NTV Telugu Site icon

రివ్యూ: ఎల్.కె.జి. (ఆహా)

LKG Telugu Movie Review

LKG Telugu Movie Review

ఆర్. జె. బాలాజీ ఇవాళ కోలీవుడ్ లో ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తున్న హీరో. గత యేడాది వచ్చిన నయనతార ‘అమ్మోరు తల్లి’తో తెలుగువారికి కాస్తంత చేరువయ్యాడు. దానికి ఏడాది ముందే అతను నటించిన ‘ఎల్.కె.జి.’ చిత్రం తమిళనాడులో విడుదలై విజయం సాధించింది. ఇప్పుడా సినిమాను శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ పొలిటికల్ సెటైర్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం…

లంకవరపు కుమార్ గాంధీ (ఆర్.జె. బాలాజీ)ని అందరూ షార్ట్ కట్ లో ఎల్.కె.జి. అని పిలుస్తుంటారు. అతని తండ్రి (నాంజి సంపత్) ఓ విఫలమైన రాజకీయ నేత. అధికార పార్టీ తరఫున ఊరంతా తిరిగి ఉపన్యాసాలు ఇస్తాడు తప్పితే, ఏ రోజునా అధికారాన్ని అనుభవించిన వాడు కాదు. దాంతో తాను తండ్రిలాగా కాకూడదని, ఎలాగైనా లీడర్ గా ఎదగాలని ఎల్.కె.జి. అనుకుంటాడు. దానికి తగ్గట్టుగానే జనాలను మెప్పించి, అధికార పార్టీ తరఫున కౌన్సిలర్ గా గెలుస్తాడు. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అనారోగ్యంతో కన్నుమూస్తాడు. దాంతో ఆయన నియోజకవర్గంలో జరిగే బై ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ ఎల్.కె.జి.కి లభిస్తుంది. అయితే… గతంలో ముఖ్యమంత్రి కోసం తన సీటును త్యాగం చేసిన రామచంద్ర ప్రసాద్ (జె.కె. రితీష్) ఈసారి తానే ఎన్నికల బరిలో దిగి, సీ.ఎం. క్యాండెట్ కావాలని అనుకుంటాడు. అప్పటికే తాత్కాలిక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఉప ముఖ్యమంత్రి భోజప్ప (జి. రామ్ కుమార్) ఎలాగైన రామచంద్ర ప్రసాద్ ఓడిపోవాలని కోరుకుంటాడు. తన ప్రయత్నం మాత్రమే సరిపోదని భావించిన ఎల్.కె.జి. గెలుపు కోసం పోల్ మేనేజ్ మెంట్ కంపెనీతో ఒప్పందం చేసుకుంటాడు. ఆ రకంగా లేడీ ప్రశాంత్ కిశోర్ లాంటి సరళ (ప్రియా ఆనంద్) ఎల్.కె.జి. జీవితంలోకి అడుగుపెడుతుంది. ఎమ్మెల్యేగా గెలిచి, ఆ పైన సీఎం కావాలని కలలు కన్న ఎల్.కె.జి. కోరిక తీరిందా? సీఎం కుర్చీపై కన్నేసిన రామచంద్ర ప్రసాద్ ఎలాంటి పాచికలు వాడాడు? అతని ఎత్తుగడలను పోల్ మేనేజ్ మెంట్ ఏజెన్సీ ఎలా చిత్తు చేసింది? అనేది మిగతా సినిమా.

రాజకీయ నేతలు అధికార పీఠాన్ని అధిరోహించడానికి, పదవిని కాపాడుకోవడానికి ఎలాంటి ఎత్తులు, జిత్తులు ఉపయోగిస్తారనేది ఈ సినిమాలో చూపించారు. అయితే… ఈ తరహా పొలిటికల్ సెటైర్ మూవీస్ గతంలో చాలానే వచ్చాయి. కానీ ఎలాంటి ఇమేజ్ లేని ఆర్.జె. బాలాజీ ఈ మూవీని చేయడంతో జనం ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాకు కథను తన మిత్రులతో కలిసి ఆర్జే బాలాజీనే రాసుకున్నాడు. ఓ సాధారణ కౌన్సిలర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం అనేది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించొచ్చు. కానీ రాష్ట్రంలో ఉన్నత పదవులను అందిపుచ్చుకున్న ఎంతో మంది నేతలు తమ రాజకీయ ప్రస్థానాన్ని సర్పంచ్ పదవి నుండి మొదలు పెట్టిన వారే. అయితే… ఇప్పుడు సోషల్ మీడియాను నమ్ముకున్న వారికి క్రేజ్ నిమిషాల్లో లభిస్తోంది. పాపులారిటీ గంటల్లో వచ్చేస్తోంది. ఇందులో ఎల్.కె.జి. సైతం అదే పంథాను ఎంచుకోవడంతో ఇలా జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదనే భావన ప్రేక్షకులకు కలుగుతుంది. కానీ ఎమ్మెల్యేల సపోర్ట్ లేకుండా ఠక్కున ఎల్.కె.జి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది మాత్రం పూర్తిగా సినిమాటిక్ గా ఉంది.

