NTV Telugu Site icon

రివ్యూ: కాలా (మ‌ల‌యాళ డ‌బ్బింగ్)

ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ కార‌ణంగా ప‌ర‌భాషా చిత్రాల‌ను మాతృభాష‌లో చూడ‌గ‌లిగే అదృష్టం తెలుగు సినిమా ప్రేమికుల‌కు ల‌భిస్తోందంటే అతిశ‌యోక్తి కాదు. నిజానికి కొన్ని చిత్రాల‌ను క‌మ‌ర్షియ‌ల్ యాస్పెక్ట్ లో నిర్మాత‌లు డ‌బ్ చేయ‌డానికి త‌ట‌ప‌టాయించే స‌మ‌యంలో ఆహాలో వాటిని చూడ‌గ‌ల‌గ‌డం అదృష్టం అనే చెప్పాలి. తాజాగా ఆహా ఓటీటీలో టొవినో థామ‌స్ కాలా చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. దాని గురించి తెలుసుకుందాం.

ప్ర‌తి మ‌నిషిలో మంచి, చెడు గుణాలు క‌ల‌బోసి ఉంటాయి. ఒక్కో స‌మ‌యంలో ఒక్కో గుణం అధికంగా క‌నిపిస్తుంటుంది. దాన్ని బ‌ట్టి మ‌నం అత‌ను మంచివాడ‌నో, చెడ్డ‌వాడ‌నో బేరీజు వేసేసుకుంటాం. కానీ ఒక్కోసారి పైకి మంచిగా క‌నిపించే వాళ్ళంతా మంచి వాళ్లూ కాదు, చెడ్డ‌గా ప్ర‌వ‌ర్తించే వాళ్ళంతా పూర్తిగా చెడ్డ‌వాళ్ళూ కాదు. అయితే మ‌నిషిలోని ప‌శు ప్ర‌వృత్తి అసంక‌ల్పితంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు మంచి, చెడు అనే బేధాన్ని విస్మ‌రించి ప్ర‌వ‌ర్తిస్తుంటాడు. అలాంటి ఇద్ద‌రి క‌థే కాలా చిత్రం. షాజీ (టొవినో థామ‌స్) తండ్రి (లాల్‌) నిరాద‌ర‌ణ‌కు గురైన కుర్రాడు. కొడుకూ ఏదీ స‌వ్యంగా చేయ‌డ‌ని ఆయ‌న న‌మ్మ‌కం. దానికి త‌గ్గ‌ట్టుగానే షాజీ మావ‌గారిచ్చిన డ‌బ్బుతో వ్య‌వ‌సాయం చేసి ఆర్థికంగా దెబ్బ‌తింటాడు. అయినా వ్య‌వ‌సాయాన్ని మాత్రం వ‌ద‌లిపెట్ట‌డానికి సిద్ధంగా ఉండ‌డు. ఏదో ప్ర‌యోగాలు చేయాల‌ని తాప్ర‌త‌య ప‌డుతుంటాడు. అత‌ని భార్య విద్య‌ (దివ్య పిళ్ళై) కు మావ‌గారి ఇంట్లో ఉండ‌టం క‌ష్టంగా ఉంటుంది. బెంగళూరుకు వెళ్ళిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాల‌ని కోరుకుంటుంది. ఒక‌నొక రోజు షాజీ తండ్రి వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం టౌన్ కు; భార్య కొడుకును తీసుకుని పుట్టింటికీ వెళ‌తారు. న‌లుగురైదుగురు కుర్రాళ్ళు అదే రోజు వాళ్ళ పెద్ద తోట‌లో మొక్క‌ల ప‌ని చేయ‌టానికి వ‌స్తారు. ఆ ఐదుగురిలో ఒక‌డు… షాజీని అంత‌మొందించాల‌నే క‌సితో స‌మ‌యం కోసం వేచి ఉంటాడు. అస‌లు షాజీకి, ఆ వ్య‌క్తికి మ‌ధ్య వైరం ఏమిటీ? అంత దొంగ చాటుగా షాజీని దెబ్బ‌కొట్టాల‌ని అత‌ను ఎందుకు అనుకున్నాడు? వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగే క్రూర పోరాటంలో ఎవ‌రిది పైచేయి అయ్యింద‌న్న‌దే మిగ‌తా క‌థ‌.
సినిమా ప్రారంభంలో టైటిల్స్ వేయ‌డంలోనే కొత్త‌ద‌నాన్ని ద‌ర్శ‌కుడు రోహిత్ చూపించారు. నిజానికి అక్క‌డ నుండే మ‌నం చూడ‌బోతోంది రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ కాదు, ఇది స‌మ్ థింగ్ డిఫ‌రెంట్ అనే భావ‌న చూస్తున్న వీక్ష‌కుడికి క‌లుగుతుంది. ఇక క‌థానాయ‌కుడు షాజీ, అత‌ని కొడుకు మ‌ధ్య జ‌రిగే సంభాష‌ణ‌తో మొద‌ల‌య్యే ఈ సినిమాలో హీరో మెంటాలిటీ ఏమిట‌నేది ద‌ర్శ‌కుడు మొద‌టి సీన్ లోనే ఎస్టాబ్లీష్ చేసేస్తాడు. అక్క‌డ నుండి ఒక్కో పాత్ర ప్ర‌వేశిస్తాయి. కానీ అన్నీ అనుమానాస్పద పాత్ర‌లే. ఎవ‌రికి ఎవ‌రితో