తెలుగు సినిమా పరిశ్రమ ఎటుపోతోందో ఎవరికీ అర్థం కాని దుస్థితి నెలకొంది. భారీ సినిమాలు, వందల కోట్లు పెట్టి తీస్తున్న చిత్రాలు…బాక్సాఫీస్ ముందు ఎందుకు బోర్లాపడుతున్నాయో టాలీవుడ్‌కి అంతుచిక్కడం లేదు. రెండు వందల కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల వరకు ఖర్చు పెట్టి తీస్తున్న సినిమాలు సర్వనాశనం అయిపోతే, అట్టర్‌ఫ్లాప్‌లు అవుతూ ఉంటే ఇండస్ట్రీ ఎలా కోలుకుంటుంది? అసలు ఇండస్ట్రీ రీచ్ ఎంత? హీరోకు ఉండే మార్కెట్ ఎంత? ఈ విషయాల్ని సరిగా అంచనా వేయకుండా ఒక రెండు పాటలను, నాలుగు పంచ్ డైలాగుల్ని, మూడు ఎలివేషన్ షాట్స్‌ను నమ్ముకొని జనాలపైకి సినిమాలు వదిలేస్తే అవి హిట్ అవుతాయా? ఈ ప్రశ్నకు సరైన సమాధానం కోసం ఇండస్ట్రీతో పాటు ప్రజలు కూడా ఆలోచించాలి. నిజానికి ఈ పెడపోకడలు కొన్నేళ్ల క్రితమే మొదలైనా.. ఇలాంటివి సహించేది లేదని ఇటీవలి కాలంలో ప్రేక్షకులు కర్రు కాల్చి వాత పెడుతున్నారు. అయినా సరే డైరక్టర్లు నేల విడిచి సాము చేస్తున్న వైనం.. మొత్తంగా టాలీవుడ్‌కే చెడ్డకాలం దాపురించే దుస్థితికి దారితీసింది. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.
ఈ మధ్య కాలంలో ఫ్లాప్ అయిన సినిమాలను చూస్తే తెలుగు ఇండస్ట్రీ ఎలా భ్రమల్లో బతుకుతుందో అర్థం అవుతుంది. కేవలం డైరెక్టర్స్‌ను నమ్ముకొని…సినిమా మొత్తం అతని చేతిలో పెట్టి హీరో బ్రాండ్ మీద సినిమాను అమ్ముకోవాలి అనే పనికిమాలిన ఆలోచనలతో నిర్మాతలు నడి బజారులో అప్పుల భారంతో నిలబడాల్సి వస్తోంది. ఈ మధ్య కాలంలో రిలీజైన ప్యారడైజ్, పెద్ది, టాక్సిక్, రాజాసాబ్, గేమ్‌ఛేంజర్ లాంటి సినిమాలు అంచనాలను తలకిందులు చేస్తూ దారుణంగా ఎందుకు దెబ్బ తింటున్నాయో సమీక్షించాల్సిన అవసరం ఉంది.
