NTV Telugu Site icon

రివ్యూ: గుడ్ లక్ సఖి

keerthy suresh

keerthy suresh

జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్‌ నటించిన ‘గుడ్ లక్ సఖి’ చిత్రం ఎట్టకేలకు విడుదలైంది. గత యేడాదిన్నరగా ఇదిగో అదుగో అంటూ ఊరిస్తూ వచ్చిన ఈ సినిమా మొత్తానికి జనవరి 28న జనం ముందుకు వచ్చింది. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నగేశ్ కుకునూరు దర్శకత్వంలో సుధీర్ చంద్ర పదిరి నిర్మించిన ఈ సినిమాకు ‘దిల్’ రాజు సమర్పకుడు కావడం విశేషం.

తెలంగాణ మారుమూల పల్లెలోని లంబాడీ యువతి సఖి (కీర్తి సురేశ్). ఆమె ఏం చేసినా అంతా ఉల్టా పల్టా అవుతూ ఉంటుంది. దాంతో ఆమెపై ‘బ్యాడ్ లక్’ అనే ముద్రవేసేస్తారు. నాలుగైదు పెళ్ళి సంబంధాలు వచ్చినా చివరి క్షణంలో అవి తప్పిపోతాయి. అయినా తన మనవరాలి కోసం ఏదో ఒక రోజు రాజకుమారుడు వస్తాడని ఆమె నానమ్మ నమ్ముతూ ఉంటుంది. అదే సమయంలో ఆ ఊరికి రిటర్న్డ్ కల్నల్ (జగపతిబాబు) వస్తాడు. గ్రామీణ యువత ప్రతిభను వెలికి తీసి, మంచి షూటర్స్ ను తయారు చేయాలన్నది ఆయన కోరిక. అప్పుడే సఖి చిన్నప్పటి స్నేహితుడు గోలి రాజు ఉరఫ్ రామారావు (ఆది పినిశెట్టి) కూడా నాటకాల్లో కాస్తంత పేరు సంపాదించి, ఆమెను కలుస్తాడు. అతని ప్రోత్సాహంతో కల్నల్ దగ్గర సఖి షూటింగ్ నేర్చుకుంటుంది. ఆమెను మంచి షూటర్ గా తీర్చిదిద్దాలని భావించిన కల్నల్ కోరిక నెరవేరిందా? అతని కారణంగా సఖి, రాజు మధ్య ఏర్పడి పొరపొచ్చలు ఎలా తొలగిపోయాయి? లంబాడీ తెగకు చెందిన సఖి షూటర్ గా ఎలా రాణించింది? అనేది మిగతా కథ.

‘మహానటి’ చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైన కీర్తి సురేశ్ ను వెతుక్కుంటూ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ కొన్ని వచ్చాయి. అయితే… ఆ సినిమాలేవీ ఆమెకు పెద్దంత గుర్తింపును ఇవ్వలేదు. సరికదా సక్సెస్ నూ అందించలేకపోయాయి. ఇదే సమయంలో స్పోర్ట్స్ రొమ్-కామ్ మూవీ ‘గుడ్ లక్ సఖి’కి కీర్తి సురేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘హైదరాబాద్ బ్లూస్’ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నగేశ్‌ కుకునూర్ తొలిసారి తెలుగు సినిమా చేస్తుండటం, జగపతిబాబు, ఆది పినిశెట్టి వంటి వారు కీలక పాత్రలు పోషిస్తుండటంతో ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ బాధాకరం ఏమంటే… వీరెవ్వరి ప్రతిభకూ పట్టం కట్టేలా ఈ సినిమా లేదు. కథ, ఆ కథాగమనం కోసం రాసుకున్న సన్నివేశాలు, సంభాషణలూ అన్నీ పేలవంగా ఉన్నాయి. చిన్నప్పటి నుండి అచ్చి వచ్చిన గోలీలను తనతో ఉంచుకుంటే తద్వారా అదృష్టం వరిస్తుందని సఖి నమ్మడమే అసందర్భంగా ఉంది. అంత లక్కీ గోలీలు ఆమె దగ్గర ఉంటే బ్యాడ్ లక్ అనే పేరు ఆమెకు ఎందుకు వచ్చినట్టు!? అయితే ఈ పిచ్చి భ్రమలోంచి ఆమె బయటకు రావడమే అసలు సిసలు విజయంగా దర్శకుడు చూపించాడు. గురుశిష్యుల మధ్య ఉండే సున్నితమైన అనుబంధాన్ని చూపించే క్రమంలో దర్శకుడు తడబడ్డాడు. చాలా విషయాలలో తనతోటి వారికంటే తెలివైన, ధైర్యవంతురాలైన సఖి… కల్నల్ విషయంలో క్లారిటీతో వ్యవహరించకపోవడం ఏ మాత్రం కన్వెన్సింగ్ లా లేదు. గ్రామీణ యువతను ప్రోత్సహించాలనుకునే కల్నల్ కోరిక వెనుక బలమైన కారణం ఏదీ మనకు చూపించరు. అలానే సఖిని చిన్నప్పటి నుండి అర్థం చేసుకున్న గోలీ రాజు కూడా ఆమెను అపార్థం చేసుకోవడం కూడా అర్థం లేని అంశమే. సినిమాకు కీలకమైన ఈ సన్నివేశాలు వేటినీ దర్శకుడు బలంగా, హృదయానికి హత్తుకునేలా చూపించలేకపోయాడు. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికకు ఇచ్చిన ప్రాధాన్యం నిర్మాత కథ, కథనం, వాటి చిత్రీకరణకు ఇవ్వలేదేమోననిపిస్తోంది.

