మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మరక్కార్’. ఈ పిరియడ్ వార్ బేస్డ్ మూవీ విడుదలకు ముందే మూడు జాతీయ అవార్డులను అందుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్స్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరిల్లో అవార్డులను పొందింది. ప్రియదర్శన్ మలయాళంలో అత్యధిక చిత్రాలను మోహన్ లాల్ తోనే చేశాడు. అందులో అనేక చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో భారీ వ్యయంతో, భారీ తారాగణంతో తెరకెక్కిన ‘మరక్కార్’ పైనా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇది 16వ శతాబ్దానికి చెందిన కథ. భారతదేశంలోకి పోర్చుగీసు వారు అడుగుపెట్టి, ఇక్కడి రాజ్యాలను కబళించాలని చూస్తున్న సమయమది. కేరళ సముద్ర తీర ప్రాంతంలో మరక్కార్ వంశీయులు, స్థానిక రాజులకు అండగా ఉంటూ, పరాయి దేశస్థులు ఈ దేశం మీద దాడికి రాకుండా అడ్డుపడుతుంటారు. ఆ వంశానికి చెందిన కుంజారీ మనక్కార్ కథ ఇది. సాముద్రిక రాజును పోర్చుగీసు వారు తమ అధీనంలోకి తీసుకోవాలని చూసినప్పుడు మనక్కార్ తాత తన పరివారంతో పోరుకు దిగి, కొడుకును పోగొట్టుకుంటాడు. అప్పటి నుండి పోరాటాలకు దూరంగా ఉంటాడు. మనవడు మహ్మద్ అలీ ఉరఫ్ కంజారీకి ఆయేషాతో పెళ్ళి చేసి ప్రశాంత జీవితం గడపాలనుకుంటాడు. వీరంతా కలిసి నిఖాకు వెళుతుండగా పోర్చుగీసు సైనికులు దారి కాచి, వారి కుటుంబాన్ని మట్టుపెడతారు. కంజారీ, అతని బాబాయి పట్టు మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి మరక్కార్ ఎలా పగ తీర్చుకున్నాడు? సాముద్రిక రాజు ను సామంతులు ఇబ్బంది పెట్టినప్పుడు, పరాయి దేశీయులు దాడికి దిగినప్పుడు ఎలా అండగా నిలిచి, తన మాతృభూమిని కాపాడాడు? ఆ క్రమంలో ఎలా ప్రాణాలను అర్పించాడు? అనేదే ఈ చిత్ర కథ.
భారతదేశ స్వాతంత్ర అమృతోత్సవాలు జరుగుతున్న ఈ సమయంలో దేశభక్తిని ప్రేరేపించే ‘మరక్కార్’ చిత్రం రావడం విశేషం. ముస్లింలు పరాయిదేశం నుండి ఇక్కడికి వచ్చినా, శతాబ్దాలుగా ఇక్కడే ఉండటంతో దీన్ని మాతృభూమిగానే భావిస్తూ ఉన్నారు. అదే భావన మరక్కార్ లోనూ మనకు కనిపిస్తుంది. తన మాతృదేశాన్ని కాపాడటం కోసం ప్రాణాలను పణంగా పెట్టి, పరాయి దేశీయులతో పోరాడిన ఆ యోధుడి కథను ప్రియదర్శన్ హృదయానికి హత్తకునేలా తెరకెక్కించాడు. అయితే, ఈ తరం ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ఆలోచనతో అప్పటి భాష, వ్యవహారశైలికి కాస్తంత దూరంగా సినిమాను తీశాడు. ఈ కథ కంజారీ యవ్వనం నుండి వీర మరణం వరకూ సాగుతుంది. పోర్చుగీసు సైనికుల దాడి నుండి ప్రాణాలను దక్కించుకున్న కంజారీ ఆ తర్వాత రాబిన్ హుడ్ తరహాలో ప్రజలను ఆదుకోవడం, వెన్నుపోటు దారుల నుండి తప్పించుకోవడం, అనివార్యంగా అతను చేసే కొన్ని తప్పులు, తెలియక చేసే కొన్ని హత్యలు, చివరకు పోర్చుగీసు వారి చేతికి చిక్కి, వీరమరణం పొందడం ఇదంతా ఓ పెద్ద కథ. కంజారీ మరక్కార్ గాథను వివరంగా చెప్పడం కోసం ప్రియదర్శన్ ఏకంగా మూడు గంటల సమయం తీసుకున్నాడు.
