NTV Telugu Site icon

బడ్జెట్‌ 2021.. ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే..!

2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు  ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం కీలక సంస్కరణలు చేపడుతున్నట్లు వెల్లడించారు ఆర్థిక మంత్రి… అన్ని రంగాలకూ సమన్యాయం చేసేలా  కేంద్ర బడ్జెట్‌ను రూపొందించినట్లు చెప్పారు. బడ్జెట్‌లో కేటాయింపులకు అనుగుణంగా వస్తువుల ధరల్లో తగ్గుదల, పెరుగుదల కనిపిస్తుంది. తాజా బడ్జెట్‌ నేపథ్యంలో ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయో, ఏయే ధరలు తగ్గుతాయో ఓ సారి పరిశీలిద్దాం..

ధరలు పెరిగేవి:
ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగిపోనున్నయి.. ఫ్రిజ్‌లు, ఏసీల ధరలు పెరిగే అవకాశముంది. ఎల్‌ఈడీ బల్బులు, సర్క్యూట్‌ బోర్డులు, వాటి విడి భాగాలు, సోలార్‌ ఇన్వెర్టర్స్‌, సోలార్ దీపాల ధరలకు రెక్కలు రావడం ఖాయం.. మొబైల్ ఫోన్స్, ఛార్జర్లు, లిథియంతో తయారు చేసిన ఫోన్‌ బ్యాటరీ ధరలు మరింత పెరిగే అవకాశముంది. విలువైన రత్నాలు ధరలు కూడా పెరుగుతాయి. ఆటో మొబైల్‌ విడి విభాగాల ధరలు పెరగవచ్చు. విండ్‌  స్క్రీన్స్‌, సిగ్నలింగ్‌ పరికరాల ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంక్‌ క్యాట్రిడ్జ్‌లు, ఇంక్‌ స్ప్రే నాజిల్స్, లెథర్‌ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ముడి సిల్క్‌, నూలు వస్త్రాల ధరలు పెరుగుతాయి. ప్లాస్టిక్‌ వస్తువులు, సింథటిక్‌ వస్తుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉండగా. ఇప్పటిక ముచ్చెమటలు పట్టిస్తున్న వంటనూనె ధరలు మరింత ప్రియం కానున్నాయి.

ధరలు తగ్గేవి:

బడ్జెట్ లో దిగుమతి సుంకాలు తగ్గించనున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ధరల్లో కాస్త తగ్గుదల కనిపించనుంది. ప్లాటినం, పల్లాడియం ధరలు తగ్గే అవకాశముంది. అంతర్జాతీయ సంస్థల నుంచి దిగుమతి చేసుకున్న వైద్య పరికరాలు, యంత్రాల ధరలు తగ్గుతాయి. ఇనుము, ఉక్కు, రాగి ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. నైలాన్‌ దుస్తుల ధరలు తగ్గిపోనున్నాయి.