Site icon NTV Telugu

Chairman’s Desk: క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ.. పొదుపు కాపాడుతుందా..?

Cb

Cb

Chairman’s Desk: దేశంలో, ప్రపంచంలో ఎక్కడచూసినా ఆర్థిక పరిస్థితులు క్షీణిస్తున్నాయి. ఎక్కడా ఆశాజనకమైన వాతావరణం కనిపించడం లేదు. ఈ రంగం ఆ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాలూ హ్యాండ్సప్ చెప్పేస్తున్నాయి. ఎవరెలా పోయినా దివ్యంగా వెలిగిపోయే ఐటీ రంగం కూడా ఈసారి ముందుగానే చెతులెత్తేసింది. ఎడాపెడా కొనసాగుతున్నలేఆఫ్‌లు ఐటీ ఉద్యోగుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ ముందుగానే పడుకుంది. సేవల రంగమూ తీవ్రంగా ప్రభావితమైంది. ఇది చాలదన్నట్టుగా ట్రంప్ తలతిక్క నిర్ణయాలు, అమెరికా షట్‌డౌన్‌తో పరిస్థితులు మరింతగా విషమిస్తున్నాయి. ఒక్క వ్యవసాయ రంగమే కాస్త బాగుండటంతో.. గ్రామీణ ప్రాంతాల ఆర్థిక ఆరోగ్యమన్నా పర్లేదన్నట్టుగా ఉంది. సమీప భవిష్యత్తులో కూడా ఆర్థికం కుదుటపడే సూచనలు కనిపించడం లేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశీయ పొదుపు మొత్తాలు పడిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆర్థిక అనిశ్చితిలో పొదుపుని మించిన తరుణోపాయం లేదని నిపుణులు సలహా ఇస్తున్నారు. గతంలో ఇదే పొదుపు మంత్రంతో భారత్ ఎన్నో క్లిష్ట పరిస్థితుల్ని అవలీలగా ఎదుర్కుందని గుర్తుచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఆర్థిక మాంద్యాన్ని భారత్ విజయవంతంగా అధిగమించంటలో.. దేశీయ పొదుపు మొత్తమే గేమ్ ఛేంజర్ పాత్రను పోషించింది. అందుకే ఇప్పటికైనా ప్రాథమిక ఆర్థిక సూత్రాల్ని నిర్లక్ష్యం చేయకుండా.. అత్యంత అప్రమత్తంగా ఉండాలనే సూచనలు వస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.

Read Also: Gold Rates: వామ్మో బంగారం ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే…!

వ్యక్తి నుంచి కుటుంబం వరకూ, దేశం నుంచి ప్రపంచం వరకూ ఎక్కడైనా… ఎప్పుడైనా జీవనప్రమాణాలను, భవిష్యత్తును డిసైడ్ చేసేది ఆర్థిక పరిస్థితే. ఆర్థిక స్థితిగతులు బాగున్న దేశాలే ఎప్పుడైనా ముందంజ వేస్తాయి. ప్రపంచం కూడా ఎలాంటి కుదుపుల్లేకుండా పురోగమిస్తుంది. గతంలో ఓ దేశంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే.. ఆ దేశం మాత్రమే ప్రభావితమయ్యేది. కానీ ప్రపంచీకరణ తర్వాత ఏ దేశంలో ఏం జరిగినా ఆ ప్రభావం అందరి మీదా ఉంటోంది. ఇక అమెరికాకు, ఇండియాకు మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగాలేని కారణంగా ఆ ప్రభావం అన్ని దేశాల మీదా పడిందనడంలో సందేహం లేదు. కానీ మిగతా దేశాల కంటే మన పై మరింత ఎక్కువ ప్రభావం పడిందనేది కళ్ల ముందే కనిపిస్తున్న నగ్నసత్యం.

Read Also: Kiran Royal Issue: జనసేన నేత కిరణ్ రాయల్ వివాదంలో కొత్త కోణం..!

