మన దేశం, ప్రపంచం ఇప్పటిదాకా చాలా వైపరీత్యాల్ని, ప్రకృతి ప్రకోపాల్ని చూశాయి. ఎదుర్కున్నాయి. కానీ మునుపెన్నడూ చూడనంత స్థాయిలో తీవ్ర దుష్ప్రభావం చూపిస్తున్న ఎల్‌నినో మాత్రం అందర్నీ వణికిస్తోంది. మామాలుగా అయితే ఆరేడేళ్లకోసారి ఎల్‌నినో పరిస్థితులు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు వచ్చింది ఆషామాషీ ఎల్‌నినో కాదు. శతాబ్ద కాలంలో ఎన్నడూ ఎరగని తీవ్ర ఎల్‌నినో ముంచుకొచ్చింది.దీనికి తోడు ఇప్పటికే యుద్ధాల కారణంగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రపంచానికి ఎల్‌నినో పులి మీద పుట్రలా మారింది. అసలే సమస్యలతో నెట్టుకొస్తున్న పలుదేశాలు.. ఇప్పుడు ఎల్‌నినో దెబ్బతో పూర్తిగా కుదేలయ్యే దుస్థితి వచ్చింది. అన్నింటికీ మించి ఎల్‌నినో భయంకర కరవును మోసుకొస్తుందనేది ఇప్పటికే స్పష్టమైన దృశ్యం. మిగతా ఏ సమస్యలకైనా ప్రత్యామ్నాయం చూసుకోవచ్చు కానీ.. ఆహార సమస్య వస్తే.. అదీ ప్రపంచమంతా ఒకేసారి కమ్మేస్తే.. ఆ సమస్యకు పరిష్కారం వెతకటం చాలా కష్టం. ఇప్పటిదాకా అయిన అనుభవాల ప్రకారం.. కరోనా వచ్చినా.. ఆహార సంక్షోభం రాలేదు. ఉక్రెయిన్ యుద్ధం జరిగినా.. సగం ప్రపంచంపై పెద్దగా ప్రభావం పడలేదు. ఇక ఇరాన్ యుద్ధంతో ఇంధన సంక్షోభం వచ్చినా.. ఆహార సమస్య ఉత్పన్నం కాలేదు. కానీ ఇప్పుడు ఎల్‌నినో మాత్రం మన చేతిలో లేని ఆహార, తాగునీటి సమస్యల్ని మోసుకొస్తోంది. చివరకు గుక్కెడు నీళ్లు, పిడికెడు బువ్వే ఘనమయ్యే దుస్థితి రాబోయే రోజుల్లో వచ్చేలా ఉంది. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.
ప్రకృతి ఉపద్రవాలు, వైపరీత్యాలు చెప్పి వచ్చినా..చెప్పకుండా వచ్చినా, అకస్మాత్తుగా వచ్చి మీద పడినా వాటిని ఎదుర్కొవాల్సిందే. ఈ శతాబ్దంలోనే అతిపెద్ద ఉపద్రవమైన కరోనాను మనం చూశాం. కోవిడ్ నుంచి ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రభుత్వాలు, ప్రజలు ఒక్కమాటపైకి వచ్చి జాగ్రత పడ్డాం. కొంత ప్రాణ నష్టం జరిగినప్పటికీ మొత్తంగానైతే క్షేమంగానే బయటపడ్డాం. అలాంటి సంక్షోభం కాకపోయినప్పటికీ, మరోసారి ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది ఎల్‌నినో సంక్షోభం. పసిఫిక్ మహా సముద్రంలో ఎల్‌నినో ముంచుకొస్తుందని ఆరేడు నెలల క్రితమే సమాచారం ఉంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం తగ్గిపోయింది. శీతాకాలంలో కూడా ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పంటలు సగం నాశనమయ్యాయి. వచ్చే ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అంటే వ్యవసాయంపైనే ఆధారపడిన భారత్ లాంటి దేశం ఆర్థికంగా కుదేలైపోనుంది. ఇప్పటికే దాని ప్రభావం తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది. సాగు,తాగునీటికి కొరత వచ్చేసింది. రేపో, మాపో కోతలకు వస్తాయనుకుంటున్న పంటలు నీటి చుక్క లేక అల్లాడిపోతున్నాయి. ఆనకట్టల దగ్గర నీళ్లు కనిపించడం లేదు. ఇక విద్యుత్ కొరత కూడా పెరిగిపోయింది. ఈ నెలలోనే తెలంగాణలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. తాగునీరు, సాగునీరు, విద్యుత్ కొరత, ఎండలు, విద్యుత్ కోతలతో జనం అల్లాడిపోతున్నారు. బియ్యం కిలో వందరూపాయలు దాటిపోయింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కళ్లు తెరిచింది. ఎల్‌నినో ఎదుర్కోవడానికి తగిన చర్యలు ప్రారంభించింది. ఉన్న నీటి వనరుల్ని జాగ్రత్తగా వాడుకోవడంతో పాటు.. ప్రజల్ని కూడా చైతన్యవంతం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది.
