Site icon NTV Telugu

Chairman’s Desk: కమ్యూనిస్టుల వందేళ్ల ప్రస్థానం ఎలా సాగింది..?

Chairman's Desk

Chairman's Desk

Chairman’s Desk: దేశంలో కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల పూర్తిచేసుకుంది. దున్నేవాడిదే భూమి నినాదంతో భూసంస్కరణలకు నాంది పలికిన వామపక్షాలు.. బెంగాల్‌, కేరళలో అధికారం చేపట్టి.. తమ పాలన ఎలా ఉంటుందో ప్రజలకు రుచి చూపించారు. అధికారం కంటే ప్రజాఉద్యమాలకే పెద్దపీట వేసిన లెఫ్ట్ భావజాలం.. నిబద్ధతతో కూడిన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ప్రజాస్వామ్య మూలసూత్రాలకు కట్టుబడుతూ.. ఎప్పుడు ఎక్కడ ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చే పరిస్థితి ఏర్పడినా.. అక్కడ ప్రజల్లో అవగాహన కలిగించి.. ఎర్రజెండా రెపరెపలాడింది. అలా దేశ ప్రజాస్వామ్య సౌధాన్ని పరిరక్షించడంలో కమ్యూనిజం తన వంతు పాత్ర పోషించింది. వందేళ్లలో కమ్యూనిస్టుల ప్రస్థానం ఎలా సాగింది..? ఇప్పటికీ ప్రజాపోరాటాలు ఎలా చేస్తున్నారు..? నేటి సమాజంలో వామపక్షాల ఆవశ్యకత ఏంటి..? ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.

ఎంఎన్‌ రాయ్, అబానీ ముఖర్జీ వంటి నేతలు 1920లోనే తాష్కెంట్‌లోనే కమ్యూనిజానికి పునాదులు వేయగా, భారత గడ్డపై సత్యభక్త నేతృత్వంలో 1925 డిసెంబర్‌ 26న కాన్పూర్‌లో పార్టీ రూపుదిద్దుకుంది. సంపూర్ణ స్వరాజ్‌ కావాలని కాంగ్రెస్‌ కంటే ముందే డిమాండ్‌ చేసిన ఘనత కమ్యూనిస్టులదే. ఈ సందర్భంగా చేసిన మొదటి తీర్మానం సంపూర్ణ స్వాతంత్య్రం, రెండవది దున్నేవాడికే భూమి. ఆనాటి నుండి భూ సమస్య తెరమీదికి రావడమేగాక, తెలంగాణా సాయుధ పోరాటం, భూమికోసం భుక్తి కోసం సాయుధ పోరాటం, బెంగాల్‌లో తేబాగా, కేరళలో పున్నప్ర వాయలార్‌, ఆంధ్రాలో చల్లపల్లి జమీందారీ వ్యతిరేక పోరాటాలు ఉవ్వెత్తున లేచాయి. భూఉద్యమం జాతీయస్థాయి అజెండాగా రూపొందింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత సీపీఐ రాజకీయంగా బలమైన పార్టీగా ఎదిగింది. ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగింది. 1957లో కేరళలో ఈఎంఎస్‌. నంబూద్రిపాద్‌ నేతృత్వంలో ప్రపంచంలోనే తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. ఇది భూ సంస్కరణలు, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఆ తర్వాత బెంగాల్‌లో మూడు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న కమ్యూనిస్టులు.. అక్కడ పరిపాలనలో తమ మార్క్ చూపించారు.

