Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారత దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం భారతదేశ రత్నాల, ఆభరణాల రంగంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపనుందని సదరు రంగానికి చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ విదేశీ మారకద్రవ్య ఆదాయానికి ప్రధానంగా దోహదపడే ఈ రంగం ఇప్పటికే వివిధ ఆర్థిక ఒత్తిళ్లతో కొట్టుమిట్టాడుతోంది. మళ్లీ ఇప్పుడు ట్రంప్ విధించిన టారిఫ్ దెబ్బకు ఈ రంగం మరికొన్ని సవాళ్ళను ఎదురుకొనేలా కనపడుతోంది.
ట్రంప్ భారత్ పై విధించిన 25% టారిఫ్ విషయమై ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యూవెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఛైర్మన్ రాజేష్ రోక్డే మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ఇది చాలా విచారకరం. ఈ కొత్త టారిఫ్ ఆగస్ట్ 1 నుండి అమలులోకి వస్తుంది. ఇదివరకు 10 శాతం టారిఫ్ ఉన్నప్పుడు సుమారు 50,000 మందికి పైగా ఉద్యోగాలు పోయాయి. ఇప్పుడు 25 శాతం టారిఫ్ వల్ల లక్ష మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. ఈ విషయంలో ముఖ్యంగా హస్తకళాకారులు తయారుచేసే హస్త నిర్మిత ఆభరణాలపై ఈ ప్రభావం మరింత తీవ్రమవుతుందని ఆయన అన్నారు. ఇలాంటి ఉత్పత్తులకు అమెరికాలో అమ్మకాలు నిలిచిపోవచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు.
Rahul Gandhi: భారత ఆర్థిక వ్యవస్థపై విషంకక్కిన ట్రంప్.. ట్రంప్ వ్యాఖ్యలను సమర్థించిన రాహుల్ గాంధీ..!
రోక్డే అభిప్రాయం ప్రకారం ఈ టారిఫ్ భారత్‌కు మాత్రమే కాకుండా.. అమెరికాకూ నష్టదాయకమే అని అన్నారు. భారత ఆభరణాల ఎగుమతులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్, మిడిలీస్ట్ వంటి ప్రత్యామ్నాయ మార్కెట్లు లేకపోలేదని ఆయన తెలిపారు. మరోవైపు వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం అమెరికాకు 9.9 బిలియన్ల డాలర్ల విలువైన ఆభరణాలు ఎగుమతి చేసింది. ఈ లెక్కన చూస్తే అమెరికా భారత్ నుండి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటుంది.
ఈ కొత్త విధానంతో పరిశ్రమలో తీవ్ర ఆందోళన నెలకొనగా.. ఇప్పుడు అందరి దృష్టి ఆగష్టు నెలాఖరులో జరగబోయే ఆరో విడత ఇండియా-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య చర్చలపై పడింది. ఆ సమావేశానికి అమెరికా ప్రతినిధులు భారత్‌కు రానున్న నేపథ్యంలో.. ఆభరణాల పరిశ్రమ వర్గాలు ఏదైనా ఉపశమనం కలుగుతుందేమోనని ఆశతో ఎదురుచూస్తున్నాయి. మొత్తానికి, అమెరికా 25 శాతం దిగుమతి టారిఫ్ వల్ల భారత్ జెమ్ అండ్ జ్యూవెలరీ రంగం నూతన సంక్షోభాన్ని ఎదుర్కొనబోతోంది. నెగటివ్ ప్రభావాన్ని తగ్గించాలంటే రాజకీయ పరిష్కారం, ద్వైపాక్షిక చర్చలే మార్గం అవుతాయని పరిశ్రమ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