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుంది మన ఆర్థిక స్థితి. ఎందుకంటే మొదటే దేశంలో సామాన్యుల ఆదాయం బాగా తగ్గిపోయింది. దేశ పురోగతికి కీలకమైన సేవల రంగం.. ఇప్పుడు బిత్తరచూపులు చూస్తోంది. దీంతో ప్రజల కొనుగోలు శక్తి తీవ్రంగా పడిపోయింది. దేశంలో 50 నుంచి 60 శాతం ఉద్యోగాలు సేవల రంగంలో ఉండటమే దీనికి కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పోయిన ఉద్యోగాలు పోగా.. ఉన్న ఉద్యోగాలు కూడా ఎంతకాలం ఉంటాయో తెలియని దుస్థితి ఉంది. ఉన్న ఉద్యోగాల్లో పేరుకి ఉన్న ఉద్యోగాలు, నిజంగా వేతనం వచ్చే ఉద్యోగాల్ని విడదీసి చూడాల్సినంతగా పరిస్థితులు దిగజారాయి. దేశంలో చాలా కుటుంబాలు పైన పటారం లోన లొటారం అన్నట్టుగా నెట్టుకొస్తున్నాయి. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్న చందంగా.. కన్నీళ్లను కడుపులోనే దిగమింగుకుంటున్నాయి. ఈ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై నేరుగానే పడింది. దీంతో కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ లో స్తబ్ధత రాజ్యమేలుతోంది. అన్ని మెట్రోనగరాల్లోనూ లావాదేవీల్లో కదలిక లేదంటే అతిశయోక్తి కాదు. దీంతో రన్నింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు ఎలా పూర్తిచేయాలి.. భవిష్యత్తు సంగతేంటని బిల్డర్లు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఇదే అదనుగా బంగారం ఆకాశ విహారం చేస్తోంది. రోజుకో రకంగా పెరుగుతున్న బంగారం ధరలు.. సామాన్యుడిని ఠారెత్తిస్తున్నాయి. ఇప్పటికే బంగారం అమ్మకాలు 50 శాతం పడిపోయాయని లెక్కలు చెబుతున్నాయి. మధ్యతరగతి అయితే కొన్నాళ్ల పాటు బంగారం జోలికి పోకూడదని డిసైడైంది. అన్నింటికీ మించి డిస్కౌంట్ అంటే పరుగులు తీసే మనస్తత్వం ఉన్న భారతీయులు.. కేంద్రం జీఎస్టీ తగ్గించినా.. కొనుగోళ్ల జోలికి పోవడం లేదంటే.. ఇంతకు మించి ఆర్థిక దుస్థితికి వేరే నిదర్శనం కావాలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చిన రోజు మాత్రమే కాస్త వాహన కొనుగోళ్లలో ఊపు కనిపించింది. అదే ఊపు కంటిన్యూ అవుతుందని సంబరపడ్డ డీలర్లకు చివరకు నిరాశే మిగిలింది. రెండోరోజు నుంచి షరామామూలే అన్నట్టుగా ఉంది పరిస్థితి. కేంద్రం కూడా పైకి చెప్పడం లేదు కానీ.. ఆశించిన రీతిలో కొనుగోళ్లు జరగకపోవడంపై అంతర్గతంగా ఆరా తీస్తోంది. ఎవరేం చేసినా.. ఏ ఆఫర్లు పెట్టినా.. పన్నులు తగ్గించినా.. జనం దగ్గర డబ్బులేనప్పుడు కొనుగోళ్లు ఎలా పెరుగుతాయని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు.