కంసుడు శ్రీకృష్ణుడిని పుట్టుకతోనే అంతం చేయ ప్రయత్నించినవిధంగా భారత కమ్యూనిస్టు పార్టీని చెరసాలలోనే పసిగుడ్డు ప్రాయంలోనే బ్రిటిష్‌‌‌‌ సామ్రాజ్యవాద ప్రభుత్వం అంతమొందించే ప్రయత్నం చేసింది. తుదకు బ్రిటిష్‌‌‌‌ సామ్రాజ్యవాదాన్ని మట్టికరిపించడంలో కమ్యూనిస్టు పార్టీ వీరోచిత పోరాటాలను, త్యాగాలను చేసింది. సీపీఐ పుట్టుకే శ్రామిక అంతర్జాతీయత, దేశభక్తితో మిళితమై ఉంది. కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటులో నాలుగు ప్రధాన స్రవంతులు కలిశాయి. ప్రపంచ యుద్ధ కాలంలో విదేశాల నుంచి ఆ తర్వాత జర్మనీ, అమెరికా, టర్కీ, ఆఫ్ఘనిస్థాన్‌‌‌‌లో విప్లవ కార్యాచరణలో ఉన్న భారత జాతీయ విప్లవకారులు అక్టోబర్‌‌‌‌ విప్లవ ప్రభావం కిందకు వచ్చారు. మహత్తర హిజ్రల్‌‌‌‌ ఉద్యమానికి సంబంధించిన జాతీయ విప్లవకారులు కూడా అక్టోబర్‌‌‌‌ విప్లవ ప్రభావం కిందకు వచ్చారు. కెనడా, అమెరికా తదితర దేశాల్లో స్థిరపడిన భారతీయులు ముఖ్యంగా పంజాబీలు 1913లో శాన్‌‌‌‌ఫ్రాన్సీస్‌‌‌‌కోలో గదర్‌‌‌‌ పార్టీని స్థాపించారు. గదర్‌‌‌‌ పార్టీ ముఖ్యులందరూ భారత కమ్యూనిస్టు పార్టీలో చేరారు. భారతదేశంలో ఉన్న జాతీయ విప్లవకారులు, జాతీయ కాంగ్రెస్‌‌‌‌లో అంతర్భాగంగా పనిచేస్తున్న సోషలిస్టు కాంగ్రెస్‌‌‌‌ పార్టీలోని అనేక మంది, అతివాదపక్షం, టెర్రరిస్టు సంస్థలు, ఖిలాపత్‌‌‌‌ ఉద్యమ నాయకులు, గదర్‌‌‌‌ పార్టీ నాయకులు 1921-22లో శాసనోల్లంఘన ఉద్యమం విఫలమయిన తర్వాత గాంధీజీ సిద్దాంతం పట్ల భ్రమలు కోల్పోయిన వ్యక్తులు అక్టోబర్‌‌‌‌ విప్లవ ప్రభావంతో సోషలిజంవైపు ఆకర్షితులయ్యారు. ఆ తర్వాత వీరే దేశంలో తొలి కమ్యూనిస్టు గ్రూపుల స్థాపకులయ్యారు. బొంబాయిలో డాంగే, మద్రాసులో సింగార్‌‌‌‌వేల్‌‌‌‌ సెట్టియార్‌‌‌‌, కలకత్తాలో ముజఫర్‌‌‌‌ అహ్మద్‌‌‌‌, లాహోర్‌‌‌‌లో ఇంక్విలాబ్‌‌‌‌ గ్రూపులకు చెందిన వారి కలయికతో 1925 డిసెంబర్‌‌‌‌ 26న కాన్పూర్‌‌‌‌లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు అయ్యింది. రైతాంగ పోరాటాలలో, విముక్తి పోరాటాల్లో, సంఘ సంస్కరణలు, సామాజిక మార్పులకోసం జరిగిన పోరాటాల్లో పాల్గొన్నవారిలో అధికులు కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు.

