ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పేరు మారుతుంది. కంపెనీ బోర్డు పేరు మార్పును ఆమోదించింది. కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ వాటాదారులకు రాసిన లేఖలో ఈ సమాచారాన్ని అందించారు. అయితే, జొమాటో బ్రాండ్ పేరులో ఎటువంటి మార్పు ఉండదు. యాప్‌లో కూడా జొమాటోగానే ఉంటుంది. కంపెనీ పేరు మాత్రమే మార్చనున్నారు. జొమాటో లిమిటెడ్ కంపెనీ కాస్త ఇప్పుడు ఎటర్నల్ లిమిటెడ్ గా మారనుంది.
జొమాటో పేరు ఎందుకు మార్చారు?
కంపెనీ సీఈఓ, వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ పేరును మార్చడానికి గల కారణాన్ని వెల్లడించారు. కంపెనీ ఫుడ్ డెలివరీతో పాటు ఇతర రంగాలలో తన వ్యాపారాన్ని విస్తరిస్తోందన్నారు. “బ్లింకిట్‌ను సొంతం చేసుకున్నప్పటి నుంచి జొమాటోను ఎటర్నల్‌గా వ్యవహరిస్తూ వచ్చాం. కానీ దానిని బహిరంగంగా ప్రకటించలేదు. ప్రస్తుతం జొమాటో కిరాణా, టిక్కెట్ల అమ్మకం, తదితర వ్యాపారాలలో మెరుగుపడుతోంది. కంపెనీకి బ్రాండ్/యాప్ మధ్య వ్యత్యాసం ఉండాలనుకున్నాం. ఈ ఉద్దేశంతో ఈ పేరు మార్చాం. బ్రాండ్ పేరులో ఎటువంటి మార్పు ఉండదు. పేరు జొమాటోగానే కొనసాగుతుంది. స్టాక్ టిక్కర్ సైతం ఎటర్నల్‌గా మారుతుంది. ” అని దీపిందర్ గోయల్ అన్నారు.