NTV Telugu Site icon

Review : మళ్ళీ మొదలైంది (జీ 5)

Malli Modalaindi

వరుస పరాజయాలతో సాగుతున్న సుమంత్ ‘మళ్ళీ రావా’ మూవీతో మళ్ళీ కాస్తంత లైమ్ లైట్ లోకి వచ్చాడు. బాహుశా ఆ సెంటిమెంట్ తోనే కావచ్చు అతని లేటెస్ట్ మూవీకి ‘మళ్ళీ మొదలైంది’ అనే టైటిల్ పెట్టారు. సుమంత్, వర్షిణి సౌందర్ రాజన్, నైనా గంగూలి ప్రధాన పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ శుక్రవారం నుండి జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది.

హీరో మసాలా అధినేత్రి సుజాత (సుహాసిని) సింగిల్ మదర్. ఆమె తల్లి శారద (అన్నపూర్ణ). చిన్నప్పటి నుండి అమ్మ, అమ్మమ్మ సంరక్షణలో పెరిగిన విక్రమ్ (సుమంత్) మంచి చెఫ్‌ అవుతాడు. తాను ప్రేమించిన నిషా (వర్షిణీ సౌందర్ రాజన్)ను ఇంట్లోవాళ్ళకి పరిచయం చేసి వారి ఆమోదంతో పెళ్ళి చేసుకుంటాడు. అయితే… నాలుగేళ్ళకే ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చి, విడాకులు తీసుకుంటారు. విక్రమ్ తరఫున కుటుంబరావు (పోసాని) ఈ కేసును వాదిస్తే, నిషా తరఫున లాయర్ పవిత్ర (నైనా గంగూలీ) కోర్టుకు హాజరవుతుంది. కోర్టు ఆవరణలో పవిత్రను మొదటి సారి చూసినప్పుడే ఆమె పట్ల విక్రమ్ లో ఓ పాజిటివ్ వైబ్ ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆమె లాయర్ వృత్తి మానేసి ‘రీసెట్’ అనే సంస్థను ప్రారంభిస్తుంది. అందులో చేరి, ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు విక్రమ్. అతని ఆలోచనలను గుర్తించి పవిత్ర కొంతకాలం డేటింగ్ తర్వాత పెళ్ళి ప్రపోజల్ పెడుతుంది. దానికి విక్రమ్ ఎలా స్పందించాడు? విక్రమ్ సెకండ్ మ్యారేజ్ పై అతని మాజీ భార్య రియాక్షన్ ఏమిటీ? విక్రమ్ విడాకులకు పరోక్ష కారణమైన అతని ఫ్రెండ్ వైశాలి ఈసారి ఏం చేసింది? అనేదే ఈ చిత్రం.

లైఫ్‌ ఆఫ్టర్ డైవర్స్ అనేది ప్రధానాంశంగా దర్శకుడు టి. జి. కీర్తి కుమార్ ఈ కథను తయారు చేసుకున్నాడు. అయితే… ఆ పాయింట్ ను ఆమోదయోగ్యంగా తెరకెక్కించడంలో మాత్రం తడబడ్డాడు. నిజానికి ఈ కథను తెర మీద చూస్తున్నప్పుడు హీరో సుమంత్ నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలతో వీక్షకుడు కనెక్ట్ అవుతాడు. అలా అవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా షూటింగ్ కోసం ప్రింట్ చేసిన వెడ్డింగ్ కార్డ్ ను మూవీ పబ్లిసిటీకి ఉపయోగించారు. కొందరు తెలియక సుమంత్ మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడని భావించేలా చేశారు. దానికి దర్శకుడు వర్మ తనదైన శైలిలో ట్విట్ చేసి, అగ్నికి ఆజ్యం జోడించాడు. చివరకు ఇదంతా కావాలని చేసిన పబ్లిసటీ స్టంట్ అని అర్థమైపోయింది. అసలు విషయం లేనప్పుడే ఇలాంటి వాటి వెనుక పడాల్సి ఉంటుంది. ఈ సినిమాలోనూ బలమైన పాయింట్ అంటూ ఏదీ లేదు. ‘రీసెట్’ అనే కాన్సెప్ట్ మాత్రం కాస్తంత యూనిక్ గా ఉంది. కానీ ఆ చిన్న లైన్ ను బేస్ చేసుకుని రెండు గంటల సినిమా తీయడం అంత సులువేం కాదు. అందుకే డైరెక్టర్ అసలు కథ మధ్యలో వెన్నెల కిశోర్ కామెడీని జొప్పించి ముందుకు లాక్కెళ్ళే ప్రయత్నం చేశాడు. ప్రేమ వరకూ ఓకే, కానీ పెళ్ళికి నాట్ ఓకే అనే పాయింట్ మీద తెలుగులో చాలానే సినిమాలు వచ్చాయి. ఇదీ ఒక రకంగా అలాంటిదే. ఒకసారి జీవితంలో దెబ్బ తిన్న వ్యక్తిగా హీరో రెండో పెళ్ళికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడానికి కొంత టైమ్ కోరుకుంటాడు. ఈ లోగా అతన్ని దారిలోకి తీసుకు రావడం కోసం హీరోయిన్ డ్రామా ఆడటమనేది తేలిపోయింది. పైగా సినిమా అంతా స్లో మోషన్ లో సాగుతున్న భావన కలుగుతుంది. తెర మీద వెన్నెల కిశోర్ కనిపించిన సన్నివేశాలు మాత్రమే వీక్షకులలో కాస్తంత ఎనర్జీని నింపాయి.