తెలుగు సినీ పరిశ్రమలో మొదట్నుంచీ విజయాల శాతం తక్కువే. ఎన్నో లెక్కలు వేసుకుని.. ఎంతో జాగ్రత్తగా తీసే సినిమాలే ఆడతాయని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అలాంటిది అసలు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా.. గాల్లో లెక్కలు వేసుకుని తీసే సినిమాల గురించి చెప్పాల్సిన పనే లేదు. మొదట్లో కథల ఎంపిక కోసం ఏళ్ల తరబడి చర్చలు జరిగేవి. ఒకసారి కథ తయారయ్యాక కూడా 24 విభాగాల వారి సలహాలు తీసుకునేవారు. అలా బాగా నలిగిన, మార్పులు చేర్పులు చేసిన కథనే తెరకెక్కించేవారు. అలాగే కథకు తగ్గట్టుగా నటీనటుల ఎంపిక ఉండేది. కాంబినేషన్ల కోసం ఆరాటం, క్రేజ్ ఉన్న నటులే ఉండాలనే జంఝాటం ఏమీ ఉండేవి కాదు. పెద్ద హీరోలు అడిగినా కూడా.. ఈ కథ మీకు సరిపడదని నిర్మాతలు, దర్శకులు నిర్మొహమాటంగా చెప్పేసేవారు. అంతేకాదు దర్శకులు ఎక్కడైనా అతి చేస్తున్నట్టు అనిపిస్తే.. అంతొద్దు ఇది చాలు అని నిర్మాతలు తేల్చిచెప్పిన సందర్భాలున్నాయి. దీనికి తోడు నటీనటులు, డైరక్టర్లు అందరికీ నిర్మాతలంటే భయం భక్తీ ఉండేది. వారి మనసెరిగి నడుచుకోకపోతే ఆఫర్లు రావేమోననే ఆందోళన ఉండేది. అందుకే ఎవరూ నిర్మాతలకు ఎదురుచెప్పే సాహసం చేసేవారు కాదు. ఎందుకంటే అప్పుడు కథే హీరో. సినిమాకే సింహాసనం. నిర్మాతకే ప్రాధాన్యం. నటీనటులు, మిగతా వారికి ఎక్కువ ప్రాధాన్యత లేదు. ఆ రోజుల్లో ఓ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ దక్కితే.. దాన్ని మిగతా భాషల్లోనూ డబ్ చేసేవారు. అప్పుడు డబ్బింగ్ రైట్స్ రూపంలోనూ డబ్బులొచ్చేవి. కొన్ని సినిమాలు నేరుగా పెట్టుబడి తేలేకపోయినా.. డబ్బింగ్ రైట్స్ తో నిర్మాతలు గట్టెక్కిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితే లేదు. కాంబినేషన్ల కోసం విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఇంకా దిగజారి.. ప్రతి హీరో మీదా .. పాన్ ఇండియా రేంజ్ హీరో మీద పెట్టేంతగానే ఖర్చు పెడుతున్నారు. దీంతో రిలీ్జ్‌కు ముందే సినిమా భవితవ్యంపై సందేహాలు వస్తున్నాయి. అప్పటికీ తగ్గకుండా భారీగా ప్రమోషన్లు చేసేసి మసి పూసి మారేడుకాయ చేస్తున్నారు. కానీ ప్రేక్షకులు మాత్రం ఒక్క షోతోనే.. ఇంకా మాట్లాడితే ప్రీమియర్లతోనే సినిమాలో విషయం ఉందా.. లేదా అని తేల్చేస్తున్నారు. సినిమాలో విషయం ఉంటే.. పబ్లిసిటీ లేకపోయినా.. నెత్తిన పెట్టుకుంటున్నారు. అదే సినిమాలో సరుకు లేదనుకుంటే.. అది ఎవరి సినిమా, ఎన్ని కోట్లు పెట్టి తీసిన సినిమా అనే సంగతి ఎవరూ పట్టించుకోవడం లేదు. నిర్దాక్షిణ్యంగా చీల్చి చెండాడుతున్నారు. దీంతో చివరకు నిర్మాతలు గుడ్లు తేలేయక తప్పడం లేదు. అన్నింటికీ మించి ప్రస్తుత డైరక్టర్ల పెడ పోకడలు చూస్తే.. గతంలో నిర్మాతకు అదనంగా ఒక్క పైసా కూడా ఖర్చు కాకూడదని తాపత్రయపడ్డ కేవీ రెడ్డి లాంటి డైరక్టర్లు ఎంత ఆవేదన చెందుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