విరోధం? ఎందుకు విరోధం? అనేది అర్థం కాకుండా చ‌క్క‌టి స‌స్పెన్స్ ను ద‌ర్శ‌కుడు మెయిన్ టైన్ చేశాడు. ధ‌నిక బీద వ‌ర్గాల ప్ర‌వ‌ర్త‌న‌లోని భేదాన్ని అవ‌కాశం ఉన్న చోట‌ల్లా ద‌ర్శ‌కుడు చూపించాడు. ప్ర‌తి మ‌నిషి ప్రాణం విలువైన‌దే, అలానే ప్ర‌తి జీవి ప్రాణం కూడా. అహంకారంతో, నిర్ల‌క్ష్యంతో ఓ మూగ‌జీవి ప్రాణాన్ని అకార‌ణంగా హ‌రిస్తే, దానిని ప్రాణం కంటే మిన్న‌గా భావించే వ్య‌క్తి ఏ స్థాయి వాడైనా, ఎలా ప్ర‌తీకారం తీర్చుకుంటాడ‌నేదే ఈ చిత్రం. విశేషం ఏమంటే… ఆ అట్ట‌డుగు వ‌ర్గ‌పు మ‌నిషిలోనూ ఏదో మూల మాన‌వ‌త్వం, క్ష‌మాగుణం ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు చూపించి, సినిమాను మ‌రో మెట్టు పైకి తీసుకెళ్ళాడు. నిజానికి క్ల‌యిమాక్స్ లోని ఈ సంఘ‌ట‌నే సినిమాకు అస‌లు సిస‌లు బ‌లం.
టొవినో థామ‌స్ ఫిజిక్ షాజీ పాత్ర‌కు బాగా ఉప‌యోగ‌ప‌డింది. అత‌న్ని తెర మీద చూస్తే ఈ మొన‌గాడిని, మొగాడిని ఎదిరించే మ‌నిషి ఎవ‌రూ ఉండ‌డు అనే భావ‌న వీక్ష‌కుల‌కు క‌లుగుతుంది. అయితే చిత్రంగా అత‌ని ప్ర‌త్య‌ర్థి చేతిలో షాజీ చావుదెబ్బ‌లు తింటుంటే, మ‌నిషిలోని పశు ప్ర‌వృత్తి ఎలాంటి వాడినైనా చిత్తు చేస్తుంద‌నే స‌త్యం బోధ‌ప‌డుతుంది. ఓ మ‌నిషిని వేటాడి, వెంటాడి చావు దెబ్బ‌తీయ‌డాన్ని ఎంత ర‌క్తిక‌ట్టిస్తూ తీయొచ్చో అంత‌లా తీశాడు ద‌ర్శ‌కుడు. అందుకు అఖిల్ జార్జ్ కెమెరా ప‌నిత‌నం ఎంతో ఉప‌యోగ‌ప‌డింది. అలానే డాన్ విన్సెంట్ నేప‌థ్యం సంగీతం కూడా. నిజం చెప్పాలంటే… ద్వితీయార్థం మొత్తం సాగే ద్వంద్వ పోరాటం కొంత‌సేప‌టికి వీక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్ష‌కు గురిచేస్తుంటుంది. అక్క‌డే ద‌ర్శ‌కుడు త‌న బుర్ర‌కుప‌ద‌ను పెట్టాడు. ఇంటి నుండి బ‌య‌ట‌కు వెళ్ళిన పాత్ర‌లు ఒక్కొక్క‌టిగా తిరిగి రావ‌డంతో మ‌ళ్ళీ ఉత్సుక‌త మొద‌ల‌వుతుంది. వీళ్ళ స‌మ‌క్షంలో ఈ పోరాటం ఎలాంటి మ‌లుపులు తిరుగుతుందా? అనిపిస్తుంది. మొత్తానికి శుభంకార్డు ప‌డే స‌మ‌యానికి వీక్ష‌కులు తామే ఓ పెద్ద పోరాటంలో పాల్గొన్నామ‌నే భావ‌న నుండి రిలాక్స్ అవుతారు. ఈ మ‌ధ్య కాలంలో మ‌నిషిలోని ఇగోని హైలైట్ చేస్తూ చాలా సినిమాలు వ‌చ్చాయి. అయితే దానిని యాక్ష‌న్ కు మిళితం చేసి రోహిత్ కాలాను తెర‌కెక్చించాడు. షాజీకి చ‌క్క‌లు చూపించే కుర్రాడిగా సుమేశ్ మూర్ అద్భుతంగా న‌టించాడు. లాల్, దివ్య సైతం ఆ యా పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. భార్యాభ‌ర్త‌ల న‌డ‌మ శృంగారాన్ని కొంత మోతాదుకు మించే చూపించారు. పైగా ఎడ‌తెగ‌ని భీక‌ర‌పోరాట స‌న్నివేశాల‌తో ద్వితీయార్థం సాగ‌డంతో దీనికి స‌ర్టిఫికెట్ ఇచ్చారు. యాక్ష‌న్ ప్రియులే కాకుండా, ఫిల్మ్ మేక‌ర్స్, సామాజిక అంత‌రాల‌ను అధ్య‌య‌నం చేసే వారు త‌ప్ప‌ని స‌రిగా చూడాల్సిన సినిమా ఇది.

రేటింగ్ : 2.5 / 5

ప్ల‌స్ పాయింట్స్
ఎంచుకున్న క‌థాంశం
టొవినో, సుమేశ్ న‌ట‌న‌
సినిమాటోగ్ర‌ఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనెస్ పాయింట్స్
హ‌ద్దుమీరిన యాక్ష‌న్ సీన్స్
బోర్ కొట్టే ద్వితీయార్థం

ట్యాగ్ లైన్: యాక్ష‌న్ ప్రియుల‌కోసం!

Show comments