Read Also: Bihar Elections: ఈరోజే బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. సా.4 గంటలకు ఈసీ ప్రెస్‌మీట్

దేశంలో 140 కోట్ల జనాభా ఉన్న మాట నిజం. అంతమాత్రాన అందరికీ ఆదాయం లేదు. ఆదాయార్జనపరుల సంపాదన కూడా ఒకే రకంగా లేదు. దేశంలో 10 శాతం మంది దగ్గరే 90 శాతం సంపద పోగుపడిందని కొన్నేళ్లుగా ఆర్థికవేత్తలు మొత్తుకుంటున్నారు. జీడీపీ పెరుగుతుందని సంబరపడితే చాలదు. సంపద అందరికీ సమానంగా పంపిణీ అవుతుందా.. లేదా అనేది కూడా చూసుకోవాలి. ఆదాయ అసమానతలున్నచోట.. ఆర్థిక వృద్ధి బాగున్నా.. నిజవేతనాలు పెరగవు. ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరగదు అని గుర్తుంచుకోవాలి. ఇప్పటిదాకా ఆర్థికవేత్తల సూచనలు లైట్ తీస్కున్నవారికి కూడా.. ఇప్పుడు వారి సూచనల్లో కఠోర వాస్తవాలు కళ్లకు కడుతున్నాయి. ఎంతసేపూ దేశంలో ఇంత జనాభా ఉంది కాబట్టి.. ఇంత మొత్తంలో కొనుగోళ్లు జరుగుతాయని పేపర్ మీద లెక్కలేస్తున్నారు కానీ.. నిజంగా ఎంతమంది దగ్గర కొనుగోళ్లు పెరిగే స్థాయిలో ఖర్చుచేసే స్తోమత ఉందని అంచనా వేయడం లేదు. అక్కడే తేడా వస్తోంది. ఓవైపు దేశీయ ఆర్థికం అంతంతమాత్రంగా ఉంటే.. పులి మీద పుట్రలా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు.. మన ఎకానమీని మరింతగా షేక్ చేస్తున్నాయి.

Read Also: Rashmika: ‘థామా’ హాట్ సాంగ్ వెనుక.. రహస్యని రివీల్ చేసిన రష్మిక

ప్రపంచంలోనే అతి ఎక్కువగా ఖర్చు చేసే దేశంగానే అమెరికా గురించిన తెలిసిన ప్రపంచం.. ఇప్పుడు ట్రంప్ అమెరికాను చూసి ఉలిక్కిపడుతోంది. ఎందుకంటే కోవిడ్ నుంచీ అమెరికా ఆర్థిక స్థిత అధోగతి అయింది. దీంతో మోయలేనంత అప్పుల భారం పెరిగిపోయింది. ఈ అప్పుల కొండను ఇక ఎంతమాత్రం మోయలేమని, దీన్ని వీలైనంత త్వరగా దించుకోకపోతే.. మొత్తంగా అమెరికానే మునిగిపోతుందని ట్రంప్ చెబుతున్నారు. అందుకే ఖర్చులు తగ్గించాలంటూ పొదుపు మంత్రం పఠిస్తున్నారు. ఒక్కసారిగా ఫెడరల్ బడ్జెట్ తగ్గించడంతో.. ఫెడరల్ నిధుల్ని, ప్రాజెక్టుల్ని నమ్ముకున్న రంగాలు, కంపెనీలు డీలా పడ్డాయి. ఇది చాలదన్నట్టుగా వలస ఉద్యోగులపై ఉక్కుపాదం మోపాలనే నిర్ణయంతో.. సిలికాన్ వ్యాలీ చిగురుటాకులా వణికిపోతోంది. ఇప్పటిదాకా వలస ఉద్యోగుల్ని నియమించుకుని.. వారికి తక్కువ వేతనాలిచ్చి.. అత్యధిక సంపాదనను ఆర్జించి.. అలా లాభాల మీద లాభాలు ఆర్జించిన అమెరికా ఐటీ దిగ్గజాలకు ట్రంప్ పోకడ మింగుడుపడటం లేదు. దీనికి తోడు ముందూవెనుకా ఆలోచించకుండా ఏఐను చూసుకుని ఆటోమేషన్ మొదలుపెట్టడం కూడా కొంప ముంచుతోంది. నిజానికి మొదట కంపెనీలన్నీ ఆటోమేషన్ కాస్ట్ ను భరించాలని, ముందు నష్టాలొచ్చినా.. తర్వాత ఉద్యోగుల సాయంతో గట్టెక్కొచ్చని.. ఒక్కసారి పరిస్థితులు కుదుటపడ్డాక.. ఆటోమేషన్ ను విస్తరిస్తూ.. ఉద్యోగాలను తీసేసే ప్రక్రియను సమాంతరంగా చేపట్టాలని భావించాయి. కానీ ఉరుము లేని పిడుగులా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు.. కంపెనీల బ్యాలెన్స్‌ షీట్లను తారుమారు చేస్తున్నాయి. దీంతో ఏం జరుగుతుందో అర్థం చేసుకునే టైమ్ కూడా లేదనే ఉద్దేశంతో.. ఎడాపెడా లేఆఫ్‌లకే ఓటేస్తున్నాయి కంపెనీలు. దీంతో వేల మంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు.

