‘చక్రవాకం’, ‘మొగలి రేకులు’ సీరియల్స్ తో ప్రతి తెలుగువారి ఇంటిలోనూ ఓ సభ్యుడిగా మారిపోయాడు ఆర్.కె. నాయుడు ఉరఫ్ సాగర్. టీవీ నటుడిగా లభించిన ఆదరణతో ‘సిద్ధార్థ’ అనే చిత్రంలో సోలో హీరోగా నటించాడు. ఆశించిన విజయం లభించలేదు. మరోసారి తన అదృష్టాన్ని ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మూవీతో పరీక్షించుకున్నాడు. అదీ గొప్ప ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా పట్టు వదలకుండా ఇప్పుడు ‘షాదీ ముబారక్’ అంటూ జనం ముందుకు వచ్చాడు. మరి ఈసారి ఎలాంటి ఫలితం లభించింది!?
కథ గురించి చెప్పుకోవాలంటే సింపుల్. మాధవ్ సున్నిపెంట (వీర సాగర్) జాతకంలో అతని కంటే కాస్తంత వయసు పెద్ద అమ్మాయితో వివాహం జరుగుతుందని ఉంటుంది. ఆ విషయంలో కొంత కలత చెందిన ఆమె తల్లిదండ్రులు (హేమ, బెనర్జీ) తమ కొడుకుకు సంబంధాలు చూసిపెట్టమని ఓ మ్యారేజ్ బ్యూరో ను ఆశ్రయిస్తారు. ఆ సంస్థ నిర్వాహకురాలు (రాజశ్రీ నాయర్) అందుకు అంగీకరిస్తుంది. ఒకే రోజు మూడు పెళ్ళిచూపులు అరేంజ్ చేస్తుంది. కానీ చిన్న సమస్య వచ్చి మాధవ్ తో పాటు… ఈ పెళ్ళి చూపులకు తన కుమార్తె సత్యభామ తుపాకుల (దృశ్య రఘునాథ్)ను తోడుగా పంపుతుంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అంతలోనే ఎలాంటి అపార్థాలు చోటు చేసుకున్నాయి? చివరికి వీరు ఒకటి అయ్యారా… లేదా అనేదే కథ!
తొలి రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో రొటీన్ యాక్షన్ డ్రామాల జోలుకు పోకుండా సాగర్ మంచి పని చేశాడు. ఓ కూల్ బ్రీజ్ లవ్ స్టోరీ ని ఎంపిక చేసుకున్నాడు. కథలో పెద్ద పాయింట్ లేకపోయినా… సినిమా ఆద్యంతం ఆహ్లాదరకంగా, వినోదాత్మకంగా సాగిపోయే జాగ్రత్తలు తీసుకున్నాడు. సినిమా ప్రధామార్థం హీరో పెళ్ళిచూపుల చుట్టు సాగితే, ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది. తనను అపార్థం చేసుకున్న వారికి వివరణ ఇవ్వడం, తన లవ్ స్టోరీని సక్సెస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో ప్రథమార్థంతో పోల్చితే సినిమా ద్వితీయార్ధం కాస్తంత వేగం తగ్గింది. సినిమా సాగేదంతా పెళ్ళిచూపుల నేపథ్యంలో కాబట్టి… గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘పెళ్లిచూపులు’ కూడా అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటుంది. నిజానికి ఈ రెండు కథలకూ ఎలాంటి పోలికా లేదు. కాకపోతే… కొన్ని అనవసరమైన సన్నివేశాలను ఎడిట్ చేసి ఉంటే… సినిమా ఇంకా చకచకా సాగిపోయి ఉండేది. అలానే చాలా పాత్రలకు సరైన ఎండింగ్ ఇవ్వలేదు. దాంతో అబ్రాప్ట్ గా సినిమాను దర్శకుడు ముగించేశాడనిపిస్తుంది. అయితే ఓవర్ ఆల్ గా చూసినప్పుడు చాలా రోజుల తర్వాత ఓ ఫన్నీ ఎంటర్ టైనర్ ను వాచ్ చేశామనే భావన కలుగుతుంది. గడిచిన రెండు నెలల్లో ఇంత లైటర్ వీన్ కామెడీ మూవీ రాలేదనే చెప్పాలి.
