Vodafone Idea: వినియోగదారులకు శుభవార్త చెప్పిన వొడాఫోన్ ఐడియా.. రీఛార్జ్ ప్లాన్లపై కీలక ప్రకటన..

Vodafone Idea

Vodafone Idea

ప్రముఖ టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా (Vi) ప్రస్తుతానికి రీఛార్జ్‌ ధరల పెంపునకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కంపెనీ సీఈఓ అభిజిత్ కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న మొబైల్ టారిఫ్ ప్లాన్లలో కేవలం చిన్నపాటి సవరణలు మాత్రమే ఉంటాయి. ఇతర కంపెనీల మాదిరిగా భారీ స్థాయిలో ధరలను పెంచే ఆలోచన ప్రస్తుతానికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల భారతీ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్లను 4-5 శాతం పెంచింది. విశ్లేషకులు ఈ ఏడాది ప్రథమార్థంలో టెలికాం ధరలు 15 శాతం వరకు పెరగవచ్చని అంచనా వేసినప్పటికీ, Vi మాత్రం ఆచితూచి అడుగు వేస్తోంది.

కంపెనీలో ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉండటం తమకు ఎంతో బలాన్నిస్తుందని కిషోర్ పేర్కొన్నారు. ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పనితీరును మెరుగుపరచుకోవడంపైనే ప్రస్తుతం దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. గత కొన్నేళ్లుగా వినియోగదారులను కోల్పోతూ వస్తున్న Vi, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మెరుగైన ఫలితాలను సాధించింది. మార్చి నెలలో కొత్తగా 1 లక్ష మందికి పైగా చందాదారులు చేరడం కంపెనీ పునరుద్ధరణకు నిదర్శనంగా నిలుస్తోంది. COAI డిజికామ్ సమ్మిట్ 2026లో భాగంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. వినియోగదారులను ఆకట్టుకుంటూనే.. సంస్థ ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే లక్ష్యంగా Vi ముందుకు సాగుతోంది.