Windfall Tax Cut on Petrol, Diesel & ATF: అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో.. క్రూడాయిల్ ధర క్రమంగా పెరుగుతోన్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.. పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతులపై విధించే విండ్‌ఫాల్ పన్నును కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. కొత్త పన్ను రేట్లు సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ రేట్లు తదుపరి పక్షం రోజుల పాటు కొనసాగనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ప్రతి రెండు వారాలకు ఒకసారి విండ్‌ఫాల్ పన్ను రేట్లను సమీక్షిస్తూ ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. డీజిల్ ఎగుమతులపై గతంలో లీటరుకు రూ.25గా ఉన్న విండ్‌ఫాల్ పన్నును రూ.20కి తగ్గించారు. అంటే లీటరుకు రూ.5 మేర పన్ను తగ్గింది. అదే సమయంలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతులపై పన్నును లీటరుకు రూ.19 నుంచి రూ.15కు తగ్గించారు. ATFపై లీటరుకు రూ.4 మేర పన్ను తగ్గింది. పెట్రోల్ ఎగుమతులపై కూడా పన్నును గణనీయంగా తగ్గించారు. గతంలో లీటరుకు రూ.1.50గా ఉన్న ఎగుమతి సుంకాన్ని ఇప్పుడు 50 పైసలకు తగ్గించారు. దీంతో పెట్రోల్ ఎగుమతులపై పన్ను భారం లీటరుకు రూ.1 మేర తగ్గింది.
దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం లేదు
ఈ తాజా నిర్ణయంతో దేశయంగా ఎలాంటి ప్రభావం ఉండదు.. విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు దేశంలో విక్రయించే పెట్రోల్, డీజిల్‌కు వర్తించదు. దేశీయ వినియోగం కోసం విక్రయించే ఇంధనాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి తాజా నిర్ణయం ప్రధానంగా పెట్రోల్, డీజిల్, ATF ఎగుమతులపై విధించే పన్నుకే పరిమితమవుతుంది.
విండ్‌ఫాల్ ట్యాక్స్ అంటే ఏమిటి?
విండ్‌ఫాల్ ట్యాక్స్ అనేది కంపెనీలకు అనూహ్యంగా లేదా అసాధారణ స్థాయిలో అధిక లాభాలు వచ్చినప్పుడు వాటిపై విధించే అదనపు పన్ను. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగినప్పుడు చమురు కంపెనీలకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ లాభాలపై ప్రభుత్వం అదనపు పన్ను విధిస్తుంది. పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో అంతర్జాతీయ ధరలు పెరిగినప్పుడు దేశీయంగా లభించే ఇంధనాన్ని కంపెనీలు పెద్ద మొత్తంలో ఎగుమతి చేయకుండా చూడటం, దేశంలో తగినంత సరఫరాను కొనసాగించడం విండ్‌ఫాల్ ట్యాక్స్ ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి. అంతర్జాతీయ, దేశీయ మార్కెట్ల మధ్య ధరల వ్యత్యాసాన్ని కంపెనీలు ఎగుమతుల కోసం ఉపయోగించుకునే అవకాశాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పన్ను
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వం 2026 మార్చి 27 నుంచి డీజిల్, ATF ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్నును విధించింది. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి రెండు వారాలకు ఒకసారి పన్ను రేట్లను సవరించింది. పెట్రోల్ ఎగుమతులపై ఈ సుంకాన్ని మే 16 నుంచి అమలు చేసింది. దేశీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతకు ఇబ్బంది లేకుండా చూడటం, అంతర్జాతీయంగా అధికంగా ఉన్న ధరల కారణంగా కంపెనీలు దేశీయ సరఫరాను తగ్గించి భారీగా ఎగుమతులు చేయకుండా నియంత్రించడం ఈ చర్యల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.
ఎగుమతి కంపెనీలకు పన్ను భారం తగ్గింపు
విండ్‌ఫాల్ పన్ను తగ్గింపుతో పెట్రోల్, డీజిల్, ATF ఎగుమతి చేసే కంపెనీలకు నేరుగా పన్ను భారం తగ్గుతుంది. విదేశీ మార్కెట్లలో ఈ ఉత్పత్తులను విక్రయించినప్పుడు గతంతో పోలిస్తే తక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఎగుమతి ఖర్చులు తగ్గి, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయాల ద్వారా వచ్చే లాభాలపై పన్ను ప్రభావం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఈ నిర్ణయం దేశీయ వినియోగదారులకు తక్షణ ప్రత్యక్ష ప్రయోజనం కల్పించదు. ఎందుకంటే దేశంలో వినియోగించే పెట్రోల్, డీజిల్‌పై అమల్లో ఉన్న పన్ను రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. తాజా నిర్ణయం పూర్తిగా ఎగుమతులపై విధించే విండ్‌ఫాల్ పన్నుకు సంబంధించినదే.
ఎగుమతులపై కంపెనీల వ్యూహాలు మారే అవకాశం
పన్ను భారం తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లకు పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేయడం కంపెనీలకు మరింత ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది. దీంతో కంపెనీలు అంతర్జాతీయ ధరలు, దేశీయ డిమాండ్, లభ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తమ అమ్మకాలు, ఎగుమతుల వ్యూహాలను సర్దుబాటు చేసుకోవచ్చు. మరోవైపు పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ ఇంధన ధరలు, సరఫరా పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. అందుకే విండ్‌ఫాల్ పన్ను రేట్లను ప్రతి రెండు వారాలకు సమీక్షించే విధానం కొనసాగుతోంది. తాజా తగ్గింపు ఎగుమతులపై పన్ను భారాన్ని తగ్గించినప్పటికీ, దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించిన ప్రస్తుత పన్ను రేట్లు మాత్రం యథాతథంగా ఉన్నాయి.