ముంచుకొస్తున్న ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషనల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఎదురయ్యే తీవ్ర నీటి కొరత, విద్యుత్ డిమాండ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు దండోరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. నీటిపారుదల, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ శాఖల అధికారులు సమర్పించిన నివేదికల ఆధారంగా వచ్చే నెల 1వ తేదీ నుంచే ఈ సమగ్ర కార్యాచరణను ప్రభుత్వం అమల్లోకి తేనుంది. ప్రస్తుత విద్యుదుత్పత్తి, డిమాండ్‌తో పాటు జలాశయాల్లో నీటి నిల్వల లెక్కలను పరిశీలించిన సర్కార్.. ఈ మేరకు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తోంది. రాబోయే ఏడాది కాలానికి తాగునీటి నిల్వలను ప్రాజెక్టులవారీగా కేటాయిస్తూ బ్లూప్రింట్ ఇప్పటికే ఖరారైంది.
ప్రాజెక్టుల నుంచి సాగునీటి కాలువల తూములను కట్టడి చేసి, కేవలం మనుషులు, పశువుల తాగునీటికే రిజర్వాయర్ల నీటిని వినియోగించాలని తీర్మానించారు. విద్యుత్ విషయంలోనూ అదే తీరుగా కట్టడిగా ముందుకు వెళ్లాలని.. విధుల్లో ఏమాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని సీఎం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఏ స్థాయిలో రికార్డులను తిరగరాసిందో ఈ నెల10 నుంచి 16 వరకు నమోదైన అధికారిక డేటాను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. ఈ నెల తొలి పక్షంలో రోజువారీ సగటు గరిష్ట డిమాండ్ 19,289 మెగావాట్లుగా ఉండగా, రోజూ సగటున 321.34 మిలియన్ యూనిట్ల భారీ వినియోగం జరిగింది. ఈ క్రమంలోనే ఈ నెల 15వ తేదీ ఉదతేదీ ఉదయం సరిగ్గా 10:29 గంటలకు రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త మైలురాయిగా 20,003 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైంది. అదే ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 334.54 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఇందులో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోనే అత్యధికంగా 12,281 మెగావాట్ల డిమాండ్ రికార్డు కాగా, ఉష్ణోగ్రతల సెగతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏకంగా 4,220 మెగావాట్ల ఆల్‌టైమ్ పీక్ లోడ్ నమోదై ట్రాన్స్‌కో అధికారులను విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం అక్టోబర్‌లోనే డిమాండ్ 20 వేల మెగావాట్లు దాటడంతో, రానున్న కాలంలో, మరి ముఖ్యంగా వేసవి సీజన్ నాటికి విద్యుత్ వినియోగం ఏ స్థాయికి చేరనుందో డిస్కమ్‌లు, ఇంధన శాఖ ముందస్తు లెక్కలు వేస్తున్నాయి. ఏ నెలలో ఎలా ఉండబోతుందో అంచనా వేస్తూ ఆ మేరకు కొనుగోళ్లు, ఉత్పత్తి పెంచడంపై ఫోకస్ పెట్టాయి.
వ్యవసాయం, గృహ, పరిశ్రమలు, వాణిజ్య అవసరాలు కలిపి వచ్చే ఎండాకాలంలో రోజువారీ పీక్ లోడ్ 24 వేలమెగావాట్లను దాటొచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తీవ్ర వర్షాభావంతో భూగర్భ జలాలు పడిపోయి బోర్లపై ఆధారపడటమే ఈ పెను డిమాండ్‌కు కారణమని గుర్తించిన అధికారులు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు సవరించుకోవడంపై దృష్టి సారించారు. రికార్డు డిమాండ్ వేళ విద్యుత్ గ్రిడ్ భద్రత దెబ్బతినకుండా ఉండేందుకు సబ్స్టేషన్ల సామర్థ్యం పెంపు, ఆటోమేటిక్ లోడ్ షెడ్డింగ్ వ్యవస్థలు, సమగ్ర గ్రిడ్ మేనేజ్మెంట్ పునర్నిర్మాణ పనులను ట్రాన్స్‌కో యంత్రాంగం వేగవంతం చేసింది. లోడ్ పెరిగినా ఫీడర్లు ట్రిప్ కాకుండా సాంకేతిక బలోపేతానికి నిరంతర నిఘా పెట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా మిషన్ భగీరథ, గ్రామీణ మంచినీటి సరఫరా వ్యవస్థల కింద తాగునీరందించేందుకు మొత్తం 62 జలాశయాలను అనుసంధానించారు. ఇందులో కృష్ణా బేసిన్‌లోని 36 రిజర్వాయర్లు, గోదావరి