IRCTC: వందే భారత్ ఫుడ్ మెనూలో మార్పులు చూశారా.. ఇకపై ఆ 4 ఐటమ్స్ మాత్రమే పెడతారట!

Vande Bharat New Food Menu

Vande Bharat New Food Menu

IRCTC: ప్రీమియం ప్రయాణానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వందే భారత్ రైళ్లలో భోజన ప్రియులకు రైల్వే శాఖ పెద్ద షాకిచ్చింది. ఇప్పటి వరకు ప్రయాణికులకు పది రకాల వంటకాలతో విందు భోజనం అందించిన ఐఆర్‌సిటిసి (IRCTC), ఇప్పుడు ఆ మెనూను పూర్తిగా కుదించేసింది. ఇకపై 8 నుంచి 10 రకాల పదార్థాలకు బదులుగా, కేవలం నాలుగు రకాల వంటకాలను మాత్రమే వడ్డించాలని నిర్ణయించింది.

కొత్త మెనూలో ఉండే ఆ 4 ఐటమ్స్ ఏంటంటే?

మెనూ కుదింపుతో ఒక పూట భోజనం మొత్తం బరువు గతంలో ఉన్న 700–750 గ్రాముల నుంచి ఇప్పుడు 450–500 గ్రాములకు తగ్గిపోయింది. అయితే, వడ్డించే ప్రతి వంటకం పరిమాణంలో మాత్రం ఎలాంటి కోత ఉండదని అధికారులు చెబుతున్నారు. పాత జాబితాలోని చాలా ఐటమ్స్‌ను తీసేసి, కొత్త మెనూను ఇలా మార్చారు. ఉదయం టిఫిన్.. ఇడ్లీ-వడ, పోహా లేదా ఉప్మా (చట్నీ, సాంబార్‌తో కలిపి) మూడింటిలో ఏదో ఒకటి మాత్రమే ఇస్తారు. గతంలో ఇచ్చే సూప్, ఆమ్లెట్, శాండ్‌విచ్, మజ్జిగ, చాక్లెట్లను పూర్తిగా కట్ చేశారు. ఇకపోతే మధ్యాహ్నం & రాత్రి భోజనంలో చపాతీ, అన్నం, పప్పుతో పాటు ఒక మెయిన్ కర్రీ (వెజ్ లేదా చికెన్) కలిపి మొత్తం 4 ఐటమ్స్ మాత్రమే పెడతారు. ఇన్నాళ్లూ మెనూలో ఉన్న పొడి కూరలు, పెరుగు, సలాడ్లు, ఊరగాయ, స్వీట్లకు గుడ్‌బై చెప్పేశారు.

రకాలు తగ్గించడానికి అసలు కారణమిదే

వందే భారత్ రైళ్లలో ఆహారం నాణ్యత సరిగ్గా ఉండట్లేదని గత కొంతకాలంగా ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భోజనం చల్లారిపోవడం, పాడైపోయిన పదార్థాలు రావడం, కొన్ని సందర్భాల్లో ఫుడ్‌లో పురుగులు కనిపించడం లాంటి ఘటనలు కలకలం రేపాయి. రైలులోని ఇరుకైన వంటగదిలో, తక్కువ సిబ్బందితో పది రకాల వంటకాలను వేడిగా, శుభ్రంగా తయారు చేయడం సాధ్యం కావడం లేదని రైల్వే వర్గాలు గుర్తించాయి. అందుకే రకాల సంఖ్యను నాలుగుకు పరిమితం చేసి, వాటినైనా తాజాగా, పరిశుభ్రంగా అందించాలని భావిస్తున్నాయి. అంతేకాకుండా, పాత క్యాటరింగ్ పద్ధతికి బదులుగా ‘క్లౌడ్ కిచెన్’ల ద్వారా భోజనాన్ని తయారు చేయించి ప్రయాణికులకు అందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూడు రూట్లలోనే!

నవంబర్ 2026 నుంచి ఈ కొత్త ఫుడ్ మెనూను పైలట్ ప్రాజెక్ట్ కింద మూడు వందే భారత్ స్లీపర్ రైళ్లలో పరీక్షిస్తున్నారు. అవి

1. ముంబై – బెంగళూరు
2. హౌరా – కామాఖ్య
3. న్యూఢిల్లీ – వారణాసి జంక్షన్

ఈ మూడు మార్గాల్లో ప్రయాణించే వారి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే, దేశవ్యాప్తంగా ఉన్న మిగతా సుదూర రైళ్లలోనూ ఈ నాలుగు ఐటమ్స్ మెనూను అమలు చేయడంపై ఐఆర్‌సిటిసి తుది నిర్ణయం తీసుకోనుంది.