Chariman’s Desk: హైదరాబాద్ ఇప్పటికే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా ఉంది. అంతర్జాతీయ సదస్సులకు ఆతిథ్యం ఇవ్వడం కూడా ఈ నగరానికి కొత్త కాదు. కానీ ఇప్పుడు జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ అనుకూలతల్ని మరోసారి ప్రపంచ దేశాల ప్రతినిధులకు వివరించడంతో పాటు.. తెలంగాణ మొత్తంగా తనను తాను కొత్తగా ఎలా పునర్నిర్వచించుకోబోతోందో రాష్ట్ర ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనుంది. అంతే కాదు తాను స్వప్నించే భవిష్యత్తుకు ప్రతిరూపమైన ఫోర్త్ సిటీలోనే గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ద్వారా.. తమకు నిర్దిష్టమైన దార్శనికత ఉందని ప్రపంచానికి రుజువు చేయడమే లక్ష్యంగా సర్కారు పావులు కుదుపుతోంది. గతానికి భిన్నంగా కేవలం పెట్టుబడుల సదస్సులా కాకుండా ఆర్థిక సదస్సుగా సమ్మిట్ నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. దావోస్ మాదిరిగా నిర్వహించాలని అధికారులకు చాలా ముందుగానే దిశానిర్దేశం చేశారు. తద్వారా తాత్కాలికంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో సంతృప్తి చెందటం తమ ఉద్దేశం కానే కాదని సర్కారు చెప్పకనే చెప్పింది. గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ విజన్ ప్రదర్శించి.. ప్రపంచ మార్కెట్‌ను ఆకర్షించే వ్యూహరచన చేసింది ప్రభుత్వం. అందుకు అనుగుణంగానే సమ్మిట్ ప్లానింగ్ జరిగింది. ఇక ముందు కూడా ఏటా గ్లోబల్ సమ్మిట్ పెట్టాలనే ఉద్దేశంతో ఉన్న అన్ని సర్కారు.. అన్ని రకాలుగా బెంచ్ మార్క్‌గా ఉండేలా గ్లోబల్ సమ్మిట్‌కు రూపకల్పన చేసింది. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.
Read Also: Storyboard: కాంగ్రెస్ రెండేళ్ల పాలన ఎలా ఉంది? రేవంత్ సీఎంగా కుదురుకున్నారా?
హైదరాబాద్‌లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ తెలంగాణకు కొత్త దశ-దిశను ఇవ్వబోతోంది. భవిష్యత్తు తెలంగాణ ముఖచిత్రాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించనుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరిట జరుగుతున్న ఈ సదస్సు తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్‌కి ఒక బజ్ క్రియేట్ చేసింది. గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఆశించిన నూటికి నూరు శాతం పెట్టుబడులు వస్తాయని చెప్పలేం కానీ ,కచ్చితంగా ఎంతోకొంత సత్ఫలితాన్నయితే సాధించగలదు. తెలంగాణలోనూ దేశంమొత్తం ఒక అటెన్షన్‌ని అయితే గ్లోబల్ సమ్మిట్ క్రియేట్ చేయగలిగింది. రేవంత్ సర్కారు గ్లోబల్ సమ్మిట్‌ని ప్రజెంట్ చేస్తున్న తీరుపై అందరిలో ఒక ఆసక్తిని రేకెత్తించింది. ప్రధాన మంత్రితో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించడం ద్వారా తెలంగాణలో ఒక పాజిటివ్ బిజినెస్ వైబ్రేషన్‌ని ప్రభుత్వం తీసుకు రాగలిగింది. ఇప్పటికే గ్లోబల్ సమ్మిట్ ప్లానింగ్ పై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.
