NTV Telugu Site icon

రివ్యూ: హెడ్స్ అండ్ టేల్స్ (ఓటీటీ)

Heads-and-tales

సుహాస్ హీరోగా, సునీల్ విలన్ గా నటించిన ‘కలర్ ఫోటో’ మూవీ గత యేడాది అక్టోబర్ 23న ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. సరిగ్గా యేడాది తర్వాత ఆ మూవీ కోర్ టీమ్ రూపొందించిన ‘హెడ్స్ అండ్ టేల్స్’ మూవీ ఇప్పుడు జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. విశేషం ఏమంటే… ‘కలర్ ఫోటో’ డైరెక్టర్ సందీప్ రాజ్ దీనికి క్రియేటర్ కమ్ రైటర్ కాగా, సుహాస్, సునీల్ ఇందులో కాస్తంత నిడివి ఎక్కువున్న అతిథి పాత్రలు పోషించారు.

ఇది ఓ రోజు రాత్రి జరిగే కథ. (ఈ మధ్య కాలంలో వెబ్ సీరిస్ లు, సినిమాలూ కూడా ఒకే రాత్రి జరిగిన కథతో బాగానే తెరకెక్కుతున్నాయి, ముఖ్యంగా థ్రిల్లర్ జానర్ కు సంబంధించి.) కానీ ‘హెడ్స్ అండ్ టేల్స్’ థ్రిల్లర్ మూవీ కాదు. ఫాంటసీ డ్రామా! సృష్టికర్త బ్రహ్మను (సునీల్)ను ఓ జర్నలిస్ట్ (రఘురామ్ శ్రీపాద) ఇంటర్వూ చేసినప్పుడు ఆయన ఆసక్తికరమైన అంశాలను చెబుతాడు. ఒకే రకమైన తలరాతలు రాయబడిన ముగ్గురమ్మాయిల జీవితంలో ఓ రాత్రి ఏం జరిగిందనేది తెలుసుకునే అవకాశం ఆ జర్నలిస్ట్ కు ఇస్తాడు. అదే ‘హెడ్స్ అండ్ టేల్స్’ మూవీ.

కానిస్టేబుల్ అలివేలు మంగ (దివ్య శ్రీపాద) భర్త శ్రీనివాసులు (అరుణ్ పులవర్తి), బార్ లో గొడవ పడి ఉద్యోగం కోల్పోతాడు. అతను మళ్ళీ జాబ్ లో చేరాలంటే డబ్బులు కావాలి. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయపడే అనీష (శ్రీవిద్య మహర్షి)కు దీపక్ (తరుణ్‌ పొనుగోటి)తో ఎంగేజ్ మెంట్ అవుతుంది. ఆమె ఓ వెబ్ సీరిస్ లో ప్రాస్టిట్యూట్ గా నటించడానికి అంగీకరిస్తుంది. అది దీపక్ కు ఇష్టముండదు. తనని కాదని ఆ పాత్ర చేస్తే ముఖం మీద యాసిడ్ పోస్తానని బెదిరిస్తాడు. సంపన్న కుటుంబానికి చెందిన శ్రుతి (చాందినీ రావ్)ని ప్రవీణ్ (కివిష్ కౌటిల్య) ప్రేమిస్తాడు. కానీ శ్రుతి గతం తెలిసి అతను డైలమాలో పడతాడు. ఆ ఒక్క రాత్రి ఈ ముగ్గురి జీవితాలలో ఏం జరిగింది? వారి భవిష్యత్తుకు సంబంధించిన చిక్కు ముడులు ఎలా విడిపోయాయి? అన్నదే ఈ సినిమా.

మూవీకి హైప్ క్రియేట్ చేయడానికి సునీల్ ను క్రియేటర్ పాత్రలో చూపించారు కానీ, ఈ కథకు ఆ పాత్ర అంత అవసరం లేదు. అయితే, క్లయిమాక్స్ లో సునీల్ ఇచ్చిన ట్విస్ట్ తో అది కాస్తంత పండింది. ఇక కొద్దిసేపే స్క్రీన్ మీద కనిపించినా సుహాస్ తనదైన మార్క్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. మూవీని చూసే వారిలో జోష్ నింపాడు. ఈ చిత్ర కథకుడు సందీప్ రాజ్, దర్శకుడు సాయికృష్ణ ఎన్నెడ్డి సైతం తెర మీద కాసేపు అలా మెరిసి వెళ్ళిపోయారు.

