ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ గత యేడాది డిసెంబర్ 25న ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీని విడుదల చేశారు. ఇంతవరకూ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలను నిర్మించిన ఆయన బ్యానర్ నుండి వచ్చిన కాస్తంత డిఫరెంట్ మూవీ ‘నిన్నిలా నిన్నిలా’. పలు తమిళ చిత్రాలతో పాటు తాజాగా మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన హీరో అశోక్ సెల్వన్ కు ఇది తొలి తెలుగు సినిమా. ఇక బబ్లీ గర్ల్స్ నిత్యామీనన్, రీతూ వర్మ ఇందులో హీరోయిన్లుగా నటించారు. దివంగత దర్శకుడు ఐ.వి. శశి కుమారుడు అని శశి ఫస్ట్ టైమ్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రస్తుతం జీప్లెక్స్ లో అందుబాటులో ఉంది.
కథ విషయానికి వస్తే…. దేవ్ (అశోక్ సెల్వన్) ఓ షెఫ్. యు.కె.లోని అమరా రెస్టారెంట్ లో ఉద్యోగం రావడంతో హైదరాబాద్ నుండి అక్కడికి వెళతాడు. అతని కంటే నెల రోజుల ముందే తారా (రీతువర్మ) ఆ రెస్టారెంట్ లో షెఫ్ గా చేరుతుంది. ఓవర్ వెయిట్ తో పాటు నరాల బలహీనతతోనూ బాధపడుతుండే దేవ్ ను చూసి కొలిగ్స్ జాలి పడుతుంటారు. ఈ రెండే కాదు… అతనికి ఇన్సోమ్నియా సమస్య కూడా ఉంటుంది. యుక్త వయసులోనే రకరకాల సమస్యలతో బాధపడుతున్న దేవ్ గతం ఏమిటీ? అతని జీవితంలోకి కొత్తగా వచ్చిన తారతో ఎలాంటి అనుబంధం ఏర్పడింది? నిన్నటి రోజున దేవ్ జీవితంలో ఉన్న మాయ (నిత్యామీనన్) ఏమై పోయింది? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది.
అశోక్ సెల్వన్ నటించిన తమిళ చిత్రం ‘ఓ మై కడువులే’ త్వరలో తెలుగులో రీమేక్ కాబోతోంది. ఈ సినిమాకు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. నటుడిగా అతనికంటూ ఓ గుర్తింపును తక్కువ సినిమాలతోనే అశోక్ తెచ్చుకున్నాడు. ఇందులో వంద కేజీలకు పైగా బరువువుండే యువకుడి పాత్ర పోషణ కోసం గట్టి ప్రయత్నమే అశోక్ చేశాడు. ఏకంగా ఇరవై కేజీల బరువు పెరిగాడు. పోస్థటిక్ మేకప్ ను ఉపయోగించినా తన వంతు ప్రయత్నం అతనూ చేశాడు. కొన్ని సన్నివేశాల్లో అతని ఆకారాన్ని, బాడీ లాంగ్వేజ్ ను చూస్తే ‘ఇంద్రుడు చంద్రుడు’లోని సీనియర్ కమల్ హాసన్ పాత్ర జ్ఞప్తికి వస్తుంది. రీతువర్మ ఇప్పుడిప్పుడే నటిగా తానేమిటో నిరూపించుకుంటోంది. ఈ సినిమాలో ఆమె నటన చాలా హుందాగా, సెటిల్డ్ గా బాగుంది. నిత్యా మీనన్ ద్వితీయార్థంలోనే తెర మీదకు వచ్చినా… మాయా పాత్రలో ఒదిగిపోయింది. ముఖ్యంగా దేవ్ – మాయా మధ్య ఉండే ఫ్రెండ్ షిప్ అండ్ లవ్ కెమిస్ట్రీ… నిత్యామీనన్ సహజ నటన కారణంగా ఎలివేట్ అయ్యింది. ఈ సినిమాను ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మార్చింది నిత్యామీనన్ అనే చెప్పాలి. ఇందులో మరో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి నాజర్. లండన్ లోని అమరా రెస్టారెంట్ ఓనర్ కమ్ చీఫ్ షెప్ గా ఆయన చక్కని పాత్రను పోషించారు. కమెడియన్ సత్య పాత్ర కూడా చాలా బాగుంది. హీరో తల్లిదండ్రులుగా సంధ్యా జనక్, కేదార్ శంకర్ నటిస్తే, నిత్యా మీనన్ తల్లిగా కల్పవల్లి, సైకియాట్రిస్ట్ గా బ్రహ్మాజీ నటించారు.
