UPI LITE Payments: క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి పేమెంట్ చేసేటప్పుడు ఇబ్బందులు పడుతున్నారా?.. మన ఫోన్‌లో డబ్బులు కట్ అవుతున్నాయి కానీ అవతలి వ్యక్తికి చేరట్లేదా?.. ఇలాంటి సమస్యలకు ఇక కాలం చెల్లింది. వీటికి పరిష్కారంగా UPI LITE సర్వీస్ వచ్చేసింది. యూపీఐ లైట్‌తో చెల్లింపులు చేయటానికి పిన్ నంబర్ కూడా అవసరంలేదు. కాబట్టి.. పేమెంట్.. ఫాస్ట్‌గా.. ఈజీగా.. పూర్తవుతుంది.
ఈ లావాదేవీల్లో సక్సెస్ రేట్ కూడా ఎక్కువే కావటం చెప్పుకోదగ్గ విషయం. అయితే.. ఈ విధానంలో ఒక్కసారి 200 రూపాయలు లేదా అంతకన్నా తక్కువ అమౌంట్ మాత్రమే చెల్లించటానికి వస్తుంది. యూపీఐ లైట్ సర్వీసు ప్రస్తుతానికి భీమ్ యాప్‌తోపాటు పేటీఎం యాప్‌లో అందుబాటులో ఉంది. పేటీఎం యాప్‌లో యూపీఐ లైట్‌ని రెండు విధాలుగా యాక్టివేషన్ చేసుకోవచ్చు.
World Economy in 2023: లేటెస్ట్ వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్ రిపోర్టులోని వివరాలు
పేటీఎం యాప్‌ని ఓపెన్ చేసి కొంచెం కిందికి వెళితే యూపీఐ లైట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. అలా కాకుండా.. పేటీఎం యాప్ పైభాగంలో ఎడమ వైపున ఉండే ప్రొఫైల్ బటన్ మీద నొక్కితే ‘‘యూపీఐ అండ్ పేమెంట్స్ సెట్టింగ్స్’’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ‘‘యూపీఐ అండ్ పేమెంట్స్ సెట్టింగ్స్’’ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాక ‘‘అదర్ సెట్టింగ్స్’’ అనే ఆప్షన్ కింద ‘‘యూపీఐ లైట్’’ కనిపిస్తుంది.
ఆ యూపీఐ లైట్ పైన ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది రెండో పద్ధతి. ఈ రెండు పద్ధతుల్లో కూడా మొదట మన బ్యాంక్ అకౌంట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత యూపీఐ లైట్‌లో యాడ్ చేయాల్సిన అమౌంట్‌ను ఎంటర్ చేయాలి. అనంతరం.. యాడ్ మనీ అనే ఆప్షన్ పైన నొక్కితే ఎం-పిన్ నంబర్ అడుగుతుంది. నంబర్ ఎంటర్ చేస్తే యూపీఐ లైట్ యాక్టివేట్ అవుతుంది.
ఒకసారి యూపీఐ లైట్ యాక్టివేట్ అయ్యాక.. పిన్ నంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరంలేకుండానే సింగిల్ క్లిక్‌తో పేమెంట్ పూర్తిచేయొచ్చు. అయితే.. దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒక్కసారి 2 వందల రూపాయల కంటే ఎక్కువ చెల్లించటానికి వీలుపడదు. అంతేకాదు. బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్టుగా పేమెంట్ చేయటానికి కూడా అవకాశం లేదు. ముందుగా బ్యాంక్ అకౌంట్ నుంచి యూపీఐ లైట్ వ్యాలెట్‌లోకి అమౌంట్ యాడ్ చేసుకోవాలి.
అక్కడి నుంచి మాత్రమే చెల్లింపు చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ నుంచి యూపీఐ లైట్‌లో ఒకేసారి 2 వేల రూపాయల వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇలా.. ఒక రోజులో రెండు సార్లు మాత్రమే యాడ్ చేసుకోవటానికి అనుమతిస్తారు. అంటే.. ఒక రోజులో మొత్తం 4 వేల రూపాయలను మాత్రమే బ్యాంక్ అకౌంట్ నుంచి యూపీఐ లైట్‌లోకి యాడ్ చేసుకోవచ్చు.
2 వందల రూపాయలు లేదా అంతకన్నా తక్కువ అమౌంట్‌ని ఎన్నిసార్లయినా పేమెంట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ లిమిట్ రోజుకి 4 వేల రూపాయలు దాటకూడదు. గరిష్ట చెల్లింపుల సంఖ్యకు సంబంధించిన పరిమితి ఏమీ లేదు. మొత్తం యూపీఐ పేమెంట్లలో దాదాపు సగం పేమెంట్లు 2 వందల రూపాయలు లేదా అంతకన్నా తక్కువ అమౌంట్లకు సంబంధించినవే ఉంటున్నాయి.
అందుకే.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ఎన్‌పీసీఐ.. యూపీఐ లైట్‌కి రూపకల్పన చేసింది. దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022 సెప్టెంబర్‌లో లాంఛ్ చేసింది. ఆ నెలాఖరున భీమ్ యాప్‌లో ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. బ్యాంక్ అకౌంట్ నుంచి కాకుండా వ్యాలెట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి కాబట్టి పేమెంట్లు సూపర్‌ఫాస్ట్ వేగంతో పూర్తవుతున్నాయి. బ్యాంకుల సర్వర్‌లు మొరాయించటం వంటి సమస్యలు తలెత్తట్లేదు.
ఫలితంగా.. యూపీఐ లైట్ చెల్లింపు విధానం ఎంతో మంది వినియోగదారులకు ఉపయోగకరంగా ఉందనే ఫీడ్‌బ్యాక్ వస్తోంది. అయితే.. యూపీఐ లైట్ వ్యాలెట్ పేమెంట్ మోడ్‌లో ప్రస్తుతానికి డెబిట్ ట్రాన్సాక్షన్లు మాత్రమే జరుగుతున్నాయి. యూపీఐ లైట్ వ్యాలెట్‌లోకి క్రెడిట్ అయిన డబ్బులు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతాయి. యూపీఐ చెల్లింపుల విధానం సూపర్ డూపర్ హిట్ కావటంతో దానికి రిలేటెడ్‌గా యూపీఐ లైట్ లాంటి అప్‌డేట్లు వస్తున్నాయి.