పుట్టుక దగ్గర్నుంచీ కమ్యూనిస్టులపై ఎన్నో కేసులు పెట్టారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని ప్రమాదకరంగా భావించిన బ్రిటిష్‌‌‌‌ ప్రభుత్వం 1934 జులైలో పార్టీని నిషేధించింది. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులందరూ కాంగ్రెస్‌‌‌‌లోనే ఉండి పనిచేసి దేశస్వాతంత్య్రం కోసం ద్విగుణీకృత పోరాటాలు నడిపారు. కాంగ్రెస్‌‌‌‌లోని అంతర్భాగంగా కాంగ్రెస్‌‌‌‌ సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అంతిమంగా కాంగ్రెస్‌‌‌‌ సోషలిస్టు పార్టీలోని కమ్యూనిస్టులతోపాటు మరెంతో మంది అభివృద్ది కాముకులు అక్టోబర్‌‌‌‌ విప్లవ ప్రభావంతో కాంగ్రెస్‌‌‌‌లోని వామపక్ష గ్రూపుగా ఏర్పడ్డారు. అనంతరం అనేక మంది కాంగ్రెస్‌‌‌‌ సోషలిస్టు పార్టీ నాయకులు కమ్యూనిస్టు పార్టీలో చేరారు. వీరిలో ఈఎంఎస్‌‌‌‌ నంబూద్రిపాద్, ​ చండ్ర రాజేశ్వర్‌‌‌‌రావు, పుచ్చలపల్లి సుందరయ్య, ఏకె.గోపాలన్‌‌‌‌, కంభంపాటి సీనియర్‌‌‌‌, రావి నారాయణ రెడ్డి, బద్ధం ఎల్లారెడ్డిలు ప్రముఖులు. జమ్మూ కాశ్మీర్‌, పంజాబ్‌, ఈశాన్య రాష్ట్రాల వేర్పాటు ఉద్యమాలలో కమ్యూనిస్టుల ప్రతిఘటనే భారతదేశ ఐక్యతకు తోడ్పడిరది. ఈ ప్రతిఘటనోద్యమంలో అనేకమంది కమ్యూనిస్టు యోధానుయోధులను పోగొట్టుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది సీపీఐ మాత్రమే. స్వాతంత్ర్యానంతరం ప్రజల పక్షాన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా సీపీఐ తన పోరాటాన్ని ఆపలేదు. దేశంలో వివిధ వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనేక ప్రజా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలు, రైతులు, వ్యవసాయ కూలీలు, దళితులు, గిరిజనులు, యువజనులు, విద్యార్థులకు అండగా ఉండి పోరాటాలు చేస్తున్న ఏకైక పార్టీ సీపీఐ. భూసంస్కరణలు, కార్మిక హక్కులు, కనీస వేతనాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ, విద్య, ఆరోగ్య రంగాలపై ప్రభుత్వ బాధ్యత వంటి అంశాలపై నిరంతరం ఉద్యమాలు చేసింది. కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడి ప్రజాపాలనకు దిశానిర్దేశం చేశాయి.

ప్రస్తుతం బంగ్లాదేశ్‌‌‌‌లో ఉన్న చాబర్‌‌‌‌ సిల్‌‌‌‌హెట్‌‌‌‌ జిల్లాలోని లోయ ప్రాంతంలో వీరోచిత కౌలు రైతుల పోరాటాలు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగాయి. మహారాష్ట్రలోని థానే జిల్లాలో భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా వర్లీ తెగకు చెందిన ఆదివాసీలు తిరుగుబాటు చేశారు. 1946లో రాయల్‌‌‌‌ ఇండియన్‌‌‌‌ నావీ తిరుగుబాటుదారులు కమ్యూనిస్టు పార్టీ జెండాను చేతబూనారు. పశ్చిమబెంగాల్‌‌‌‌లోని కౌలు రైతులు చేసిన పోరాటం తెబాగా పోరాటం పేరుతో చరిత్ర ప్రసిద్ధమైంది. కేరళలోని తిరువాన్‌‌‌‌కూర్‌‌‌‌ సంస్థానంలో కొబ్బరిపీచు కార్మికులు, వ్యవసాయ కార్మికులు, మత్స్యకార్మికుల వీరోచిత పోరాటం మలబార్‌‌‌‌ పోరాటంగా ప్రసిద్ధిగాంచింది. ఫ్రెంచ్‌‌‌‌ వలస పాలన నుంచి పుదుచ్చేరి విముక్తి పోరాటం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగి విజయవంతమైంది.

