NTV Telugu Site icon

రివ్యూ: ఇష్క్

Teja Sajja's Ishq Not a Love Story Movie Review

ఈ యేడాది ఫిబ్రవరిలో విడుదలైన ‘జాంబిరెడ్డి’తో చక్కని విజయాన్ని అందుకున్నాడు యంగ్ హీరో తేజ సజ్జా. అదే నెల చివరి వారంలో విడుదలైన ‘చెక్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. వీరిద్దరూ జంటగా నటించిన సినిమా ‘ఇష్క్’. విశేషం ఏమంటే… ఇదే పేరుతో 2019లో వచ్చిన మలయాళ చిత్రానికి ఇది రీమేక్. కాస్తంత గ్యాప్ తర్వాత మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ ‘ఇష్క్’తో రీ ఎంట్రీ ఇవ్వడంతో సహజంగానే జనాలకు ఈ మూవీపై ఆసక్తి ఏర్పడింది.

కథ గురించి చెప్పుకోవాలంటే సింపుల్. వైజాగ్ లో సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తుంటాడు సిద్ధార్థ్‌ (తేజ సజ్జ). అతని గర్ల్ ఫ్రెండ్ అనసూయ (ప్రియా ప్రకాశ్ వారియర్). తమ ప్రేమ విషయాన్ని సిద్ధు ఇంట్లో వాళ్ళకు చెప్పి ఆమోదం పొందుతాడు. కానీ అను తన తండ్రికి చెప్పడానికి భయపడుతూ ఉంటుంది. బిగ్ షాట్ అయిన ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటాడోనని భయపడుతుంటుంది. చెల్లి వివాహ నిశ్చితార్థం రేపు అనగా సిద్ధు ఫ్రెండ్ నుండి కారు తీసుకుని, అను బర్త్ డే సందర్భంగా స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి ఆమెతో కలిసి వైజాగ్ బీచ్ రోడ్ కు వెళతాడు. రాత్రి అంతా సరదాగా డ్రైవింగ్ లో గడిపేసి తెల్లవారు ఝామున ఆమెను హాస్టల్ లో దించాలనుకుంటాడు. ఆ రోజు రాత్రి వీరిద్దరూ కారు బ్యాక్ సీట్ లో ముద్దు పెట్టుకుంటూ ఉండగా, మాధవ్ (రవీంద్ర విజయ్) ఆ దృశ్యాలను కెమెరాలో బంధిస్తాడు. అతన్ని నిలువరించబోయిన సిద్ధుకు తాను పోలీస్ నని చెబుతాడు. దాంతో సిద్ధు భయపడతాడు. అతనికి ఎంతో కొంత డబ్బులిచ్చి పోలీస్ కేసు కాకుండా చూడాలనుకుంటాడు. ఈ క్రమంలో మాధవ్… అను తో మిస్ బిహేవ్ చేస్తాడు. గొడవ చేస్తే ఎక్కడ అను పరువు పోతుందో అనే భయంతో సిద్ధు మిన్నకుండి పోతాడు. ఆ కాళరాత్రి జరిగిన సంఘటన పర్యవసానం ఏమిటీ? వారిద్దరి మధ్య ఉన్న ప్రేమపై అది ఎలాంటి ప్రభావం చూపింది? తన ప్రియురాలికి జరిగిన అన్యాయానికి సిద్ధు ఎలా పగ తీర్చుకున్నాడు? అనేది మిగతా కథ.

ఓ చిన్న సంఘటనను ఆధారం చేసుకుని రెండు గంటల సినిమాను తీయడం అంటే సామాన్య విషయం కాదు. పైగా సన్నివేశాలు ఎక్కువ రాసుకోకుండా, అరగంట పాటు ఒకే సీన్ ను సాగతీస్తూ పోతే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టే! ‘ఇష్క్’ విషయంలో అదే జరిగింది. సినిమా ఇంటర్వెల్ ముందు దాదాపు అరగంట పాటు హీరో, హీరోయిన్లను పోలీసులిద్దరు వేధించడం… థియేటర్లలోని ప్రేక్షకులను వేధించినట్టే అయ్యింది. ఇక ద్వితీయార్థంలో హీరో అందుకు ప్రతీకారాన్ని ఎలా తీర్చుకున్నారో చూపించారు. ఇక్కడ సెన్సిబిలిటీస్ మిస్ అయ్యి, కన్నుకు కున్ను అన్నట్టుగా సాగింది.

పైకి ఇది మోరల్ పోలిసింగ్ అంశంపై రూపుదిద్దుకున్న సినిమాగా కనిపించినా, అంతర్లీనంగా మహిళల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పి, వారిని నిత్యం శంకించే పురుషపుంగములను చెంపదెబ్బ కొట్టే సినిమా. క్లయిమాక్స్ లో హీరోయిన్ పాత్ర ద్వారా దాన్నే దర్శకుడు చెప్పించాడు. కానీ ఏం లాభం!? కథకుడు, దర్శకుడు చెప్పాలనుకున్న అంశం వెనక్కి వెళ్ళిపోయి, ప్రేమికుల జంట మోరల్ పోలీసుల కంట పడితే ఏం జరిగిందనే విషయం హైలైట్ అయిపోయింది. నిజానికి ఇలాంటి కథలు మలయాళంలో చెల్లుతాయేమో కానీ తెలుగులో కష్టమే. మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ లాంటి సంస్థ, అందులోనూ ఆర్. బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అప్పారావు వంటి సీనియర్స్ ఈ కథను ఎంపిక చేయడమే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రథమార్ధంతో పోల్చితే ద్వితీయార్ధం కొంతలో కొంత బెటర్.

మలయాళం రీమేక్ కాబట్టి తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్ వారియర్ ఇందులో నటించి ఉండొచ్చు. ఆ యా పాత్రలను వారు బాగానే చేశారు. ఆ మధ్య వచ్చిన ‘ఫ్యామిలీ మ్యాన్ -2’లో తమిళ పోలీస్ ఆఫీసర్ గా నటించిన రవీంద్ర విజయ్ ఇందులో విలన్ పాత్ర పోషించాడు. అతని బాడీ లాంగ్వేజ్ బాగున్నా, వాయిస్ సూట్ కాలేదు. బహుశా అతనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాడేమో! అతని భార్య పాత్రధారి బాగానే చేశారు. శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏం లేదు. మహతి స్వర సాగర్ నేపథ్య సంగీతం ఓకే. దర్శకుడు ఆర్. ఆర్. రాజుకు ఇదే మొదటి సినిమా.
నిజానికి మలయాళ చిత్రంలోని మెయిన్ పాయింట్ ను మాత్రమే తీసుకుని మన వాళ్ళ సెన్సిబులిటీస్ ను దృష్టిలో పెట్టుకుని మొత్తం కథను తిరగరాసి తీసి ఉంటే బాగుండేది. కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.

రేటింగ్ : 2 / 5

ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
మలయాళ రీమేక్ కావడం
మెగా సూపర్ గుడ్ సంస్థ నిర్మించడం

మైనెస్ పాయింట్స్
పక్కదారి పట్టిన ప్రధానాంశం
సహనాన్ని పరీక్షించే కథనం

ట్యాగ్ లైన్ : ‘ఇష్క్’తో రిస్క్!