నిజానికి టాలీవుడ్‌లో మొదట్నుంచీ విజయాల శాతం తక్కువే. కాకపోతే మిగతావన్నీ ఫ్లాపులు కాకుండా.. కొన్ని సినిమాలైనా యావరేజ్ అనిపించుకుని.. నిర్మాతకు సంసార పక్షంగా ఊరట ఇచ్చేవి. కానీ కొన్నేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమ యావరేజ్ అనే మాటే మరిచిపోయింది. అయితే హిట్టు. లేదంటే ఫట్టు. అంతేకానీ మధ్యరకం సినిమా ఉండాలని, అలాంటి సినిమాలతోనే పరిశ్రమ పదికాలాలు బతుకుతుందనే ధోరణికి కాలం చెల్లింది. పైగా హిట్టు కొట్టాలంటే కాంబినేషన్ అయినా ఉండాలి.. లేదంటే భారీ బడ్జెట్ అయినా ఉండాలనే గుడ్డి లెక్కలు వేస్తున్నారు. అంతేకానీ అన్నింటికీ మించి కథ, కథనం బాగుండాలనే పట్టింపు లేకుండా పోయింది. కానీ ప్రేక్షకులు మాత్రం వాటినే పట్టించుకుని.. నిర్మొహమాటంగా సినిమాల్ని తిప్పికొడుతున్నారు. కథ బాగుంటే స్టార్లు లేకపోయినా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తామని కొన్ని చిన్న సినిమాల్ని సూపర్ హిట్ చేసి ప్రేక్షకులు నిరూపిస్తూనే ఉన్నారు. అయినా సరే రొటీన్ ఫార్ములాలు, ఓ స్థిరమైన మైండ్‌సెట్‌కు అలవాటుపడ్డ మన దర్శకనిర్మాతలు, కొందరు హీరోలకు ఇంకా తత్వం బోధపడటం లేదు. మరీ ముఖ్యంగా డైరక్టర్లు అతి పోకడలు పోయి.. హీరోల ఇమేజ్‌ను పట్టించుకోకుండా నేల విడిచి సాము చేస్తూ.. నిర్మాతల్ని నిండా ముంచేస్తున్నారు. అటు నిర్మాతలు కూడా దర్శకుల మీదే పూర్తి భారం వేసి.. కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు.
ఎన్నో కారణాలతో తెలుగు సినిమా సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. సక్సెస్ రేటు ఎప్పుడూ 10శాతమే అయినా.. నష్టాలు భారీ స్థాయిలో వుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం మాత్రం కచ్చితంగా డైరక్టర్ల మితిమీరిన ధోరణులే అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఒకప్పుడు దర్శకులు నిర్మాత బాగు కోరితే.. ఇప్పటి డైరక్టర్లు తమ ఇమేజ్ పెంచుకోవటానికి.. వాస్తవాలు మరిచి ఆడుతున్న ఖరీదైన గేమ్.. అటు నిర్మాతకు ఆర్థిక కష్టాల్ని తెచ్చిపెడుతుంటే.. ఇటు హీరోల ఇమేజ్‌ను కూడా భారీగా దెబ్బతీస్తోంది. ఈ పరిస్థితి మారితేనే చిత్రపరిశ్రమకు మంచి రోజులొస్తాయ. వంద కోట్లు పెడితే కాదు.. మంచి కథ, కథనంతోనే సినిమా ఆడుతుందనే విషయాన్ని మొదట దర్శకులు గుర్తించాలి. కథలో లాజిక్ లేకపోయినా.. స్క్రీన్ ప్లేతో అయినా మ్యాజిక్ చేయాలి. ఏదీ చేయకుండా వదిలితే మాత్రం భరించడానికి ఆడియన్స్ సిద్ధంగా లేరని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పటికైనా డైరక్టర్లు పద్ధతి మార్చుకోవాలి. మారాలి. తెలివి తెచ్చుకోవాలి. నిజంగా సత్తా ఉన్న దర్శకుడికి భారీ బడ్జెట్ అక్కర్లేదు. సినిమాలో కంటెండ్ ఉన్నప్పుడు.. ఎంత లో బడ్జెట్ సినిమాని అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. అంతేకానీ తాము హిట్ చేయాలంటే కనీసం వంద కోట్ల బడ్జెట్ సినిమా అయ్యుండాలని.. ప్రేక్షకులు.. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పటికైనా డైరక్టర్లు భారీ బడ్జెట్లపై మోజు తగ్గించుకుంటే నిర్మాతల పరిస్థితితో పాటు వారి మానసిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. ఇప్పటికే పెద్ద దర్శకులైన వారు.. కేవలం భారీ బడ్జెట్ సినిమాలతో పేరు తెచ్చుకోలేదు. భారీ విజన్‌తో ముందుకెళ్లి.. సూపర్ హిట్లు కొట్టారన్న నిజాన్ని మర్చిపోకూడదు. ఈ ప్రాథమిక సూత్రం గుర్తుంచుకుంటే.. ఏ డైరక్టరూ అనవసరంగా నిర్మాతతో డబ్బు ఖర్చుపెట్టించరు. జీవితంలో వంద కోట్ల సినిమా తీయని డైరక్టర్లు కూడా నిర్మాత ఖర్చుకు పరిమితి లేదని చెప్పగానే.. హీరో స్థాయి ఏంటో కూడా చూసుకోకుండా.. ఏకంగా 150 కోట్లు, 200 కోట్లు పెట్టి సినిమా తీసేసి.. తీరా బిజినెస్ దగ్గరకు వచ్చేసరికి హ్యాండ్సప్ అంటున్నారు. ఇక్కడ సమస్య బిజినెస్ కాదు. అసలు మొదట్లోనే మోసం జరిగింది. కథ, హీరో మార్కెట్‌ను బట్టి సినిమా బడ్జెట్ వేయాలే కానీ.. అనవసరంగా అతి పోకడలు పోయి.. నిర్మాతలతో ఖర్చు పెట్టిస్తే.. ప్రతి డైరక్టరూ రాజమౌళో, సుకుమారో కాలేరని తెలుసుకోవాలి. ఈ దృష్టి కోణం లేకే చాలా మంది డైరక్టర్లు.. భారీ బడ్జెట్ మోజులో పడి.. తాము మునుగుతూ నిర్మాతల్నీ ముంచుతున్నారు. డైరక్టర్ల మాటలు నమ్మి.. భారీ బడ్జెట్ సినిమాలతో షార్ట్‌కట్‌లో బడా హీరోలైపోవచ్చని కలలు కంటున్న కొందరు హీరోలకూ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఉదాహరణకి ఓ బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ఉన్న హీరోకు నప్పే కథలు వదిలేసి.. తన స్థాయికి మించిన కథతో సినిమా తీస్తే.. అది ఫ్లాప్ అవుతుంది. ఇక్కడ ఒక్క సినిమా ఫ్లాప్‌తో స్టోరీ పూర్తికాదు. ఆ తర్వాత సదరు హీరో తాను రెగ్యులర్‌గా చేసే సినిమాలు తీయలేక.. ఇటు భారీ బడ్జెట్ సినిమాల జోలికి పోలేక.. ఎటుకాకుండా పోయే అవకాశాలున్నాయి. గతంలో కొందరు హీరోలు ఇలాగే లవర్ బాయ్ ఇమేజ్ నుంచి మాస్ హీరో ఇమేజ్‌కు మారే క్రమంలో కెరీర్లకు ఫుల్‌స్టాప్ పెట్టుకున్న నిదర్శనాలు లేకపోలేదు. అలాంటి వారిని చూసి కూడా ఏమీ నేర్చుకోకుండా.. మళ్లీ అదే పాత కథ పునరావృతం చేయడం.. అలాంటి స్థితిలో ఉన్న హీరోలకు లేనిపోని మాటలు చెప్పి.. ఆశలు రేపటం.. ప్రస్తుతం డైరక్టర్లు తెలిసి చేస్తున్న నేరం. వీరి పోకడతో.. పచ్చగా కళకళలాడాల్సిన టాలీవుడ్.. వరుస ఫ్లాపులతో చతికిలపడుతోంది.