నటీనటుల విషయానికి వస్తే… వీర సాగర్ చక్కగా నటించాడు. సీరియల్స్ లో మాదిరి మనసుల్ని పిండేసే భారీ సెంటిమెంట్స్ సీన్స్ లేకుండా జాగ్రత్త పడ్డాడు. తన వరకూ తన పాత్రను చక్కగా పోట్రేట్ చేశాడు. మలయాళీ అమ్మాయి దృశ్య రఘునాథ్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. పేరుకు తగ్గట్టే సత్యభామ పాత్రను చక్కగా పోషించింది. ఆమె తల్లిదండ్రులుగా ప్రియదర్శిని రామ్, రాజశ్రీ నాయర్ నటించారు. రాజశ్రీ నాయర్ ఓన్ డబ్బింగ్ చెప్పినట్టుగా అనిపిస్తోంది. తెలుగు పదాలు పలకడానికి కాస్తంత ఇబ్బంది పడ్డారామె. ఇక హీరో తల్లిదండ్రులుగా హేమ, బెనర్జీ నటించారు. ఎన్నారై పెళ్లికొడుకుగా మిర్చి హేమంత్ అదరగొట్టాడు. భద్రం కామెడీ కూడా సూపర్… వీళ్ళిద్దరూ కనిపించేది రెండు మూడు సీన్స్ లోనే అయినా… సినిమాలో వాళ్ళ ప్రెజెన్స్ చాలా కీలకం. ఇక రాహుల్ రామకృష్ణ తనదైన శైలిలో నవ్వించేశాడు. మధునందన్ కనిపించేది ఒకే ఒక్క సీన్ లో! అతని పాత్ర నుండి పెద్దగా వినోదాన్ని ఆశించలేం. ఇతర ప్రధాన పాత్రలను అదితి, అజయ్ ఘోష్, శత్రు, ఝాన్సీ తదితరులు పోషించారు.
ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే… సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం బాగుంది. పాటల బాణీలు మాత్రం అప్ టు ద మార్క్ లేవు. శ్రీకాంత్ నారోజ్ సినిమాటోగ్రఫీ ఓకే. నిజానికి ఓ సింపుల్ పాయింట్ ను తీసుకుని, డైవర్షన్స్ కు పోకుండా, అనవసరమైన యాక్షన్ సీన్స్ ను యాడ్ చేయకుండా, రెండు గంటల సినిమాగా తీయడం సామాన్య విషయం కాదు. అందుకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాసుకుని దర్శకత్వం వహించిన పద్మశ్రీని మొదట అభినందించాలి. అలానే వీర్ సాగర్ తన స్నేహితులతో కలిసి మొదలు పెట్టిన ఈ సినిమా కథ నచ్చి, దానిని టేకోవర్ చేసిన నిర్మాతలు దిల్ రాజు – శిరీశ్ లనూ అప్రిషియేట్ చేయాలి. రెగ్యులర్ కమర్షియల్ హంగుల్ని ఆశించకుండా, హాయిగా వీకెండ్ లో చూసి ఎంజాయ్ చేయదగ్గ చిత్రం ‘షాదీ ముబారక్’!
ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
ఆకట్టుకునే హాస్య సన్నివేశాలు
దర్శకుడు పద్మశ్రీ కథ, కథనాలు
మైనెస్ పాయింట్స్
ఆకట్టుకోని బాణీలు
ద్వితీయార్ధంలోని లాగ్
రేటింగ్
2.5 / 5
ట్యాగ్ లైన్ : ఇష్క్ ముబారక్!