NTV Telugu Site icon

రివ్యూ : కోర్టు డ్రామాలో కొత్త పాయింట్ ‘నాంది’

పేరుకు ముందు తొలి చిత్రం పేరు ‘అల్లరి’ని ఏ ముహూర్తాన పెట్టుకున్నాడో కానీ నరేశ్ కు అన్నీ అల్లరి చిల్లరి వినోదాత్మక చిత్రాలే వచ్చాయి. ఇంతవరకూ నరేశ్ నటించిన 57 సినిమాల్లో పై ఏడు సినిమాల్లో కొంత భిన్నమైన పాత్రలను నరేశ్ చేశాడనిపిస్తుంది. ఆ కోవలో వచ్చిన మరో చిత్రం ‘నాంది’. కామెడీ హీరోగా ముద్ర పడిన నరేశ్ లోకి నటుడిని వెలికి తీసిన చిత్రాల సరసన ‘నాంది’ సైతం నిలబడుతుంది. విజయ్ కనకమేడల ను దర్శకుడిగా పరిచయం చేస్తూ సతీశ్ వేగేశ్న నిర్మించిన ‘నాంది’ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. 

కథ విషయానికి వస్తే…. బండి సూర్య ప్రకాశ్ (నరేశ్) సాఫ్ట్ వేర్ ఇంజనీర్. తల్లిదండ్రులు, స్నేహితుడు సంతోష్ (ప్రవీణ్) అతని లోకం. ఉద్యోగంలో కుదురుకోగానే అతనికి మీనాక్షి (నవమి)తో పెళ్ళి నిశ్చయం అవుతుంది. త్వరలో సూర్య ఓ ఇంటివాడు అవుతాడనగా, పౌరహక్కుల నేత రాజగోపాల్ (సీవీఎల్) హత్య కేసులో అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఐదేళ్ల పాటు అతని జీవితం జైల్లోనే మగ్గిపోతుంది. లాయర్ ఆద్య (వరలక్ష్మీ శరత్ కుమార్) సాయంతో సూర్య జైలు నుండి ఎలా బయటకు వచ్చాడు? చేయని నేరానికి తనని జైలుపాలు చేసిన వారిపై చట్టప్రకారంగా ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది మిగతా కథ. 

కోర్టు డ్రామాలు తెలుగులో ఇప్పటికే చాలా వచ్చాయి. అలానే నిరపరాధులు జైళ్లలో యేళ్ల తరబడి ఎలా మగ్గిపోతున్నారో కూడా కొన్ని సినిమాలలో చూపించారు. చేయని నేరానికి శిక్షను అనుభవించే వారిని జైలు నుండి విడిపించడంతో చాలా సినిమాలకు శుభం కార్డు పడుతుంటుంది. కానీ అందుకు కారకులైన వ్యక్తులను ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 211 ప్రకారం కోర్టు బోనులో ఎలా  నిలబెట్టవచ్చో ‘నాంది’లో చూపించారు. రాజకీయ నేతలతో పోలీసు అధికారులు చేతులు కలిపితే జరిగే అనర్థాలను చూపిస్తూనే, న్యాయ వ్యవస్థ ద్వారా వాటిని ఎలా కట్టడి వేయవచ్చో దర్శకుడు విజయ్ కనకమేడల ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. రొటీన్ కోర్టు డ్రామాలకు ఇది కాస్తంత భిన్నమైన చిత్రం.