Read Also: Gujarat: సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం.. టెక్స్‌టైల్ షాపులో పెద్ద ఎత్తున మంటలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2025 ద్వారా తన విజన్‌ను ప్రపంచానికి తెలియజెప్పే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. 2047 నాటికి మన దేశం స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల్లోకి అడుగుపెట్టనుంది. ఈ సమ్మిట్ ద్వారా 2047 నాటికి ఆర్థిక లక్ష్యాలను ఎలా చేరుకోనుందో అన్న రోడ్‌మ్యాప్‌ను ప్రభుత్వం ప్రకటించనుంది. ఆర్థిక, పర్యావరణ రంగాల్లో తెలంగాణని దేశంలోనే ఆదర్శప్రాయమైన రాష్ట్రంగా నిలబెట్టడం ఈ విజన్ ప్రధాన లక్ష్యం. 2047 నాటికి GSDP విలువను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడం కీలక లక్ష్యం. ఇది దేశ అంచనా జీడీపీలో దాదాపు 10 శాతం వాటాకు సమానం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఆర్థిక కార్యాచరణ ప్రణాళికను ప్రస్తావిస్తారు. 2047 నాటికి సంవత్సరానికి 13 నుంచి 14 శాతం స్థిరమైన వృద్ధిని సాధించడానికి తీసుకోబోయే చర్యలను విజన్ డాక్యుమెంట్ ప్రతిబింబించనుంది.
Read Also: Civil Judge Posts: తెలంగాణ జ్యుడీషియల్ సర్వీసులో 66 సివిల్ జడ్జి పోస్టులు..
పారిశ్రామిక అభివృద్ధితో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి నికర సున్నా ఉద్గారాలు కలిగిన రాష్ట్రంగా మార్చడం ప్రధాన లక్ష్యం. ప్రభుత్వం తెలంగాణ గ్రీన్ ఫైనాన్స్ పాలసీ 2025 ను రూపొందిస్తోంది. అలాగే, పట్టణ ప్రాంతాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడానికి ఏర్పాట్లు చేస్తోంది. పారిశ్రామిక ప్రాంతాలలో క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి భారీ రాయితీలను ప్రకటిస్తోంది. దేశంలో పర్యావరణ సమతుల్యతలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలబెట్టడం మరో లక్ష్యంగా పెట్టుకున్నారు.
మహిళా సాధికారతను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతా అంశంగా తీసుకుంది. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2047 నాటికి రాష్ట్రంలో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నది ప్రధాన లక్ష్యం. ఇందు కోసం, ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయక బృందాల నెట్‌వర్క్‌ను ఆధునిక టెక్నాలజీ, మార్కెటింగ్, ఫైనాన్షియల్ టెక్నాలజీతో అనుసంధానించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందు కోసం మెగా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. వీ హబ్ ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మిట్ ద్వారా తాను పెట్టుకున్న ఈ మెగా-గోల్స్‌ను సాధించడానికి తన వృద్ధి వ్యూహాన్ని మూడు ముఖ్య స్తంభాలపై కేంద్రీకరించింది.
3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని తెలంగాణ సాధించడానికి, రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు చాలా అవసరం. అంచనాల ప్రకారం, మానవ వనరుల వృద్ధి రేటును ప్రస్తుత స్థాయి కంటే దాదాపు 1.75 రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను సృష్టించడం ఇందులో ముఖ్యమైన అంశం. క్వాంటమ్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు వంటి భవిష్యత్ రంగాలకు అవసరమైన నిపుణుల తయారీ శిక్షణ కోసం అదనపు నిధులను కూడా ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వ విధానాల రూపకల్పన, వాటి అమలు విధానంలో డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు వినియోగాన్ని గణనీయంగా పెంచడం కూడా కీలకం కానుంది. అన్ని ప్రభుత్వ విభాగాల నుండి వచ్చే డేటాను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, పారదర్శకతతో కూడిన, వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని వల్ల భూ రికార్డులు, ఆరోగ్య సేవలు, ప్రభుత్వ రాయితీలు వంటి కీలక రంగాలలో వనరుల పంపిణీ, ఆయా సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించేందుకు ఉపయోగపడుతుంది. అన్ని రంగాలలో సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారాను, పారిశ్రామిక యూనిట్లలో ఆటోమేషన్ – డిజిటలైజేషన్ ద్వారా ఉత్పాదకతను పెంచడం మరో కీలకాంశం.
రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యానికి, పెట్టుబడులు మూడవ అత్యంత ముఖ్యమైన చోదక శక్తిగా ప్రభుత్వం గుర్తించింది. విజన్ డాక్యుమెంట్ ప్రకారం, ప్రస్తుత వృద్ధిరేటుతో రాష్ట్రం సాగితే 2047 నాటికి రాష్ట్రం కేవలం 1.2 ట్రిలియన్ డాలర్ల జీఎస్‌డీపీని మాత్రమే చేరుకోగలదు. 3 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మన ఆర్థిక వృద్ధి సాగాలంటే పెట్టుబడులను, పొదుపు రేటును భారీగా పెంచాల్సి ఉంది. ఈ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రూపకల్పన చేసింది.
భవిష్యత్తు తెలంగాణ ఎలా ఉండబోతోందో కూడా స్పష్టమైన విజన్ ను సమ్మిట్‌లో సర్కారు ఆవిష్కరించనుంది. ఇప్పటిదాకా హైదరాబాద్ కేంద్రిత అభివృద్ధి మోడల్ కు భిన్నంగా రాష్ట్రం మొత్తాన్ని మూడు రీజియన్లుగా వర్గీకరిస్తూ.. ఒక్కో రీజియన్‌లో జరగాల్సిన పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాల్ని ప్రదర్శించనున్నారు. ఇందుకోసం తెలంగాణను కోర్ అర్బన్ రీజియన్, పెరి అర్బన్ రీజియన్, రూరల్ రీజియన్ గా విభజించారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉండే కోర్ అర్బన్ రీజియన్‌లో ఇప్పటికే ఉన్న ఆర్థిక వృద్ధిని బాగా పెంచడంతో పాటు ఔటర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు ఉండే పెరి అర్బన్ రీజియన్‌లో ఆర్థిక కార్యకలాపాల్న గణనీయంగా పెంచడం సర్కారు లక్ష్యం. ఇక రూరల్ రీజియన్‌లో గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేకమైన అంశాలపై ఫోకస్ పెట్టి.. అక్కడ కూడా స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందడుగు పడనుంది.
తెలంగాణ రైజింగ్ అనే ఇతివృత్తంతో జరిగే గ్లోబల్ సమ్మిట్‌లో పారిశ్రామిక వేత్తలు, ఐటీ నిపుణులు, సినిమా, క్రీడలు, విద్యా రంగాల ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులంతా ఒకే వేదికపైకి రానున్నారు. సుమారు 4,800 మందికి ఆహ్వానం పంపిన ప్రభుత్వం ఇప్పటికే 600 కంటే ఎక్కువ మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధుల రాకను ధృవీకరించింది. మొత్తంగా 2,500కు పైగా ఆహ్వానితులు హాజరవుతారని అంచనా వేస్తోంది. సమ్మిట్‌లో రెండు రోజుల్లో 27కు పైగా సెషన్లు జరగనున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కోసం అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధంగా ఉన్నాయి. సమ్మిట్‌లో మొత్తం ఆరు ఖండాల నుంచి 44 దేశాలకు చెందిన 154 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఒక్క అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు వస్తున్నారు. సమ్మిట్ కోసం 500 ఎకరాల్లో విస్తీర్ణంలో ఏర్పాట్లు చేసిన తెలంగాణ ప్రభుత్వం, 2,000 మంది కూర్చునేలా ప్రధాన వేదిక, ఆరు సెషన్ హాళ్లు, సీఎం, ప్రముఖుల కోసం ఎంఐపీ హాల్ సిద్ధం చేసింది. వివిధ విభాగాల ప్రదర్శనల కోసం వీడియో టన్నెల్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాక, ప్రభుత్వం వివిధ శాఖల ఆధ్వర్యంలో 35 స్టాళ్లను ఏర్పాటు చేసింది. ఇందులో అమలులో ఉన్న పథకాలు, కార్యక్రమాలను ఆడియో-వీడియో స్క్రీన్లలో ప్రదర్శించడం, చారిత్రక, ఆధునిక భవనాల నమూనాలను ప్రత్యేకంగా ప్రదర్శించడం, తదితర సదుపాయాలు ఉన్నాయి. సమ్మిట్‌లో పారిశ్రామిక పెట్టుబడుల ఒప్పందాల విలువ రూ.3 లక్షల కోట్లకు చేరగా, సుమారు 50 ప్రతిష్టాత్మక సంస్థలు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నాయి.
గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ అనగానే కేవలం ఫార్మా, ఐటీ పెట్టుబడులపైనే ఎక్కువగా దృష్టి పెడతారు. కానీ, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో కేవలం ఈ రెండు రంగాలు మాత్రమే కాకుండా, అగ్రికల్చర్, సినిమా, విద్యుత్, రియల్, నిర్మాణం వీటన్నిటిపైనా దృష్టి పెట్టడం ద్వారా కేవలం అంతర్జాతీయ సదస్సు ఒక రంగానికి పరిమితం కాదని.. అన్ని రంగాల అభివృద్ధిని కోరుకోవాలని జనంలోకి బాగా తీసుకెళ్లగలిగారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కూడా కచ్చితంగా చలనం వచ్చే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా మందగమనంలో ఉన్న రియల్ ఎస్టేట్.. మళ్లీ పరుగులు పెట్టే అవకాశం ఉంది. 2014-23 మధ్య ఈ తరహా గ్లోబల్ సమ్మిట్ జరగలేదు. మిగిలిన చోట్ల దేశంలో ఇలాంటి సదస్సులు జరిగినప్పటికీ హైదరాబాద్‌కు ఉండే అడ్వాంటేజ్ వేరు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ భూమి లభ్యత, నీటి లభ్యత, వాతావరణం, ఎయిర్ పోర్టు, ఔటర్, రీజనల్ రింగురోడ్డు.. ఇవన్నీ అడ్వాంటేజ్ కాబోతున్నాయి. ఢిల్లీ పూర్తిగా కాలుష్యమయం అయింది. ముంబై జనంతో కిక్కిరిసింది. బెంగళూరును ట్రాఫిక్ సమస్య వెంటాడుతోంది. చెన్నయ్‌కి వాతావరణం, నీటి సమస్య ఎలాగూ ఉంది. వీటన్నింటినీ అధిగమించేది హైదరాబాద్ మాత్రమే. అదే గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాన ఆకర్షణ కాబోతోంది. మెట్రో నగరాలు సమస్యలతో సతమతమౌతున్న పరిస్థితుల్లో.. హైదరాబాద్ విస్తరణకు ఉన్న అపరిమిత అవకాశాల్ని కళ్లకు కడుతూ.. భవిష్యత్ నగరంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం.. సర్కారు వ్యూహాత్మక ఆలోచనకు తిరుగులేని నిదర్శనం. తద్వారా మిగతా మెట్రో నగరాల కంటే హైదరాబాద్ ఏ విషయంలో అయినా చాలా ముందుందని ప్రపంచం ముందు ఆవిష్కరించే కీలక లక్ష్యాన్ని సాధించగలమని విశ్వసిస్తున్నారు.
రెండు రోజుల పాటు జరిగే సమ్మిట్‌లో రాష్ట్ర భవిష్యత్, అభివృద్ధి గురించి ముఖ్యమైన చర్చలు జరగనున్నాయి. సమ్మిట్‌కు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరు కానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టనున్నారు. అతిథులకు విభిన్న సాంస్కృతిక, కళాత్మక ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి. ప్రముఖ స్వరకర్త కీరవాణి 90 నిమిషాల సంగీత ప్రదర్శనతో మంత్ర ముగ్ధులను చేయనున్నారు. ప్రసిద్ధ వీణా వాదకురాలు పి.జయలక్ష్మి, కళా కృష్ణ నేతృత్వంలో పేరణి నాట్యం, ఇంద్రజాలికుడు సామల వేణు ప్రదర్శనలు ముఖ్య ఆకర్షణగా నిలవనున్నాయి. అదనంగా తెలంగాణ సంప్రదాయాలను ప్రదర్శించే కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడీ, ఒగ్గుడోలు, మహిళల డప్పు, పేరణి నృత్యం వంటి కళలు అతిథులను స్వాగతిస్తాయి.