సుహాసిని, అన్నపూర్ణమ్మ వంటి సీనియర్ ఆర్టిస్టుల కారణంగా కొన్ని సన్నివేశాలు సహజత్వంతో బాగున్నాయి. సుమంత్ సైతం చక్కగా నటించాడు. అయితే హీరోయిన్లు వర్షిణి, నైనా ఇద్దరిలోనూ పెద్దంతగా ఎక్స్ ప్రెషన్స్ పండలేదు. నైనా అయితే మరీ దారుణం. వారితో పోల్చితే కొంతలో కొంత పావనీ రెడ్డి బెటర్! పోసాని తనదైన పంథాలోనే నటించాడు. కోర్టులో జడ్జిగా పృథ్వీరాజ్ కనిపించేది కాసేపే అయినా డైలాగ్ మాడ్యులేషన్ తో ఆకట్టుకున్నాడు. థెరపిస్ట్ పాత్రలో ఘట్టమనేని మంజుల తెర మీద కనిపించగానే, ఆమెతో దర్శకుడు ఏదో వండర్ క్రియేట్ చేయబోతున్నాడనే భావన కలుగుతుంది. కానీ ఐదారు నిమిషాల ఎపిసోడ్ కోసం ఆమెను ఉపయోగించారు. అలానే వెన్నెల కిశోర్, సరయు మధ్య కోర్టులో జరిగే సంభాషణలు కాస్తంత అతిగా ఉన్నాయి. జడ్జి ముందు అలాంటి సంభాషణలు పలికించడం, కోర్టులోనే భర్త మీద సరయు చేయి చేసుకోవడం… వీటన్నింటినీ కామెడీ కింద తీసుకోవాల్సిందే. పాపం ఈ మధ్యే ఆమెకు తలనొప్పిగా పరిణమించిన ఓ కేసు విషయంలో సారీ చెప్పింది. అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం బాగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఏమంత గొప్పగా లేవు. శివ సినిమాటోగ్రఫీ ఓకే. థియేటర్లలో కాకుండా ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతోంది కాబట్టి టైమ్ పర్మిట్ చేస్తే ఓసారి చూడొచ్చు. మొత్తం మీద డైవర్స్ కు సంబంధించి ఏదో మోటివేషన్ క్లాస్ కు వెళ్ళిన అనుభూతిని ఈ సినిమా కలిగించే ఆస్కారం ఉంది.

రేటింగ్: 2.25 / 5

ప్లస్ పాయింట్స్
సుహాసిని, సుమంత్ నటన
వెన్నెల కిషోర్ కామెడీ
ఆకట్టుకునే సంభాషణలు

మైనెస్ పాయింట్స్
బలహీనమైన కథ
సహనాన్ని పరీక్షించే కథనం

ట్యాగ్ లైన్: మోటివేషన్ క్లాస్!