Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?

Sir

Sir

దేశవ్యాప్తంగా సర్‌ వివాదం తారస్థాయికి చేరింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ఇండియా కూటమి ఢిల్లీ రాంలీలా మైదానంలో మహాధర్నా నిర్వహించిది. ఇటీవల ప్రతిపక్షం బలహీనపడిందన్న ప్రచారానికి తెరవేస్తూ.. జరిగిన ఈ ధర్నా విజయవంతమైందని ప్రతిపక్షం భావిస్తోంది. మరోవైపు సర్ విషయంలో విపక్షానికి కౌంటర్‌గా బీజేపీ కూడా ర్యాలీలు తీస్తోంది. అంతకుముందు కాక్రోచ్‌లు కూడా జ్ఞానేష్ రాజీనామా డిమాండ్‌తోనే నిరసనకు దిగారు. అసలు సర్ విషయంలో ఏం జరగనుంది..? విపక్షాల టెంపో ఇలాగే కొనసాగుతుందా..? కేంద్రం ఈ అంశాన్ని ఎలా డీల్ చేస్తుంది..? సమస్యకు సహేతుక పరిష్కారం సాధ్యమేనా..? ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.

ప్రజాస్వామ్య దేశంలో ఓటుహక్కు చాలా కీలకమైన అంశం. అలాంటి ఓటుహక్కే ఇప్పుడు ప్రమాదంలో పడిందనే ఆందోళనే.. దేశంలో సర్ రచ్చకు దారితీసింది. మొత్తం మీద చాలా కాలం తర్వాత రెండు జాతీయ పార్టీలు జాతీయ స్థాయిలో పోటాపోటీ నిరసనలు చేపడుతూ.. తాడోపేడో తేల్చుకోనుండటం ఆసక్తికర పరిణామమే అనడంలో సందేహం లేదు. గతంలోనూ కొన్ని వివాదాలు రేగినా.. మునుపెన్నడూ సర్ స్థాయిలో పార్టీలు స్పందించలేదు. ఇప్పుడు సర్ దేశంలో ఓటర్లందరికీ కనెక్ట్ అయ్యే అంశం కావడంతో.. ఎవరికి వారే ఎక్కడా తగ్గకూడదని ఫిక్సయ్యారు. ప్రస్తుతానికి తమ వాదనలో కొన్ని అంశాలు నిజమేనని ఈసీ సవరణలే చెబుతున్నాయని విపక్షం వాదిస్తోంది. అసలు ప్రతిపక్షం వాదన అంతా డొల్లేనని తామూ నిరూపించామంటోంది అధికార పక్షం. ఇలా నువ్వొకటంటే.. నేరెండంటా అంటూ అధికార, విపక్షాలు పందెం కోళ్లలా కాలుదువ్వుతుండటం.. దేశ రాజకీయాల్ని వేడెక్కిస్తోంది. కొద్దిరోజుల క్రితమే సర్ విషయంలో జరిగిన పొరపాట్లకు సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను బాధ్యుడ్ని చేస్తూ.. ఆయన రాజీనామా చేసి తీరాలని కాక్రోచ్‌లు ఢిల్లీలో భారీ నిరసనకు ప్లాన్ చేశారు. అయితే గతంలో జరిగిన నీట్ నిరసనలు అదుపు తప్పటంతో.. ఈసారి సర్కారు అసాధారణ రీతిలో ఆంక్షలు విధించి.. కాక్రోచ్‌ల నిరసనను అడ్డుకుంది. దీంతో ఇప్పుడు ప్రతిపక్షం ధర్నా ఏమౌతుందోనని మొదట్లో అనుమానాలొచ్చినా.. ముందే షరతులతో అనుమతించిన ఢిల్లీ పోలీసులు.. ఆ తర్వాత అదనపు ఆంక్షలు పెట్టకపోవడం, అందుకు తగ్గట్టుగా సర్కారు కూడా ప్రతిపక్షాల ధర్నాకు అడ్డంకులు కలిగించే ప్రయత్నం చేయకోవడం.. వెరసి ఇండి కూటమి ధర్నా విజయవంతమైంది. కానీ ఒక్క ధర్నా విజయవంతమైనంత మాత్రాన ఇప్పటికిప్పుడు సర్కారు పనైపోయిందని, కాంగ్రెస్ ఏదో బలపడిందని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎన్నికల వరకూ ఈ టెంపోను విపక్షం కొనసాగించగలగా..? ఇప్పుడు కేంద్రం ఎలాంటి కౌంటర్ ప్లాన్ చేస్తుంది..? అనే ప్రశ్నలకు సమాధానాలే.. భవిష్యత్ పరిణామాలకు దారితీయనున్నాయి.

సర్ విషయంలో మొదట్నుంచీ వదలకుండా పోరాడుతున్న రాహుల్ గాంధీ.. ఇప్పటికే తన దగ్గరున్న ఆధారాలతో నాలుగైదుసార్లు ప్రెస్‌మీట్‌ పెట్టారు. చివరకు సర్ బాధిత ఓటర్లను మీడియా ముందుకు తీసుకొచ్చి మాట్లాడించారు. ఈసీ ఇచ్చిన వివరణలో కూడా కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. ఓటుచోరీ చేస్తున్న కేంద్రానికి అధికారంలో కొనసాగే హక్కే లేదంటున్నారు రాహుల్. మొత్తం మీద కొన్నాళ్లుగా ఇండి కూటమి బలహీనపడుతుందనే వార్తలు, ఆప్, డీఎంకే లాంటి పార్టీలు దూరమైన తరుణంలో జరిగిన.. విపక్షాల ధర్నా.. ఇండి కూటమిని ఏకతాటిపైకి తేవడమే కాకుండా.. ప్రభుత్వ వ్యతిరేక శక్తుల బలప్రదర్శనకు వేదికగా నిలిచిందని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది.