గతంలో నరేశ్ నటించిన ‘నేను’, ‘గమ్యం’, ‘శంభో శివ శంభో’… అలానే ఇటీవల వచ్చిన ‘మహర్షి’ సినిమాల్లో ఎంత ప్రాణం పెట్టి ఆ పాత్రలు చేశాడో ఇందులోనూ అలాంటి కష్టమే పడ్డాడు. ఓ రకంగా చెప్పాలంటే ఇంకా ఎక్కువ కష్టపడ్డాడు. బోల్డ్ సీన్స్ లో నటించడానికి మొహమాటపడలేదు. అండర్ ట్రయల్ ఖైదీల మనోవేదనను తన నటన ద్వారా చూపించాడు. మలయాళీ అమ్మాయి నవమికి ఇది తొలి తెలుగు సినిమా. నరేశ్ హైట్ కు తగ్గ హీరోయిన్ ను దర్శక నిర్మాతలు బాగానే ఎంపిక చేశారనిపిస్తుంది. లాయర్ ఆద్య గా కాస్తంత లేట్ ఎంట్రీ ఇచ్చినా వరలక్ష్మీ శరత్ కుమార్ ద్వితీయార్ధాన్ని తన భుజస్కందాలపై వేసుకుని నడిపించింది. హీరో తండ్రిగా దేవీప్రసాద్, సీఐ కిశోర్ గా హరీశ్ ఉత్తమన్, మాజీ హోం మినిస్టర్ గా వినయ్ వర్మ, దొంగ సాక్ష్యాలు చెప్పే వ్యక్తిగా కృష్ణేశ్వరరావు, లాయర్ గా శ్రీకాంత్ అయ్యంగార్ చక్కగా నటించారు. హీరోకి అండగా నిలిచే పాత్రలకు ప్రియదర్శి, ప్రవీణ్ పూర్తి న్యాయం చేకూర్చారు. 

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే… ఈ కోర్టు డ్రామాలో పేజీల కొద్ది డైలాగ్స్ రాయకుండా, పొదుపైన, అర్థవంతమైన పదాలను ఉపయోగించి అబ్బూరి రవి ఆకట్టుకున్నాడు. చైతన్యప్రసాద్ రాసిన నేపథ్య గీతం కథలోని అంశాన్ని ఎలివేట్ చేసింది. శ్రీచరణ్‌ పాకాల సంగీతం, సిద్ సినిమాటోగ్రఫీ బాగుంది. కొత్తవాడే అయినా దర్శకుడు విజయ్ అనుభవజ్ఞుడిలా దీనిని తెరకెక్కించాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా చివరి వరకూ చక్కగా సాగిపోతుంది. అయితే… కేవలం మీడియా దృష్టిని మళ్ళించడం కోసమే పౌరహక్కుల నేతను హత్యచేయడమనే పాయింట్ లో పెద్దంత బలం లేదు. అండర్ ట్రయల్ ఖైదీల విడుదల కోసం కేంద్రమంత్రినే కలిసిన రాజగోపాల్ ను అదే అంశం మీద హత్య చేసినట్టు చూపించి ఉంటే ఇంకా బాగుండేది. ఇక క్లయిమాక్స్ లో హీరో దారుణమైన గాయాలతో కోర్టు బోనులో ఎలా ప్రత్యక్షమయ్యాడనే దానికి ఆధారం చూపలేదు. నిజానికి ప్రథమార్థంలోని టెంపో, ద్వితీయార్ధంలో కొంత మిస్ అయ్యింది. సెకండ్ హాఫ్ రొటీన్ ఫార్ములా మూవీని తలపించింది. 

కమర్షియల్ గా ఎంతటి సక్సెస్ ను ఈ చిత్రం సాధిస్తుందనే దానిని పక్కన పెట్టి, దర్శక నిర్మాతలు తొలియత్నంగా ఇలాంటి కథను ఎంపిక చేసుకోవడాన్ని అభినందించాలి. కాస్తంత భిన్నమైన కథలను కోరుకునే వారికి, కోర్డు డ్రామాలను ఇష్టపడే వారికి ‘నాంది’ నచ్చుతుంది. ముఖ్యంగా నరేశ్ అభినయం కూడా!

ప్లస్ పాయింట్స్

కథలోని కొత్తదనం
‘అల్లరి’ నరేశ్ నటన
సాంకేతిక నిపుణుల ప్రతిభ

మైనెస్ పాయింట్స్

టెంపో తగ్గిన ద్వితీయార్థం
ఊహకందే ముగింపు

రేటింగ్2.5 / 5

ట్యాగ్ లైన్: కోర్టు డ్రామాలో కొత్త పాయింట్!

Show comments