ఆర్. జె. బాలాజీ నటనలో చాలా ఈజ్ ఉంది. కానీ అతనికీ, పోల్ మేనేజ్ మెంట్ చేసే సరళకు మధ్య ఉన్న ప్రేమ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేదు. దాని మీద దర్శకుడు కె. ఆర్. ప్రభు దృష్టి పెట్టినట్టే కనిపించదు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ చక చకా సాగిపోతుంది. ఇంగ్లీష్‌ మీడియం స్కూల్ లో సీటు సంపాదించడం కోసం, ప్రభుత్వ కాంట్రాక్ట్స్ లో లంచం పొందడం కోసం కౌన్సిలర్ ఎల్.కె.జీ. చేసే విన్యాసాలు ఆసక్తికరంగానూ, సరదాగానూ ఉన్నాయి. ఈ సన్నివేశాలలో మల్లూరి వెంకట్ రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ‘గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కావాలి… గవర్నమెంట్ స్కూల్స్ పనికిరావు’, ‘రాజకీయ నాయకుడు ఇచ్చేదే బయటకు తెలియాలి, తీసుకునేది అస్సలు తెలియకూడదు’ వంటివి సందర్భోచితంగా ఉన్నాయి. ‘ఇంకెన్ని రోజులు… ఇలా ఇంకెన్ని రోజులు దోచేరు దొంగలు జాతిని… మన జాతిని… భరత జాతిని’ అనే పాట సినిమాలో అప్పుడప్పుడూ నేపధ్యంలో వస్తుంటుంది. అది బాగుంది. టైటిల్స్ సమయంలో వచ్చిన బిట్ సాంగ్ ‘తెలుగోడా రారా… తల ఎత్తి రారా… ధరణినేల రారా’ అనేది కూడా చక్కగా ఉంది. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘సిత్తరాల సిరపడు’ సాంగ్ ను ఇందులో చక్కగా వాడేసుకున్నారు. అయితే… సినిమాను డబ్బింగ్ చేసిన క్రమంలో కొన్ని చోట్ల పేపర్ కటింగ్స్ ను, హోర్డింగ్స్ ను, టీవీ ఛానెల్స్ లోని స్క్రోలింగ్స్ ను తెలుగులో పెట్టి ఉండాల్సింది. ఆ విషయంలో నిర్మాతల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందించగా, లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చారు.

ఎల్.కె.జి. అవినీతి పరుడైన రాజకీయ నాయకుడే అయినా… అతని నోటి వెంట చివరిలో చెప్పించిన డైలాగ్స్ ఆలోచింపచేస్తాయి. తుపాకీ కంటే ఓటు బలమైన ఆయుధం అని చెప్పడం, ఓటుకు నోటిచ్చే రాజకీయ నేతది ఎంత తప్పో… నోటు తీసుకుని ఓటు వేసే ప్రజలదీ అంతే తప్పు అని చెప్పించడం బాగుంది. ఒక జనరేషన్ అయినా ‘కరెప్షన్ అనేది చెడ్డది’ అనే భావనతో పెరిగితే మంచిదని ఇందులో కథానాయకుడితో అనిపించారు. కానీ అది అతను చిత్తశుద్ధితో చెప్పాడా అంటే అనుమానమే! ‘రాజకీయ నాయకులు ధర్మానికి కట్టుబడి ఉండాలి’ అనే అంశంతో ఈ సినిమాను తీసిన ఐషరి కె గణేశ్ ప్రయత్నాన్ని అభినందించాలి. సెటైరికల్ మూవీస్ ను, మరీ ముఖ్యంగా పొలిటికల్ సెటైరికల్ మూవీస్ ను ఇష్టపడే వారికి ‘ఎల్.కె..జి.’ నచ్చుతుంది. మిగిలిన వారు సైతం సరదాగా ఓసారి చూసేయొచ్చు.

రేటింగ్ : 2.5 / 5

ప్లస్ పాయింట్స్
పొలిటికల్ సెటైర్ కావడం
ఆకట్టుకునే సంభాషణలు
ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే

మైనెస్ పాయింట్స్
కొత్తదనం లేని కథ
బోర్ కొట్టించే టీవీ డిబేట్ సీన్స్
డబ్బింగ్ విషయంలో నిర్లక్ష్యం

ట్యాగ్ లైన్: నేతలకు వాత పెట్టే ‘ఎల్.కె.జి’!

Show comments