ప్రధాన పాత్రలు పోషించిన వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది దివ్య శ్రీపాద గురించి. బక్కపల్చగా ఉండే ఆమెను పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో ఊహించుకోవడం కాస్తంత కష్టమే. హోమ్ గార్డుకు ఎక్కువగానూ, కానిస్టేబుల్ కు తక్కువగానూ ఉంది. అయితే మధ్య తరగతి మహిళగా బాగానే సూట్ అవుతుంది కాబట్టి నెగ్గుకొచ్చేసింది. ఆమె భర్తగా అరుణ్ సహజంగా నటించాడు, ముఖ్యంగా క్లయిమాక్స్ లో అతని పాత్ర ద్వారా ఫన్ క్రియేట్ చేయడం బాగుంది. ఇక శ్రీదివ్య మహర్షి డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను చక్కగా పోషించింది. ముఖానికి వి.ఆర్. హెడ్ సెట్ ను పెట్టుకుని భావాలను పలికించడం అంత సులువు కాదు! అలానే డైలాగ్ మాడ్యులేషన్ తో గుండెల్లోని బాధను తెలియ చేసిన విధానంగా బాగుంది. ఇక చాందినీ రావ్ నటనకు క్లయిమాక్స్ లోనే కాస్తంత స్కోప్ దొరికింది. తరుణ్ పొనుగోటి, కివిష్, సుమ త్రిపురన, రఘురామ్ శ్రీపాద తదితరులంతా మొత్తం మీద బాగానే నటించారు. మణిశర్మ స్వర పరిచిన థీమ్ సాంగ్ తో పాటు నేపథ్య సంగీతం బాగుంది. ఆయన కంట్రిబ్యూషన్ తో మూవీకి రిచ్ లుక్ వచ్చింది. కిట్టు విప్సాప్రగడ రాసిన పాట అర్థవంతంగా ఉంది. వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫీ ఓకే. మహిళలు, వారి సమస్యలు, తమ కాళ్ళ మీద తాము నిలబడటానికి వారు చేసే పోరాటం…. ఇలాంటి అంశాలను చాలా సింపుల్ గా, హార్ట్ టచింగ్ గా దర్శకుడు సాయికృష్ణ ఎన్రెడ్డి చూపించాడు.

కాస్తంత కొత్తదనం కోరుకునే వారు, భారీ అంచనాలు పెట్టుకోకుండా ‘హెడ్స్ అండ్ టేల్స్’ మూవీని చూస్తే నచ్చుతుంది. నిడివి మరీ ఎక్కువ లేకపోవడం ఈ సినిమాకు సంబంధించిన మరో ప్లస్ పాయింట్. స్లో నెరేషన్ కారణంగా అక్కడక్కడా కాస్తంత బోర్ కొట్టే ఆస్కారం లేకపోలేదు. అయితే క్లయిమాక్స్ లో పాత్రలను లింక్ చేయడం బాగుంది. ఇక వచ్చే యేడాది వచ్చే సీక్వెల్ పై ఆసక్తి కలిగేలా చిన్న పాయింట్ తో వ్యూవర్స్ ను హుక్ చేశారు. మొత్తం మీద ఓ స్వీట్ అండ్ సింపుల్ మూవీని చూసిన అనుభూతిని ‘హెడ్స్ అండ్ టేల్స్’ కలిగిస్తుంది.

ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
టెక్నీషియన్స్ పనితనం
క్లయిమాక్స్ ట్విస్ట్

మైనెస్ పాయింట్స్
స్లో నెరేషన్
వీక్ క్యారెక్టరైజేషన్

రేటింగ్: 2.75 / 5

ట్యాగ్ లైన్: బొమ్మాబొరుసు అంతా ఒకటే!

Show comments