NTV Telugu Site icon

Radhe Shyam Review : స్లో హోగ‌యా శ్యామ్!?

Radheshyam

Radhe Shyam Review

న‌ట‌వ‌ర్గం: ప్ర‌భాస్, కృష్ణంరాజు, జ‌గ‌ప‌తిబాబు, స‌చిన్ ఖేడేక‌ర్, ప్రియ‌ద‌ర్శి, ముర‌ళి శ‌ర్మ‌, పూజా హెగ్డే, భాగ్య‌శ్రీ‌, కునాల్ రాయ్ క‌పూర్, జ‌య‌రామ్, శేషా ఛ‌ట్రీ
సంగీతం : జ‌స్టిన్
నేప‌థ్య సంగీతం: థ‌మ‌న్
సినిమాటోగ్ర‌ఫీ: మ‌నోజ్ ప‌ర‌మ‌హంస‌
నిర్మాత‌లు: భూష‌ణ్ కుమార్, వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీద‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: రాధాకృష్ణ కుమార్

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్‌’. ఇదిగో అదుగో అంటూ ఎంతో కాలంగా ప్రభాస్ అభిమానులతో పాటు ఆల్ ఇండియా మూవీ లవర్స్ ను ఊరిస్తూ వచ్చిన ‘రాధేశ్యామ్‌’ ఎట్టకేలకు శుక్రవారం వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యింది. ‘అన్ని మంచి శకునములే’ అన్నట్టుగా ఏపీలో టిక్కెట్స్ రేట్స్ పెంచుతూ ప్రభుత్వం కొత్త జీవోను రిలీజ్ చేయడం ‘రాధేశ్యామ్‌’కు బాగా కలిసొచ్చింది. ‘సాహో’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో సహజంగానే ప్రభాస్ అభిమానులలో కాస్తంత ఉత్కంఠ నెలకొంది. అయితే ‘రాధే శ్యామ్’ ఆ సినిమా కంటే పూర్తి భిన్నంగా రూపొందింద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఇంతకూ కథేమిటంటే… జ్యోతిషం, హ‌స్త‌సాముద్రికం వంటి వాటిని చాలామంది ట్రాష్ అని కొట్టేస్తుంటారు. కానీ, అవి కూడా శాస్త్రాలేన‌ని, నూటికి 99 శాతం ఖ‌చ్చితంగా జ‌రిగి తీరుతాయ‌ని, ఏదో ఒక్క శాతం మంది వారికి వారే త‌మ రాత‌ను మార్చుకోగ‌ల‌ర‌ని ప‌ర‌మ‌హంస అనే జ్యోతిష శాస్త్ర‌జ్ఞుడు చెబుతాడు. ఆయ‌న చెప్పిన‌వి తు.చ‌. త‌ప్ప‌క జ‌రుగుతుంటాయి. త‌న శిష్యుడు విక్ర‌మాదిత్య ఇండియాలో ఎమ‌ర్జెన్సీ వ‌స్తుంద‌ని ముందే చెప్పాడ‌నీ ఆయ‌న చెబుతాడు. అంటే ఈ క‌థ 1976 ప్రాంతంలో జ‌రిగింద‌న్న మాట‌! ఇక విక్ర‌మాదిత్య విదేశాల్లో త‌న హ‌స్త‌సాముద్రికంతో అంద‌రినీ ఆక‌ట్టుకుంటూ ఉంటాడు. అదే స‌మ‌యంలో ప్రేర‌ణ అనే అమ్మాయి క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతూ ఉంటుంది. ఆమె విక్ర‌మాదిత్య‌ను ఓ సంద‌ర్భంలో క‌లుసుకుంటుంది. ఆమెపై అత‌ను మ‌న‌సు పారేసుకుంటాడు. కానీ, ఆ విష‌యాన్ని త‌న‌లోనే దాచుకుంటాడు. ప్రేర‌ణ హ‌స్త‌సాముద్రికం చూసి ఆమె నూరేళ్ళు బ‌తుకుతుంద‌ని చెబుతాడు విక్ర‌మాదిత్య‌. తాను కొద్ది రోజుల్లోనే మ‌ర‌ణిస్తున్నాన‌ని ఆమె అంటుంది. ఆమె మ‌న‌సుసైతం విక్ర‌మాదిత్య‌ను కోరుకుంటుంది. తాను జీవించ‌న‌ని భావించిన ప్రేర‌ణ యాక్సిడెంట్ చేసుకుంటుంది. అదే స‌మ‌యంలో క్యాన్స‌ర్ కు మందు క‌నుగొన్నార‌ని, అయితే ఆమె మ‌న‌సు స‌రిగా లేని కార‌ణంగా దానికి రెస్పాండ్ కావ‌డం లేద‌ని తెలుస్తుంది. ఆ స‌మ‌యంలో విక్ర‌మాదిత్య ఆమెకు ఫోన్ చేసి ‘ఐ ల‌వ్ యూ’ చెబుతాడు. దాంతో ప్రేర‌ణ మ‌న‌సు ఊర‌ట చెందుతుంది. వైద్యానికి స‌హ‌క‌రిస్తుంది. ఆమెను చూడ‌కూడ‌ద‌ని భావించి ఉంటాడు విక్ర‌మాదిత్య‌. ఎందుకంటే ఎంద‌రికో పొల్లు పోకుండా జ్యోతిషం చెప్పిన త‌న‌కు జీవితంలో ప్రేమ‌, పెళ్ళి అన్న‌వి లేవ‌ని అత‌నికి తెలుసు. కానీ, ప్రేర‌ణ‌పై ప్రేమ‌తో ఆమెను క‌లుసుకోవ‌డానికి షిప్ లో బ‌య‌లు దేర‌తాడు. అదే స‌మ‌యంలో తుఫాను, అత‌ను ప‌య‌నిస్తున్న షిప్ ప్ర‌మాదానికి గురికావ‌డం జ‌రుగుతాయి. చివ‌ర‌కు విక్ర‌మాదిత్య‌, ప్రేర‌ణ‌ను క‌లుసుకోవ‌డంతో క‌థ సుఖాంత‌మ‌వుతుంది. ఒక్క‌శాతం మంది త‌మ రాత‌ను తామే మార్చుకోగ‌ల‌ర‌ని చెప్పారు క‌దా… ఆ ఒక్క శాతంలో విక్ర‌మాదిత్య‌, ప్రేర‌ణ ఉన్నారని భావించ‌వ‌చ్చు.