1946-51 మధ్య జరిగిన ఈ పోరాటం చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించిన సాయుధ పోరాటం. మూడు వేల గ్రామాల విముక్తి, 10 లక్షల ఎకరాల భూమి రైతాంగానికి పంపిణీ, వెట్టి చాకిరి రద్దు లాంటి అనేక విజయాలు ఈ పోరాటంలో సాధించారు. ప్రధానంగా నిజాం నవాబు లొంగిపోవడం, హైద్రాబాద్‌‌‌‌ రాష్ట్రం భారత్‌‌‌‌లో విలీనం, సాయుధ పోరాట ప్రభావంతో జరిగాయి. ఆనాటి సాయుధ పోరాటమే స్పూర్తిగా అనేక ఉద్యమాలకు నెలవై.. ఎంతోమంది వీరులకు జన్మనిచ్చింది. ఆ స్ఫూర్తితోనే నేటికీ తెలంగాణ అంటే పోరాటాల గడ్డగా భాసిల్లుతోంది.స్వాతంత్య్రం అనంతరం జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టులు జనతంత్ర ప్రజాసంఘటన .. పిడిఎఫ్‌‌‌‌ నాయకత్వంలో పోటీచేసిన 44 స్థానాలకుగాను 36 స్థానాల్లో గెలిచారు. పార్లమెంట్‌‌‌‌ స్థానాలకు పోటీచేసిన కామ్రేడ్‌‌‌‌ రావినారాయణ రెడ్డికి అప్పటి భారత ప్రధానమంత్రి నెహ్రుకంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అనేకమంది నేతలు జైల్లో ఉండి గెలిచారు. తెలంగాణ ప్రాంతంలో అత్యధిక స్థానాలు కమ్యూనిస్టు పార్టీ గెలిచింది.

1953-56 మధ్య కాలంలో దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలకోసం జరిపిన పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ అగ్రగామిపాత్ర పోషించింది. ఆంధ్రాలో విశాలాంధ్ర కోసం, కేరళలో ఐక్య కేరళ కోసం, తమిళనాడులో ఐక్య తమిళ కజగం కోసం, మహారాష్ట్రలో సమైక్య మహారాష్ట్ర కోసం ఉద్యమాలు నడిపి విజయవంతమైంది. భూ సంస్కరణలపై విజయం సాధించింది. కౌలుదారుల హక్కులు సాధించింది. కమ్యూనిస్టుల ఉద్యమ ప్రభావం రాజ్యాంగ పీఠికలో స్పష్టంగా కనిపించింది. దున్నేవాడికే భూమి నినాదంతో జమిందారీ, జాగిర్ధారీ పాలనకు వ్యతిరేకంగా రైతు కూలీలను సమీకరించారు. భూ సమస్యను ఎజెండా మీదకు తెచ్చారు. మహిళా హక్కులు, కుల నిర్మూలన, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమించింది కమ్యూనిస్టు పార్టీ. రాత్రిబడుల ద్వారా అక్షరాస్యతా కార్యక్రమాలు నిర్వహించింది. యువతను విద్య, వైజ్ఞానిక సేవా సాంస్కృతిక కార్యక్రమాల్లో సమీకరించింది.

కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే భూసంస్కరణల చట్టం, రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, గరిబీ హఠావోవంటి అనేక సంస్కరణలు వచ్చాయి. తెలంగాణ తలమానికమైన సింగరేణి సంస్ధ పరిరక్షణకు, కార్మికుల సంక్షేమం కోసం అలుపెరగని పోరాటాలు జరిగాయి. యూపీఏ ప్రభుత్వంలో సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ పథకం, అటవి హక్కుల చట్టం, కార్మిక సంక్షేమ చట్టాలు, పనిగంటలు, కనీస వేతనాలు కల్పించడం వంటివి కమ్యూనిస్టుల పోరాటాల వలనే సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్ర సాధనకు సిపిఐ నిర్ణయం ఒక కొత్త ఊపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలిపిన తొలి జాతీయ పార్టీ సిపిఐనే. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, సీతారామా ప్రాజెక్టు, బయ్యారం ఉక్కు కోసం అలుపెరగని పోరాటాలు చేసింది సిపిఐ.