గ్లోబల్ సమ్మిట్‌లో రెండు రోజుల పాటు జరిగే అధికారిక కార్యక్రమాలను మినహాయిస్తే.. డిసెంబర్ 10 నుంచి 13 వరకు జరిగే కార్యక్రమాలను సాధారణ ప్రజలు ఎలాంటి రుసుము లేకుండా వీక్షించొచ్చు. ఈ నాలుగు రోజులూ సంగీత ఆర్కెస్ట్రా, భవిష్యత్ ప్రాజెక్టులపై సమావేశాలు, వివిధ శాఖల స్టాల్స్, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. ఆసక్తి కలిగిన వారు సమావేశ స్థలానికి సులభంగా చేరుకునేందుకు ప్రభుత్వం ఉచిత బస్సులను సిద్ధం చేసింది. సమ్మిట్‌కు రావటానికి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు , తిరిగి వెళ్లటానికి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉచిత బస్సులు అందుబాటులో ఉంటాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, చార్మినార్, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల నుంచి ఉచిత బస్సులు రాకపోకలు సాగిస్తాయి.
ఈ సమ్మిట్ రాజకీయ కార్యక్రమం కాదని.. తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దే బృహత్తక కార్యక్రమమని సర్కారు ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే తెలంగాణ విజన్‌పై రాష్ట్రస్థాయిలో మేధోమథనం జరిగింది. జాతీయ స్థాయిలో కూడా ప్రఖ్యాత సంస్థలు, నిపుణుల సలహాలు తీసుకున్నారు. వీటన్నింటినీ క్రోడీకరించి విజన్ డాక్యుమెంట్‌ను గ్లోబల్ సమ్మిట్‌లో విడుదల చేస్తారు. ఆ పైన వివిధ పాలసీలపై జరిగే చర్చల్లో అంతర్జాతీయ నిపుణులు, పారిశ్రామికవేత్తలు ఇచ్చే సూచనల్ని కూడా పరిగణనలోకి తీసుకుని.. అవసరమైతే విజన్ డాక్యుమెంట్‌లో మార్పులు చేస్తామని కూడా సర్కారు ప్రకటించింది. మెరుగైన ఆలోచనలు, ఆవిష్కరణలకే ప్రాధాన్యత ఉంటుందని, అంతే కానీ తాము అనుకున్నదే జరగాలనే పట్టుదలకు పోబోమని స్పష్టం చేసింది. సామాన్యుల దగ్గర్నుంచీ ప్రముఖుల వరకూ ఎవరి సలహాలైనా తీసుకోవటానికి తమకు భేషజాల్లేవని కూడా ప్రకటించింది. తద్వారా గ్లోబల్ సమ్మిట్ కు ముందే ప్రభుత్వం ఓపెన్ మైండ్‌తో ఉందనే సంకేతం వెళ్లిపోయింది. దీంతో సదస్సుకు వచ్చే ప్రతినిధులు మరింత ఉత్సాహంగా చర్చల్లో పాల్గొనటానికి, సృజనాత్మకకు పదును పెట్టడానికి వీలుంటుందని అంచనా. ఎవరి స్థాయిలో వారు సదస్సును విజయవంతం చేయడానికి సహకరించాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. సదస్సు నాటికి ఇండిగో ఎయిర్‌లైన్స్ సమస్యకు వెసులుబాటు కలుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఒకవేళ ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పింది. ముఖ్య మైన వారికి ఇబ్బంది తలెత్తితే ప్రత్యేక విమాన సదుపాయం కూడా కల్పిస్తామంది. సదస్సులో చేసుకున్న ఒప్పందాలు, వచ్చిన పెట్టుబడుల వివరాలను చివరి రోజు