కృష్ణంరాజు హోమ్ బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌ చాలా సంవత్సరాల తర్వాత ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయ్యింది. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు వంశీ, ప్రమోద్ తమతో పాటు కృష్ణంరాజు కుమార్తె ప్రసీదకూ నిర్మాతగా చోటిచ్చారు. ఇక పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ సౌత్ వర్షన్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, హిందీ వర్షన్ కు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ వర్క్ చేశారు. ఒకే సినిమా రెండు వర్షన్స్ కు ఇలా వేర్వేరు సంగీత దర్శకులు పనిచేయడం ఈ మ‌ధ్య కాలంలో ఇదే మొదటిసారి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ మరో లెవల్ లో ఉంది. ఇక కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కథానుగుణంగానే కాకుండా, అవసరానికి మించి విఎఫ్ఎక్స్ ను ఉపయోగించుకోవడంతో ప్రతి ఫ్రేమ్ ఓ విజువల్ వండర్ గా మారిపోయింది. ప్రారంభం నుండి ముగింపు వరకూ రేసీగా సాగిన విధానం, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు సీనియారిటీని తెలియచేసింది. ప్రభాస్ ఎప్పుడూ భావించినట్టుగానే యువి క్రియేష‌న్స్ అనేది అతనికి మరో హోమ్ బ్యానర్. అందువల్ల ప్రొడక్షన్స్ విషయంలో ఎలాంటి రాజీ ఆ సంస్థ పడలేదు. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చక్కని ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణగా నిలిచింది. అన్నిటినీ మించి థ‌మ‌న్ నేప‌థ్య సంగీత‌మే సినిమాకు ఆయువు పోసింద‌ని భావించ‌వ‌చ్చు. మొత్తం మీద వీరందరి కృషి ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో నిలబెట్టింది. అతి స్లోగా సినిమా సాగడం పెద్ద మైనస్. ఇది సినిమా ఫలితంపై ప్రభావం చూపే ఆస్కారం ఉంది.

Radhe Shyam Review Rating : 2.5 / 5

ప్లస్ పాయింట్స్:
ప్ర‌భాస్ సినిమా కావ‌డం
పూజా హెగ్డే అందాల అభిన‌యం
థ‌మ‌న్ నేప‌థ్య సంగీతం
విజువ‌ల్ బ్యూటీ
ఇంట్ర‌వ‌ల్ ముందు సీన్

మైనెస్ పాయింట్స్:
న‌త్త న‌డ‌క‌గా సాగిన క‌థ‌నం
పాట‌లు అంత‌గా ఆక‌ట్టుకోక పోవ‌డం
మాస్ హీరోలకు త‌గ్గ ఎలిమెంట్స్ లేక‌పోవ‌డం

ట్యాగ్ లైన్: స్లో హోగ‌యా శ్యామ్!?