అంతకుముందు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులోనూ, విశాలాంధ్ర ఉద్యమంలోనూ కమ్యూనిస్టులు అగ్రభాగాన నిలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఏళ్లపాటు సీపీఐ బలమైన ప్రతిపక్షంగా పనిచేసింది. చండ్ర రాజేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి, సురవరం సుధాకరరెడ్డి వంటి దిగ్గజ నాయకులు ఇక్కడి నుంచే జాతీయ స్థాయికి ఎదిగారు. సీహెచ్‌ రాజేశ్వర్‌ రావు, దేశిని చినమల్లయ్య, చాడా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు వంటి నాయకులు రాష్ట్రంలో సీపీఐ ఎదుగుదలలో తమ వంతు పాత్ర పోషించారు. ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్‌ జిల్లాల్లో సీపీఐ బలమైన రాజకీయశక్తిగా కొనసాగింది. పొత్తు రాజకీయాల్లో పార్టీ కుంచించుకుపోయినా, రాజకీయంగా పల్లెలు, పట్టణాల్లో ఎర్రజెండా ఉనికి ఇప్పటికీ చాటుతోంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా సీపీఐ తనదైన ముద్ర వేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2003లో జరిగిన విద్యుత్‌ ఉద్యమంలో కూడా సీపీఐ కీలక పాత్ర పోషించింది.

కమ్యూనిస్టు ప్రభుత్వాలు కొనసాగిన పశ్చిమ బెంగాల్‌, కేరళ, త్రిపురలో ఇప్పటికీ భూపోరాటాల ఊసే లేదు. భూ సంస్కరణలు అమలు చేయడంలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు నికార్సైన చిత్తశుద్ధి ప్రదర్శించాయి. కమ్యూనిస్టుల పోరాటం వల్లే భూసంస్కరణలు అమలులోకి వచ్చాయి. అందులో ఇప్పటికీ లోపాలు ఉండొచ్చు. కమ్యూనిస్టుల కారణంగానే ఫ్యూడల్‌, భూస్వామ్య సంకెళ్లు తెగడం మొదలైంది. ప్రభుత్వ రంగ సంస్థలు అవతరించడానికి నెహ్రూ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పాత్ర ఎంతో కమ్యూనిస్టు పార్టీ పాత్ర అంతకన్నా ఏ మాత్రం తక్కువ కాదు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అన్న ప్రతిపాదన పార్వతీకృష్ణన్‌ లాంటి సీపీఐ నాయకుల నుంచే వచ్చింది. ఆ తరవాత ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికైన గీతా ముఖర్జీ మహిళల రిజర్వేషన్ల అంశాన్ని అమిత ప్రచారంలోకి తీసుకొచ్చారు. కమ్యూనిస్టు పార్టీ ప్రభావం కేవలం రాజకీయ రంగానికే పరిమితమైంది కాదు. వివిధ రంగాల్లోని ప్రజలను సంఘటితం చేయడానికి అనేక ప్రజాసంఘాలు ఏర్పాటు చేసింది. సర్వ కళారంగాలను సి.పి.ఐ. ప్రభావితం చేసింది. కళలు ఆనందం కోసం కాదు సమాజాభ్యుదయానికే అన్న తెలివిడి కమ్యూనిస్టు పార్టీ వల్లే కలిగింది. అఖిల భారత స్థాయిలో అభ్యుదయ రచయితల సంఘం, ప్రజానాట్య మండలి కమ్యూనిస్టు పార్టీ ప్రభావం వల్ల ఏర్పడినవే. అందుకే ఇప్పటికీ కవులు, రచయితల్లో పురోగామి భావాలున్న వారే ఎక్కువ. బోనస్‌, ప్రావిడెంట్‌ ఫండ్‌ లాంటి కార్మిక సంక్షేమ కార్యక్రమాలు వ్యవస్థీకృతం కావడానికి కమ్యూనిస్టుల కృషే ప్రధానం. దేశ రాజకీయ చరిత్రలో వందేళ్లలో ఎన్నో ఒడుదుడుకుల్ని ఎదుర్కున్న కమ్యూనిస్టులు.. మొదట్నుంచీ ఇప్పటివరకూ కార్మికుల హక్కుల విషయంలో రాజీలేని పోరాటం సాగిస్తున్నారు. అలాగే అన్ని వర్గాల్లో పీడితులు, బాధితులకు అండగా నిలబడుతున్నారు. ఇప్పటికీ కొన్ని వర్గాలు ఎర్రజెండా తోడుని భరోసాగా భావిస్తున్న స్థితి కొన్ని ప్రాంతాల్లో ఉందనేది ఎవరూ కాదనలేని సత్యం.