Read Also: Akkineni King : అక్కినేని నాగార్జున100వ చిత్రం ‘లాటరీ కింగ్’

అన్ని కంపెనీలు ఇదే దారిలో ఉండటంతో.. ఎంత అనుభవం ఉన్నా.. ఉద్యోగం దొరకని దుస్థితి నెలకొంది. దీంతో వాస్తవాలు వివరించటానికి టెక్ దిగ్గజాలు వైట్‌హౌస్‌ కు వెళ్లినా.. అక్కడ ట్రంపే వీరికి రివర్స్‌లో క్లాస్ తీసుకున్నారు. దీంతో ఇక ఏం ఉపయోగం లేదని తత్వం బోధపడిన దిగ్గజాలు లేఆఫ్‌లు మరింతగా పెంచేశాయి. లేఆఫ్‌లకు తోడు.. ప్రాజెక్టులు అవుట్‌సోర్సింగ్‌కు ఇవ్వడం కూడా తగ్గించాయి. దీంతో అమెరికా కంపెనీల ప్రాజెక్టులపై ఆధారపడ్డ ఇండియా ఐటీ కంపెనీలపై దెబ్బ పడింది. మిగతా దేశాలతో పోలిస్తే మన పరిస్థితి లేఆఫ్‌ల విషయంలో ప్రస్తుతానికి బెటర్‌గానే ఉంది. కానీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పటం చాలా కష్టం. ఐటీ రంగంలో కనీవినీ ఎరుగని పోకడలు అన్ని రంగాల్నీ బెంబేలెత్తిస్తున్నాయి. మీటింగ్ పేరుతో పిలిచి.. పింక్ స్లిప్ ఇవ్వటం.. రిక్రూట్ మెంట్ చేసుకుని కూడా ఆఫర్ లెటర్ ఇవ్వకపోవటం లాంటి విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో కొన్నేళ్లుగా ఐటీ రంగంపై విపరీతంగా ఆధారపడ్డ దేశీయ ఆర్థిక చక్రం కూడా ఇక తిరగటం తన వల్ల కాదని మొరాయిస్తోంది. ఎన్నారైల రెమిటెన్సుల అండ చూసుకుని మొండి ధైర్యంతో పెట్టిన పెట్టుబడులు, బిజినెస్‌ లు అన్నీ రిస్క్‌లో పడ్డాయి. ఇలాంటి తరహాలో చాలా మంది టోటల్ గా రివర్స్‌ గేరే వేసేస్తే.. అతి కొద్ది మంది మాత్రం సడెన్ బ్రేక్ వేశారు. కానీ ఈ సడెన్ బ్రేక్ బాపతు కూడా ఎప్పుడోసారి ఇంజిన్ ఆపేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి మన దగ్గర మాత్రమే బాగాలేకపోతే వేరే దారి చూసుకోవచ్చు. ఓ రంగం మాత్రమే తిరోగమనంలో ఉంటే.. మరో రంగంలో అదృష్టం పరీక్షించుకోవచ్చు. కానీ దేశం, ప్రపంచం ఎక్కడచూసినా నిరాశే రాజ్యమేలుతున్నప్పుడు.. ఇక చేసేదేముంది.. నిట్టూర్చటం తప్ప అంటున్నారు సామాన్యులు.

Exit mobile version