యువకుడైన కంజారీగా మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ నటించాడు. సినిమా ప్రారంభమైన 45 నిమిషాల తర్వాతే మనకు మోహన్ లాల్ తెర మీద కనిపిస్తాడు. అయితే తండ్రీ కొడుకులిద్దరూ ఒకేలా ఉండటంతో మనకు మోహన్ లాల్ మొదటి నుండి లేడనే భావన కలగదు. మోహన్ లాల్ ఎంత యాక్టివ్ గా నటించినా, వయసు ప్రభావం ఆ పాత్ర మీద బాగానే పడింది. ఎందుకో ఆయన పూర్తి స్థాయిలో మరక్కార్ పాత్రలో ఒదిగిపోలేదనే భావన కలుగుతుంది. యువ కంజారీ ప్రియురాలిగా కళ్యాణీ ప్రియదర్శన్ నటించగా, కంజారీ స్నేహితుడు చింగారిగా థాయ్ లాండ్ నటుడు జయ్ జె జక్రిత్, అతని ప్రియురాలిగా జాతీయ ఉత్తమనటి కీర్తి సురేశ్ నటించారు. ఇక కంజారీతో అనివార్యంగా పోరుకు తలపడే మంగాత్తచన్ కుమారుడు అనంత్ గా అర్జున్ సర్జా నటించాడు. అతని తమ్ముడు అనంత్ గా, మరో కీలక పాత్రను అశోక్ సెల్వన్ చేశాడు. ప్రముఖ మలయాళ నటుడు హరీశ్ మంగాత్తచన్ పాత్రకు ప్రాణం పోశాడు. విశేషం ఏమంటే హరీశ్ ‘మిషన్ ఇంపాజిబుల్’ మూవీతో తెలుగులోకి అడుగు పెడుతున్నాడు. తమిళ నటుడు ప్రభుతో పాటు సుహాసిని, మంజు వారియర్, సిద్ధిక్, నెడుమూడి వేణు, సునీల్ శెట్టి తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. అయితే… సుదీర్ఘంగా సాగే కథలో ఏ పాత్ర కూడా బలమైన ముద్రను ప్రేక్షకుల మనసులపై వేయలేకపోయింది.
తిరు సినిమాటోగ్రఫీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళింది. మరీ ముఖ్యంగా వార్ సీన్స్ తో పాటు సముద్రంలోని పోరాట సన్నివేశాలు మూవీకి హైలైట్ గా నిలిచాయి. రాహుల్ రాజ్, అంకిత్ సూరి, రోనీ రాఫెల్, లియెల్ ఎవాన్స్ రోడర్ సమకూర్చిన సంగీతం ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసింది. సినిమా నిడివి విషయంలో ప్రియదర్శన్ కాస్తంత జాగ్రత్త పడి ఉంటే, ఇది మరింతగా జనాదరణ పొందడానికి అవకాశం ఉండేది. గతంలో వచ్చిన ఇండియన్ పిరియడ్ వార్ మూవీస్ ను ‘మరక్కార్’ గుర్తు చేస్తుంది. మరీ ముఖ్యంగా కొన్ని పోరాట సన్నివేశాలు ‘బాహుబలి’ జ్ఞప్తికి తెస్తాయి. నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ ఎక్కడా రాజీ పడలేదనేది అర్థమౌతోంది. ఏదేమైనా మోహన్ లాల్, ప్రియదర్శన్ సంయుక్తంగా చేసిన ఈ భారీ ప్రయత్నాన్ని అభినందించాలి. కానీ మరింత ప్రేక్షకదారణ పొందేలా ‘మరక్కార్’ను తీసి ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్
పిరియడ్ వార్ మూవీ కావడం
నటీనటుల నటన ప్రతిభ
సాంకేతిక నిపుణుల పనితనం
మైనెస్ పాయింట్స్
రన్ టైమ్ ఎక్కువ కావడం
ఆకట్టుకోని కథనం
రేటింగ్ : 2.5 / 5
ట్యాగ్ లైన్: మనసు దోచని ‘మరక్కార్’!