వెల్లడిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో సినీ రంగంపై ప్రత్యేక చర్చ జరగనుంది. సినీ రంగంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో తెలంగాణను మొదటి స్థానంలో నిలపాలన్న లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం.. ఈ నెల 9న జరిగే సదస్సులో వన్ కంట్రీ – మెనీ సినిమాస్ పేరుతో ప్యానల్ డిస్కషన్స్ చేయాలని నిర్ణయించింది. ఈ చర్చలో ప్రముఖ దర్శకుడు సుకుమార్‌తో పాటు బాలీవుడ్ నటీనటులు జెనీలియా, రితేశ్ దేశ్‌ముఖ్ దంపతులు, అర్జున్ కపూర్, అనిరుధ్ రాయ్, పార్వతీ గోయెల్, అసిఫ్ అలీ, ప్రియదర్శన్‌లు పాల్గొంటారు. పలువురు నిర్మాతలు, దర్శకులు, ఓటీటీ సంస్థల ప్రతినిధులు, ఇతర సినీ ప్రముఖులు హాజరై తమ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకుంటారు. ఫిల్మ్ ఇన్ తెలంగాణ పేరుతో సినిమాల నిర్మాణం, చిత్రీకరణ లొకేషన్లు సహా సదుపాయల కల్పనపై చర్చించనున్నారు.
తెలంగాణకు దేశంలో ఉన్న రాష్ట్రాలతో పోటీ లేదు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతోనే పోటీ అని ఇప్పటికే సగర్వంగా ప్రకటించింది సర్కారు. అందుకు అనుగుణంగానే సమ్మిట్ తర్వాత కార్యాచరణను నిర్దేశించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పటికే అభివృద్ధి, విజన్ విషయంలో తమ చిత్తశుద్ధిని చాటేలా ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ ఏర్పాటు చేసిన సర్కారు.. ఆ ప్రాంతాన్ని సమూలంగా మార్చేసి.. సమ్మిట్ ప్రతినిధులతో పాటు సాధారణ ప్రజలను కూడా ఆకట్టుకోవాలని భావిస్తోంది. సమ్మిట్ పుణ్యమా అని నిన్నమొన్నటి వరకు రాళ్లురప్పలు, పొదలతో కనిపించిన మీర్‌ఖాన్‌పేటలోని భారత్ ప్యూచర్‌సిటీ ప్రాంతం ఒక్కసారిగా మారిపోయింది. విశాలమైన రహదారులు, రోడ్లకు ఇరువైపులా పచ్చదనం, ధగధగలాడే విద్యుద్దీపాలు, భారీ డిజిటల్ స్ర్కీన్లతో మరో ప్రపంచంలా కనిపిస్తోంది….అధికారులు, సిబ్బంది, వేలాది కార్మికులతో సందడి నెలకొంది. సమ్మిట్ కు వచ్చేవారి కోసం శ్రీశైలం జాతీయ రహదారి నుంచి ఫోర్త్ సిటీ వరకు రహదారులను మరమ్మత్తు చేశారు. మీర్‌ఖాన్ పేట నుంచి ఆమెజాన్ సెంటర్ వరకు ఉన్న రెండు లైన్ల రహదారిని నాలుగు లేన్లకు విస్తరించారు. దారి పొడవునా అందమైన పూల మొక్కలను ఏర్పాటు చేశారు. సుందరీకరణ పనులను హెచ్‌ఎండీఏ చేపట్టింది. సమ్మిట్ జరిగే ప్రాంతంలోనే మూడు హెలిప్యాడ్లను నిర్మించారు. నిరంతర ఇంటర్నెట్, వైఫై కల్పన కోసం ఏర్పాట్లు చేశారు. అతిథులకు, అధికారులకు, పోలీసులకు వేర్వేరుగా పార్కింగ్ స్థలాలను కేటాయించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. అత్యవసర వైద్యసేవల కోసం పది పడకల