NTV Telugu Site icon

రివ్యూ: ”ది రోజ్ విల్లా”

కరోనా కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు విశేషమైన ఆదరణ లభిస్తోంది. దాంతో సహజంగానే కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ ను తెరకెక్కించే దర్శకులు, నిర్మాతలు ఎక్కువయ్యారు. అయితే కొందరు తమలోని పేషన్ ను విస్త్రత పరిధిలో ప్రేక్షకులకు చేర్చాలనే భావనతో కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ ను సైతం థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అలా ఈ శుక్రవారం జనం ముందుకు వచ్చిందే ‘ది రోజ్ విల్లా’ మూవీ.

డాక్టర్ రవి (దీక్షిత్ శెట్టి), అతని భార్య, రచయిత్రి శ్వేత (శ్వేతవర్మ) సరదాగా ఓ రోజు ఔటింగ్ కు మున్నూరు బయలు దేరతారు. అయితే మార్గమధ్యలో వాళ్ళ కారు చెడిపోతుంది. అది అటవీ ప్రాంతం కావడంతో దారిలో ఎదురుపడిన పోలీసుల సాయంతో దగ్గరలోని ఓ రెస్టారెంట్ కు చేరతారు. అక్కడ రవికి హార్ట్ ఎటాక్ తో బాధపడుతున్న సాల్మన్, అతని భార్య హెలెన్ తారసపడతారు. రవి బేసికల్ గా వైద్యుడు కావడంతో సాల్మన్ కు ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. దాంతో ఆ దంపతులు ఈ ఇద్దరినీ తమ రోజ్ విల్లాకు వచ్చి ఆతిథ్యం తీసుకోమని కోరతారు. మొదట శ్వేత కొంత హెజిటేట్ చేసినా, ఆ రోజు తమ వెడ్డింగ్ యానివర్సరీ అని సాల్మన్, హెలెన్ చెప్పడంతో కాదనలేక పోతారు. అయితే… ఊరికి దూరంగా ఉండే ఆ రోజ్ విల్లాలోకి ఈ కొత్త జంట అడుగుపెట్టాక ఏం జరిగింది? ఆ రోజ్ విల్లాకు సంబంధించిన అంతుబట్టని రహస్యం ఏమిటీ? అక్కడి వరకూ వచ్చి మాయమైపోతున్న యువకులకు, ఆ రోజ్ విల్లాకు ఏమిటీ లింక్? అనేది మిగతా కథ.

‘ది రోజ్ విల్లా’ ఓ సైకిలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ తరహా కథాంశాలతో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ జానర్ మూవీస్ ను జనం ఆదరిస్తున్నారు కాబట్టి దర్శక నిర్మాతలు హేమంత్, అచ్యుత రామారావు సైతం ప్రయత్నం చేశారని పిస్తోంది. కన్నడ, తెలుగు భాషల్లో ఈ సినిమాను పరిమితమైన బడ్జెట్ లో తీశారు. అయితే… ఆర్టిస్టులు కొంత అనుభవజ్ఞులు కావడంతో వారి పని కాస్తంత సులువైంది.

డాక్టర్ రవిగా ‘దియా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి నటించాడు. అలానే ఇటీవల పలు చిత్రాలలో నటించిన శ్వేత వర్మ ఇందులో కథానాయికగా నటించింది. బిగ్ బాస్ సీజన్ 5 షో లో పార్టిసిపెంట్ గా ఉన్న శ్వేత బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కారణంగా, ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయింది. ఆమెలో కూడా చక్కని నటి ఉంది. ఆ ఈజ్ తెర మీద కనిపిస్తోంది. ఇక సీనియర్ నటుడు రాజా రవీంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాల్మన్ పాత్రలో ఆయన ఇమిడిపోయాడు. వీరందరికంటే సినిమాను రక్తి కట్టించిన పాత్ర హెలెన్ ది. రంగస్థల కళాకారిణి అయిన అర్చనా కుమార్ ఆ పాత్రను సమర్థవంతంగా పోషించారు. సైకలాజికల్ గా డిస్ట్రబ్ అయిన తల్లి పాత్రకు ఆమె న్యాయం చేకూర్చారు. అలానే కరోనా కారణంగా కన్నుమూసిన టీఎన్ఆర్ ఇందులో సైకియాట్రిస్ట్ పాత్ర చేశారు. ఇక చిత్ర నిర్మాత ‘వెన్నెల’ రామారావు పోలీస్ అధికారి శివ పాత్రను పోషించారు. ఈ తరహా పాత్రలకు అతను బాగానే సూట్ అవుతారు. సురేశ్ బొబ్బిలి స్వర రచన ఓకే. అయితే వాటి చిత్రీకరణ పెద్దంత ఆకట్టుకునేలా లేదు. సాల్మన్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి ప్రతిభా నైట్ ఎఫెక్ట్ సీన్స్ లో కనిపించింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్తంత కేర్ తీసుకుని ఉండాల్సింది. ద్వితీయార్థం చివరకు వచ్చే సరికీ రిపీట్ సీన్స్ ను చూపించడం కొంత బోర్ కొట్టిస్తుంది.

అంచనాలు పెట్టుకోకుండా ఈ మూవీని చూస్తే బాగానే ఉందనిపిస్తుంది. చేతి కెదిగిన పిల్లలు తమను నిర్లక్ష్యం చేస్తే ఆ తల్లిదండ్రుల మనోవేదన ఎలా ఉంటుంది? వారి మానసికంగా ఏ స్థాయిలో దిగజారిపోతుందనే అంశాన్ని దర్శకుడు హేమంత్ తన పరిధి మేరలో చూపించే ప్రయత్నం చేశాడు. అయితే కథ, కథనాల మీద మరింత హోమ్ వర్క్ చేసి ఉంటే బెటర్ మూవీ అయ్యేది. నిజానికి ఈ తరహా సినిమాలకు కరెక్ట్ ప్లాట్ ఫామ్ ఓటీటీనే!

ప్లస్ పాయింట్స్
సైకలాజికల్ థ్రిల్లర్
నేపథ్య సంగీతం
మూవీ రన్ టైమ్

మైనెస్ పాయింట్
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం
ఆసక్తి కలిగించని కథనం

రేటింగ్: 2.5 /5

ట్యాగ్ లైన్: సైకలాజికల్ థ్రిల్లర్!

Show comments