బేసిన్ పరిధిలోని 26 జలాశయాలు పూర్తిస్థాయి మంచినీటి అవసరాలకు ప్రధాన మూలాధారంగా ఉన్నాయి. ఈ నెల నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ వరకు రోజువారీ ఎండల తీవ్రత, నీటి ఆవిరి నష్టాలు లెక్కగడుతూ నెలవారీ డ్రా విధానాన్ని సిద్ధం చేశారు. ఎల్‌నినో పరిస్థితులు తీవ్రమై జలాశయాల్లో నీటిమట్టాలు కనిష్ట స్థాయికి పడిపోతే తీసుకోవాల్సిన అత్యవసర చర్యలపై స్పష్టతనిచ్చారు. డెడ్ స్టోరేజ్ కంటే దిగువకు నీరు వెళ్లినప్పుడు అత్యవసర పంపింగ్ మోటార్లు అమర్చి, ప్రత్యేక ఆఫ్టేక్ ఏర్పాట్ల ద్వారా చివరి బొట్టు వరకు తోడి తాగునీటి సరఫరాకు ఎక్కడా లోటు రాకుండా చేయాలని ఆదేశించారు. ఇందుకోసం కాల్వల స్లూయిస్ గేట్లను కట్టుదిట్టం చేసి, సాగునీటి అక్రమ విడుదలను పూర్తిస్థాయిలో నిరోధించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితులను క్షేత్రస్థాయి నుంచి పర్యవేక్షించేందుకు సెక్రటేరియెట్‌లో 24 గంటలూ పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్‌తో కూడిన వార్ రూమ్ ను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయివరకు విధులు నిర్వహించే ప్రతి అధికారి, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్ శాఖలలో చీఫ్ ఇంజినీర్లు, ఈఎన్సీలు, ఏఈఈ, డీఈఈ అధికారుల పనితీరుపై ప్రభుత్వం నిఘా పెట్టింది. వాటర్ గేట్లు, స్లూయిస్ లీకేజీలను తక్షణమే అరికట్టని ఇంజినీర్లను నేరుగా జవాబుదారీ చేయనున్నారు. మిషన్ భగీరథ పంపింగ్ స్టేషన్లు, విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో సరఫరాకు ఏ చిన్న విఘాతం కలిగినా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. క్షేత్రస్థాయి సమస్యలను ముందే పసిగట్టి పరిష్కరించడంలో విఫలమై, ప్రజలు రోడ్లెక్కే పరిస్థితి తీసుకొస్తే సంబంధిత అధికారులపై తక్షణమే సస్పెన్షన్ వేటు వేస్తామని సర్కారు హెచ్చరించింది. ప్రజలకు నిరంతరం తాగునీరు అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేసింది.
తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ప్రతి చుక్క నీరు, ప్రతి యూనిట్ విద్యుత్ అత్యంత విలువైందని గుర్తించిన సర్కారు, పొదుపు సూత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉరూరా చాటింపులు వేయించాలని, గ్రామాల్లో వీడియోలు ప్రదర్శించాలని నిర్ణయించింది. వ్యవసాయ బోర్ మోటార్ల వద్ద ఆటోమేటిక్ స్టార్టర్లను నియంత్రించనున్నారు. ఆరుతడి పంటలపై రైతులకు పొలం బాట ద్వారా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు నేరుగా అవగాహన కల్పించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓవర్‌హెడ్ ట్యాంకుల నుంచి నల్లా నీరు పొంగిపోకుండా చూడటం, ఉదయం వేళల్లో గరిష్ట లోడ్ సమయంలో అనవసర గృహోపకరణాల వాడకాన్ని నిలిపివేయడంపై ప్రచారం చేయనున్నారు. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో వీధి దీపాలను సకాలంలో ఆన్-, ఆఫ్ చేయడం, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల పరిమిత వినియోగం, పరిశ్రమల్లో పవర్ సేవింగ్ పద్ధతులను తప్పనిసరి చేశారు. పవర్, వాటర్ కన్జర్వేషన్‌ను సమన్వయం చేస్తూ ప్రచార డ్రైవ్ చేపట్టనున్నారు. భూగర్భంలో నీళ్లు అడుగంటిపోవడం, చెరువులు, ప్రాజెక్టుల్లో నీరు తగ్గిపోవడం వల్ల రాబోయే ఎనిమిది నెలలు చాలా డేంజర్ అని వాతావరణ శాఖ గట్టిగానే హెచ్చరిస్తోంది. ఈ విపత్కర పరిస్థితిని చూసి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికే అలర్ట్ అయ్యాయి. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి మీటింగ్ పెట్టి యాసంగిలో వరి సాగును వాయిదా వేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. అటు ఏపీలో సీఎం చంద్రబాబు తాగునీటికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