దేశ ప్రజల్లోనూ సర్ విషయంలో గట్టి చర్చే జరుగుతోందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. మొదట్లో కొందరే తమ వాదన వైపు మొగ్గుచూపినా.. కాలం గడుస్తున్న కొద్దీ.. ప్రభుత్వ, ఈసీ వైఖరులు గమనిస్తున్నకొద్దీ సామాన్య ప్రజల్లోనూ కొత్త సందేహాలు మొదలయ్యాయని హస్తం పార్టీ భావిస్తోంది. ప్రస్తుతానికి ప్రజల్లో రేకెత్తిన అనుమానాల్ని అవకాశంగా తీసుకుని.. వాటికి ఆధారాలు కూడా చూపి.. కేంద్రాన్ని, ఈసీని ఎండగట్టగలిగితే.. తాము ఈ విషయంలో విజయం సాధించినట్టేననేది కాంగ్రెస్ భావన. అన్నింటికీ మించి సర్ విషయంలో గతంతో పోలిస్తే.. ప్రస్తుతం కేంద్రం కూడా అంత ధీమాగా లేదనేది కాంగ్రెస్ అంచనా. అందుకే పార్లమెంట్‌లో చర్చకు సిద్ధమన్న అమిత్‌ షా సవాల్‌కు ఆ పార్టీ స్పందించలేదు. మొదట జ్ఞానేష్ కుమార్‌తో రాజీనామా చేయించాకే.. ఏదైనా మాట్లాడతామని పట్టుబడుతోంది. అయితే ఇప్పటికే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో వెనకడుగేసినట్టు భావిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు జ్ఞానేష్ కుమార్‌తో రాజీనామా చేయించే పరిస్థితి ఉందా.. అంటే లేదనే చెబుతున్నారు మెజార్టీ విశ్లేషకులు. ఇలా నిరసనలు జరిగిన ప్రతిసారీ రాజీనామాలు చేసుకుంటూపోవడం.. సరైన సంకేతాలు పంపబోదనే చర్చ ఇప్పటికే బీజేపీలో జరుగుతోంది. అందుకే కౌంటర్ ర్యాలీలకు ప్లాన్ చేశారనే అభిప్రాయాలున్నాయి.

దేశ రాజకీయాల్లో ప్రస్తుత రచ్చ.. సర్‌ పేరుతో జరుగుతున్నా.. అంతకు మించిన రాజకీయం ఏదో ఉందనే సందేహం లేకపోలేదు. ఎందుకంటే ఇటీవలే మోడీ ప్రధానిగా పుష్కరం పూర్తిచేసుకున్నారు. మరోవైపు ఇండి కూటమి బలహీనపడిందనే సంకేతాలు వస్తున్న తరుణంలో.. బడ్జెట్ సెషన్‌ నుంచి పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు కదం తొక్కుతున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో అటు అధికార పక్షం.. ఇటు విపక్షం పోటాపోటీ నిరసనలకు సిద్ధమయ్యాయి. ప్రధానిగా మోడీ ఛరిష్మా, కేంద్ర ప్రభుత్వం బలం ఎక్కడా తగ్గలేదని చాటుకోవడం అధికార పక్షానికి కీలకం కాగా.. ఇండి కూటమి దగ్గరకు వస్తే.. గతానికి, ప్రస్తుతానికి చాలా తేడా ఉందని చెప్పడమే టార్గెట్. మొత్తం మీద అధికార, ప్రతిపక్షాలు రెండూ తమను తాము దేశ ప్రజల ముందు కొత్తగా ఆవిష్కరించటానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే వచ్చే ఏడాది యూపీ ఎన్నికలకు, ఆ తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఈ రాజకీయ పోరాటాలే నిచ్చెన మెట్లవుతాయనే ఆలోచన రెండు పక్షాల్లో ఉంది. అలాగే కొన్ని కీలక బిల్లులు పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉన్న తరుణంలో.. సంఖ్యాబలాన్ని పక్కనపెట్టి.. నైతికంగా బలపడాల్సిన అవసరం రెండు పక్షాలకూ చాలా ఉంది. ఇలా అటు అధికార పక్షం.. ఇటు ప్రతిపక్షం ఎవరికి వారు సొంత రాజకీయ అజెండాను మనసులో పెట్టుకుని.. పైకి మాత్రం సర్‌ యుద్ధం చేస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఏతావాతా దేశంలో రాజకీయ వాతావరణం బాగా వేడెక్కింది. సర్ యుద్ధం కూడా క్లైమాక్స్‌కి చేరింది. ఇప్పటిదాకా సినిమా ఎలా నడిచింది.. ఎవరు పైచేయి సాధించారనే అంశాలకు ఇకపై ప్రాధాన్యత ఉండకపోవచ్చు. అంతిమంగా క్లైమాక్స్ల్‌లో సరైన అడుగులు పడితేనే.. సినిమా విజయవంతమౌతుంది. ఇప్పుడు అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ కూడా చివరి ఘట్టంలో పట్టు విడవకూడదనే పట్టుదలతో కనిపిస్తున్నాయి. ఇక్కడ గెలుపోటముల కంటే కూడా.. ఎవరి వాదన బాగా జనంలోకి వెళ్తుంది..? అవతలి వారి వాదనకు ఏమేరకు కౌంటర్ ఇవ్వగలం..? అనే అంశాలు కీలకం అనడంలో మరో మాటకు తావే లేదు.