లంబాడీ యువతిగా కీర్తి సురేశ్‌ నటన కూడా పెద్దంత ఆకట్టుకునేలా లేదు. ఎక్కడా పల్లెటూరి జాణతనం కానీ షూటర్ గా సక్సెస్ కావాలనే పట్టుదల కానీ ఆమె నటనలో కనిపించలేదు. చురుకుదనం తెచ్చిపెట్టుకున్నట్టు ఉంది తప్పితే సహజంగా లేదు. కల్నల్ గా జగపతిబాబు, గోలీ రాజు గా ఆది పినిశెట్టి చక్కగా నటించారు. కానీ ఆ యా పాత్రలను దర్శకుడు ఎఫెక్టివ్ గా తీర్చి దిద్దలేదు. రాహుల్ రామకృష్ణ విలన్ కాని విలన్ పాత్ర పోషించాడు. ఆ పాత్ర ఎటూ కాకుండా ఉంది. ఆ మధ్య కరోనాతో కన్నుమూసిన హాస్యనటుడు వేణుగోపాల్ ఇందులో కాస్తంత కీలక పాత్ర పోషించాడు. రఘుబాబు, రమాప్రభ, ప్రభావతి, గాయత్రి భార్గవి, శ్వేతవర్మ, దివ్య శ్రీపాద వంటి వారు మిగిలిన పాత్రలను పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, శ్రీమణి సాహిత్యం బాగానే ఉన్నాయి. చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ ఏమంత మెప్పించేలా లేదు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా! మొత్తం మీద లిమిటెడ్ బడ్జెట్ తో మూవీ తీసేసి మూడు నాలుగు భాషల్లో విడుదల చేస్తే… సేఫ్ గా బయట పడవచ్చని దర్శక నిర్మాతలు భావించినట్టున్నారు. కానీ గుర్తింపు ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణుల కారణంగా ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాస్ మీద సహజంగానే ప్రేక్షకులు కొద్దొగొప్పో అంచనాలు పెట్టుకుంటారు. కానీ మరీ ఇంత చీప్ గా చుట్టేస్తే వాళ్ళు ఏమాత్రం హర్షించరు. ఈ ప్రాధమిక విషయాన్ని నిర్మాత మర్చిపోవడం బాధాకరం.

రేటింగ్: 2.25/5

ప్లస్ పాయింట్స్
పేరున్న నటీనటులు
చక్కని సాంకేతిక నిపుణులు
క్రీడా నేపథ్య చిత్రం కావడం

మైనెస్ పాయింట్స్
ఫ్లాట్ గా సాగే కథనం
తేలిపోయిన క్లయిమాక్స్
అంచనాలు అందుకోలేకపోవడం

ట్యాగ్ లైన్: బ్యాడ్ లక్ సఖి!