తెలుగువాళ్లకు సినిమా అనేది ఓ కల్చర్. అత్యంత చవకైన వినోద సాధనం. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఒకప్పుడు చాలా మంది ప్రేక్షకులు టైమ్ పాస్ కోసం సినిమాకి వెళ్లేవాళ్లు. ఏ సినిమా అయినా పర్లేదనే ధోరణి కూడా ఉండేది. కానీ టికెట్ ధరలు పెరిగాక.. సినిమా లగ్జరీ అయిపోయింది. టైమ్ పాస్ కోసం సినిమా అనే కల్చర్ పోయింది. దీంతో ఓ వర్గం ప్రేక్షకులు పూర్తిగా థియేటర్లకు రావడం మానేశారు. ఓటీటీలు వచ్చాక మధ్యతరగతి కూడా పూర్తిగా థియేటర్ కు దూరమైపోయింది. అంతంత రేట్లు పెట్టి టికెట్లు కొని సినిమా చూసే బదులు.. కొద్దిరోజులైతే ఓటీటీలో ఫ్యామిలీ మొత్తం చూడొచ్చనే భావన పెరిగింది. దీనికి తోడు సినిమా కంటెంట్ విషయంలో కూడా మేకర్స్ దృష్టి పెట్టడం లేదనే ఫిర్యాదులున్నాయి. గతంతో పోలిస్తే ప్రేక్షకుల ఆలోచన ధోరణి మారిందని తెలిసినా.. విభిన్నమైన ఆలోచనలకు ఆదరణ దక్కుతున్నా.. టాలీవుడ్ మాత్రం మూస పద్ధతిలో వెళ్తోందనే విమర్శలున్నాయి. టికెట్ రేటుకు తగ్గ క్వాలిటీ కోరుకుంటున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఇలాంటి తరుణంలో డైరక్టర్లు తమ పైత్యాన్ని రంగరించి సిల్వర్ స్క్రీన్ మీద వదలటం మొదటికే మోసం తెస్తోంది.
ఇక్కడ సినీ పరిశ్రమకు ఎవరో పని గట్టుకుని నష్టాలు తేవడం లేదు. స్వయంగా చిత్ర పరిశ్రమే చేజేతులా సంక్షోభాన్ని కొనితెచ్చుకుంటోంది. ఇప్పటికైనా మేలుకోకపోతే.. నిండా మునిగే ప్రమాదం లేకపోలేదు. అనారోగ్యకర పోకడల్ని మొదట్లోనే తగ్గించుకునే ప్రయత్నం చేస్తే.. పరిస్థితి ఇక్కడదాకా వచ్చేది కాదు. కానీ పెడ ధోరణుల్ని ట్రెండ్ గా, కొత్త తరహా మార్కెటింగ్ సూత్రాలుగా చెప్పుకుని అదే ఒరవడిలో కొట్టుకుపోతున్నారు. ఎవరైనా సీనియర్లు సలహాలివ్వబోయినా.. వినిపించుకోవడం లేదు. అదేమంటే కాలం మారిందని చెబుతూ.. తెలుగు సినిమాని చేజేతులా చంపేయటానికి కంకణం కట్టుకున్నారు. కనీసం తెలుగు సినిమాల్ని ఓటీటీలు కూడా ఎందుకు కొనడం లేదని ఎవరూ ఆలోచించడం లేదు. ఇప్పటికైనా టాలీవుడ్ ఆత్మావలోకనం చేసుకోకపోతే.. రాబోయే రోజుల్లో తెలుగు సినీ పరిశ్రమ ఒకటుండేది అని చెప్పుకోవాల్సి వస్తుందేమో. ముఖ్యంగా డైరక్టర్ల అతి పోకడలకు అర్జెంటుగా అడ్డుకట్ట వేయాలి. నిర్మాతలు కూడా పూర్తిగా దర్శకుడి మీద భారం వేయకుండా.. తాము కూడా సినిమా జ్ఞానం కాస్త పెంచుకోవాలి. కనీసం కథ విని బడ్జెట్ పెట్టే అలవాటు చేసుకోవాలి. లేదంటే మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమను ఎవరూ కాపాడలేరనే అభిప్రాయాలు నిజమౌతాయి.