వసతితోపాటు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుతున్నారు. నీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలను జలమండలి, స్థానిక మున్సిపాలిటీలు చూసుకుంటున్నాయి. బాణా సంచాలతో కను విందు చేయడంతోపాటు ముగింపు సందర్భంగా భారీ డ్రోన్ షోకు ఏర్పాట్లు చేస్తున్నారు. సమ్మిట్ నిర్వహణపై రెండు రోజుల ముందు నుంచే డ్రైరన్ నిర్వహించి రిహార్సల్ చేయడం ద్వారా క్రాస్ చెక్ చేసుకున్నారు. ఇలా ఎలా చూసినా సమ్మిట్ అన్నిరకాలుగా చరిత్రలో నిలిచిపోయేలా సర్కారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
గ్లోబల్ సమ్మిట్ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి టీంకి అడ్వాంటేజ్ అవుతుందో లేదో చెప్పలేం కానీ, హైదరాబాద్‌కి, తెలంగాణకు మాత్రం కచ్చితంగా అడ్వంటేజ్ అవుతుంది. గ్లోబల్ సమ్మిట్ తర్వాత కూడా ఈ సమ్మిట్ సాధించిన ఒప్పందాలు, ఆ తర్వాత జరగాల్సిన కార్యాచరణపై దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. వివాదాస్పదమైన భూములు, పారిశ్రామిక భూములు.. వీటిపై సమయం వృధా చేయడం కంటే.. రేవంత్ సర్కారు ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా మరిన్ని ఫలితాల్ని రాబట్టడంపై దృష్టి పెడితే మంచిది. ఏ ప్రభుత్వానికైనా సరే.. ఉద్యోగాల కల్పన, పరిశ్రమల స్థాపన, తద్వారా అభివృద్ధి రేటు సాధించడం, సంపదలు సృష్టించడం.. పెద్ద ఛాలెంజ్. అయితే.. మిగిలిన రాష్ట్రాలన్నింటి కంటే.. ఈ విషయంలో తెలంగాణకు చాలా అనుకూలతలు ఉన్నాయి. కావాల్సినంత భూమి ఉంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటికే డెవలప్ అయ్యి ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ORR.. అన్నింటికీ మించి ఏటా లక్షల మంది ఇంజినీర్లు, ఫార్మా, బయోటెక్ నిపుణులు.. యూనివర్సిటీలు, కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. అంటే కావాల్సినంత మ్యాన్‌పవర్ కూడా ఉంది. ఏ రకంగా చూసినా.. వరల్డ్ స్టాండర్డ్‌కు తగినట్టుగా హైదరాబాద్ వెలిగిపోతుంది. రేవంత్ సర్కార్ సరైన సమయంలో తెలంగాణ రైజింగ్ సదస్సును ఏర్పాటు చేసింది. నిజానికి ఏడాదిన్నర నుంచే సంప్రదాయేతర ఇంధన వనరుల్లో భాగంగా సోలార్, విండ్, పవర్ ఇండస్ట్రీని తెలంగాణ సర్కార్ బాగా ప్రోత్సహిస్తోంది. మిగిలిన కంపెనీలను కూడా ఆకర్షించగలిగితే.. రాబోయే 50ఏళ్లకు ఇప్పటి నుంచే మనం ఫ్యూచర్ గ్యారెంటీ ఇవ్వగలుగుతాం. ఆ దిశగా గ్లోబల్ సమ్మిట్ తర్వాత తీసుకునే కార్యాచరణ కీలకమవుతుంది. గ్లోబల్ సమ్మిట్ ద్వారా వచ్చే సానుకూల సంకేతాల్ని వీలైనంత ప్రభావశీలంగా వినియోగించుకోవడం.. ఆ ఊపును, ఉత్సాహాన్ని సమ్మిట్ తర్వాత కూడా కొనసాగించడమే ప్రభుత్వం ముందున్న పెద్ద ఛాలెంజ్. ఇదీ ఈ వారం ఛైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.