కమ్యూనిస్టుల ఉద్యమ ప్రభావం రాజ్యాంగ పీఠికలో స్పష్టంగా కనిపించింది. దున్నేవాడికే భూమి నినాదంతో జమీందారి, జాగిర్ధారీ పాలనకు వ్యతిరేకంగా రైతు కూలీలను సమీకరించారు. భూ సమస్యను ఎజెండా మీదకు తెచ్చారు. కార్మికులు, కర్షకులతో పాటు మహిళలు, దళితులు, ఆదివాసీలు స్వాతంత్రోద్యమంలోకి వచ్చారు. మహిళా సమానత్వ హక్కును ఎజెండాలోకి తెచ్చారు. వరకట్నం, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా సీపీఐ అనేక ఉద్యమాలు చేసింది. కందుకూరి, గురజాడ వంటి వారి సంస్కరణోద్యమాలకు కమ్యూనిస్టు ఉద్యమం ఊపిరి పోసింది. నాగార్జునసాగర్‌, శ్రీశైలం వంటి ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కోసం అనేక పోరాటాలు నిర్వహించింది.

1920లో కమ్యూనిస్టుల సహకారంతో ఏఐటియుసి, 1936లో అఖిల భారత కిసాన్‌ సభ , 1936లో అఖిల భారత విద్యార్ధి సంఘం, 1936లో వ్యవసాయ కార్మిక సంఘం , 1936లో అభ్యుదయ రచయితల సంఘం.. అరసం, 1943 లో ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్స్‌ అసోషియేషన్‌.. ఇప్టా ఏర్పాటు చేశారు. ఇఫ్టా, ఆరసంలాంటి సాస్కృతిక సంఘాలు దేశవ్యాప్తంగా సాంస్కృతిక విప్లవానికి నాంది పలికాయి. దళితులు మందిరాల్లో ప్రవేశానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా, మూఢ నమ్మకాలకు, ఆచారాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. ప్రజల్లో హేతువాద, శాస్త్రీయ ఆలోచనలు పెంచడానికి కృషి చేశారు. బాల్యవివాహాల రద్దుకు, అభ్యుదయ వివాహాలకు, సతీసహగమనం రద్దుకై అనేక పోరాటాలు చేశారు. కాలక్రమంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గిన మాట నిజం. అంతమాత్రాన కమ్యూనిస్టుల పనైపోయిందనే పరిస్థితి లేదు.