సహజంగా ఇలాంటి సింపుల్ రొమాంటిక్ లవ్ స్టోరీస్ అన్ని వర్గాలను ఆకట్టుకోవు. పైగా అది రెస్టారెంట్ బ్యాక్ డ్రాప్ లో షెఫ్స్ కు సంబంధించిన కథ అయినప్పుడు! ఆ వాస్తవాన్ని గ్రహించే కాబోలు నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ దీనిని థియేట్రికల్ రిలీజ్ చేయకుండా, జీప్లెక్స్ లో పే ఫర్ వ్యూ సిస్టమ్ లో చూసే సదుపాయం కల్పించారు. ఇందులో చిన్నప్పటి నుండీ స్నేహితులుగా మెలిగే దేవ్, మాయ మధ్య ఉన్న అనుబంధాన్ని కాస్తంత అతిగానే చూపించారు. ఒకే కంచం.. ఒకే మంచంగా వారు యుక్తవయసు వచ్చాక కూడా మెసలడం అనేది కాస్తంత ఎబ్బెట్టుగా ఉంది. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే… ‘కేశవ, రణరంగం’ వంటి తెలుగు సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించిన దివాకర్ మణి ఈ చిత్రానికి వర్క్ చేశాడు. అతని కెమెరాపనితనం, లైటింగ్ ప్యాట్రన్ అద్భుతం. సీనియర్ సినిమాటోగ్రాఫర్స్ ను గుర్తు చేశాడు. లండన్ తో పాటు చార్మినార్ సమీపంలో తీసిన సన్నివేశాలు చాలా బాగున్నాయి. రాజేశ్ మురుగేశన్ సంగీతం ఈ సినిమాకు మరో హైలైట్. ఆర్టిస్టుల హావభావాలకు, బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా మైన్యూట్ డీటేల్స్ ను గుర్తించి చక్కని నేపథ్య సంగీతం అందించాడు. గతంలో అశోక్ సెల్వన్ – అని శశి కలిసి ‘మాయా’ అనే షార్ట్ ఫిల్మ్ చేశారు. అంతర్జాతీయంగా దానికి మంచి గుర్తింపు వచ్చింది. తొలిసారి తాను దర్శకత్వం వహిస్తూ అశోక్ సెల్వన్ నే హీరోగా పెట్టుకోవడం ఓ విశేషం అయితే… ఇందులోని నిత్యామీనన్ పాత్రకు మాయా అనే పేరు పెట్టడం మరో విశేషం. ఈ మూవీని తమిళంలో ‘తీని’ పేరుతో అని శశి తెరకెక్కించాడు. హీరో అశోక్ సెల్వన్, దర్శకుడు అనికి అక్కడ ఉన్న గుర్తింపు కారణంగా తమిళులను ఈ సినిమా ఎక్కువ ఆకట్టుకునే ఆస్కారం ఉంది. ఏదేమైనా… రొటీన్ కమర్షియల్ సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వకుండా బీవీఎస్ఎన్ ప్రసాద్ లాంటి సీనియర్ నిర్మాత ఇలాంటి చిన్న చిన్న ఫీల్ గుడ్ సినిమాలనూ అప్పుడప్పుడు తీస్తుంటే బాగానే ఉంటుంది.
ప్లస్ పాయింట్స్
ప్రధాన తారాగణం నటన
ఆకట్టుకునే దివాకర్ మణి సినిమాటోగ్రఫీ
హృదయానికి హత్తుకునే సంగీతం
మైనెస్ పాయింట్స్
ఆసక్తి రేకెత్తించని టైటిల్
కాస్తంత తమిళ వాసనలు
రేటింగ్ 2.25 / 5
ట్యాగ్ లైన్
రొమాంటిక్ డ్రామా!