాయింట్ ను ఎస్టాబ్లిష్ చేస్తూ… ప్రధమార్థంలో కొన్ని సన్నివేశాలను, ద్వితీయార్థలో కొన్ని సన్నివేశాలను పెట్టి ఆడియెన్స్ ను కన్వెన్స్ చేసే ప్రయత్నం డైరెక్టర్ బుచ్చిబాబు చేశాడు.

వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి లకు ఇది తొలి చిత్రమే అయినా… ఇద్దరూ చాలా చక్కగా ఆ యా పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా కృతీశెట్టి… క్లయిమాక్స్ తో విజయ్ సేతుపతితో పోటీపోటీగా నటించింది. మొన్న సంక్రాంతికి వచ్చిన ‘మాస్టర్’లో ప్రతినాయకుడిగా నటించి మెప్పించిన విజయ్ సేతుపతి… ఇప్పటి ‘ఉప్పెన’లోనూ తన సత్తాను మరోసారి చాటుకున్నాడు. అలానే అతని కుడిభుజంగా నాగమహేశ్, తండ్రిగా రామరాజు చక్కగా నటించారు. ‘ఫిదా’ మూవీతో తండ్రి పాత్రలోకి అడుగుపెట్టిన సాయిచంద్ ఇందులో హీరో తండ్రిగా తనదైన మార్క్ చూపించాడు. ఆర్టిస్టుల నుండి తగిన నటనను బుచ్చిబాబు చక్కగా రాబట్టుకున్నాడు. 

సాంకేతిక నిపుణులలో దేవిశ్రీ ప్రసాద్ ను ప్రత్యేకంగా అభినందించాలి. సినిమా విడుదలకు ముందే తన పాటలతో మూవీకి హైప్ క్రియేట్ చేశాడు డీఎస్పీ. వాటి పిక్చరైజేషన్ కూడా అంతే బాగుంది. ‘నీ కన్ను నీలి సముద్రం’ పాట విజువల్ ఫీస్ట్ అయితే, ‘థక్ థక్ థక్’ సాంగ్ పిక్చరైజేషన్ సమ్ థింగ్ స్పెషల్ గా ఉంది. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ మూవీకి హైలైట్. మరీ ముఖ్యంగా సముద్రంపై చిత్రీకరించిన సన్నివేశాలు చాలా చాలా బాగున్నాయి. నవీన్ నూలి ఎడిటింగ్ ఓకే. 

సినిమా ప్రారంభమే ఆసక్తికరంగా మొదలైంది. అదే ఊపుతో ప్రేమకథలోకి సాగిపోయింది. అక్కడి నుండి ప్రేక్షకుడిని కట్టిపడేసింది. కానీ కొన్ని సన్నివేశాలు ఇటీవల వచ్చిన చిత్రాలలోని సీన్స్ ను గుర్తుకు తెస్తాయి. అయితే… దర్శకుడు ఎంచుకున్న కొత్త పాయింట్, దానిని కన్వెన్స్ గా చూపిన విధానం ‘ఉప్పెన’ చిత్రాన్ని నిలబెట్టాయి. ఓవర్ ఆల్ గా ఈ కొత్త అంశాన్ని దర్శకుడు కన్వెన్స్ చేసిన తీరుకు ఎంత మంది కనెక్ట్ అవుతారనే దానిమీద మూవీ సక్సెస్ రేంజ్ ఆధారపడి ఉంటుంది. ఒకటి మాత్రం నిజం… ప్రేమకథా చిత్రాలలో ‘ఉప్పెన’ తనదైన ముద్రనైతే వేసిందనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్

నటీనటుల నటన
డీఎస్పీ మ్యూజిక్
శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ
నిర్మాణ విలువలు

మైనెస్ పాయింట్

రొటీన్ సీన్స్
ఫస్ట్ హాఫ్‌ స్లో నెరేషన్

రేటింగ్
2.5 / 5

ట్యాగ్ లైన్
‘ఉప్పెన’లాంటి ప్రేమ!