ఆమాటకొస్తే.. దేశంలో కమ్యూనిజం ఆవశ్యకత, అవసరం ఎన్నడూలేని విధంగా ఈనాడు ఉంది. ఉద్యోగ భద్రత లేదు, ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌, కాంట్రాక్టు కార్మికుల పేరుతో అతి తక్కువ వేతనాలతో కొత్తరూపంలో శ్రమదోపిడీ జరుగుతోంది. భావాన్ని, ప్రశ్నించేవారిని అణచివేస్తున్నారు. కవులు, కళాకారులను ఆరాచకులు కాల్చి చంపుతున్నారు. సోషల్‌‌‌‌ మీడియాను ఒక యూనివర్సిటీగా మలచుకుని విద్రోహపూరిత విషజ్వాలలను సమాజంలో విరజిమ్ముతున్నారు. దేశంలో ఆర్ధిక అసమానతలు ఎన్నడూలేని విధంగా పెరిగాయి. భారత్ 4వ ఆర్థిక వ్యవస్థగా చెపుతున్నప్పటికీ.. సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైంది. ప్రపంచ జనాభా 600 కోట్లలో మూడో వంతు అంటే.. 187కోట్ల జనాభా కలిగిన దేశాలలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు. అలాగే ప్రపంచంలోని 192 దేశాలలో దాదాపు 150 దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు ఆయా దేశాలకు దశా దిశా నిర్దేశం చేస్తున్నాయి. చైనా, ఉత్తరకొరియా, వియత్నాం, లావోస్‌‌‌‌, కంబోడియా, శ్రీలంక, నేపాల్‌‌‌‌, లాటిన్‌‌‌‌ ఆమెరికా దేశాలు, బ్రెజిల్‌‌‌‌ లాంటి దేశాలలో వామపక్షాలు అధికారంలో ఉన్నాయి. భారత్‌ లాంటి దేశాలలో కమ్యూనిస్టులు అధికారంలో లేకపోయినా కోట్లాదిమంది ప్రజాసంఘాలలో, కార్మిక సంఘాలలో సభ్యులుగా కొనసాగుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారు.

మనిషి కేంద్రంగా పుట్టిన సిద్ధాంతం కమ్యూనిస్టు సిద్దాంతం. మెరిసేదంతా బంగారం కాదు, చూసేదంతా నిజమూ కాదని నానుడి ఉంది. అది తర్కం ద్వారా నిజమని తేలింది. అయితే ఆ తర్కంలోకి పోవడానికి ఇది సందర్భం కాదు. సిపిఐ గురించి మరో కోణంలో చూడగలిగితే చరిత్రకు న్యాయం జరుగుతుంది. కమ్యూనిస్టులు దేశమౌలిక విధానాల పట్ల నిబద్ధతగా నిలబడ్డారని చరిత్ర చెపుతుంది. జనంలో చైతన్యాన్ని తట్టిలేపింది. అయితే, ప్రస్తుత కమ్యూనిస్టుల కర్తవ్యమేమిటి ? ఎర్రజెండాలకు అంకితమయిన పార్టీలన్నీ ఒకగూటికి చేరాల్సిన తరుణం ఆసన్నమయింది. ఆలస్యం అమృతం విషం. అనునిత్యం ప్రజల్లో ఉంటున్నందునే కమ్యూనిస్టు పార్టీ వందేళ్లు క్రియాశీలకంగా ఉంది. అనేక పార్టీలు పుట్టాయి, పోయాయి, కానీ కమ్యూనిస్టు పార్టీ ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు దేశంలో ఉన్న సవాళ్లను ఎదుర్కోవడానికి కమ్యూనిస్టులు ఒకటవ్వాలి. కార్మిక వర్గం ఒక్కటై ఉద్యమాలు మరింత పెంచితే ప్రజల్లో ఉత్సాహం రావడంతో పాటు కార్మికులకు న్యాయం జరుగుతుంది. తొలుత సీపీఐ, సీపీఎం కలిస్తే.. ఆ తర్వాత మిగతా పార్టీలు కలవడానికి వీలుంటుంది. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటూ పిలుపునిచ్చే కమ్యూనిస్టులు.. మొదట తాము ఏకతాటిపైకి రావాలనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ డిమాండ్ కేవలం కమ్యూనిస్టుల అభిమానుల నుంచి మాత్రమే కాకుండా.. సాధారణ ప్రజల నుంచి కూడా ఉండటం లెఫ్ట్ పార్టీలు గుర్తించాల్సిన అవసరం ఉంది. కొంతకాలంగా విలీనం దిశగా చర్చలు జరుపుతున్న వామపక్షాలు.. మరి వందేళ్ల సందర్భంగా అయినా ఆ దిశగా ముందుడగు వేయాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇదీ ఈ వారం ఛైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.

Exit mobile version