NTV Telugu Site icon

09-07-22 Business Updates: నేటి బిజినెస్‌ వార్తల్లోని ముఖ్యాంశాలు

Business Updates

Business Updates

టాటా వాహనాలు మరింత ప్రియం

టాటా వాహనాలు మరింత ప్రియమయ్యాయి. ప్రయాణికుల వాహనాల రేట్లను టాటా మోటర్స్‌ పెంచింది. దీంతో ఈ శ్రేణిలోని వాహనాలను ఇకపై సగటున 0.55 శాతం అధిక ధరలకు కొనాల్సి ఉంటుంది. తాజా నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని టాటా మోటర్స్‌ స్పష్టం చేసింది. తయారీ ఖర్చులను కాస్త తగ్గించుకునేందుకే రేట్లు పెంచామని వివరణ ఇచ్చింది. రోజురోజుకీ పెరుగుతున్న ఇన్‌పుట్‌ వ్యయం భారంగా మారుతోందని వెల్లడించింది.

స్టాఫ్‌ భారాన్ని తగ్గించుకుంటున్న ఓలా

ఇండియన్‌ మల్టీ నేషనల్‌ రైడ్‌ షేరింగ్‌ కంపెనీ అయిన ఓలా.. ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. ఇప్పటికే ఏప్రిల్‌ నెలలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పుడు స్టాఫ్‌ అప్రైజల్స్‌ పైనా నిర్ణయాన్ని వాయిదా వేసింది. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రమోషన్లు, ఇక్రిమెంట్లు, బోనస్‌లు తదితర నిర్ణయాలు ఉండబోవని పరోక్షంగా తెలిపింది. అత్యధిక వాటాలను కొనుగోలు చేసి సాఫ్ట్‌ బ్యాంక్‌ ఆర్థికంగా సపోర్ట్‌గా నిలుస్తున్నా ఓలా ఇలా ముందుజాగ్రత్త చర్యలు పాటిస్తుండటం గమనార్హం.

టెలికం రంగంలోకి అదానీ

దేశ వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో తనదైన ముద్ర వేసిన గౌతమ్‌ అదానీ గ్రూపు ఇకపై టెలికం రంగంలోకి కూడా అడుగుపెట్టనుంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ బ్యాండ్‌ (5జీ స్పెక్ట్రం) వేలం ప్రక్రియలో పాల్గొనటంపై ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఈ సెక్టార్‌లో ఇప్పటికే రిలయెన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా ఆధిపత్యం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూడు సంస్థలతో అదానీ గ్రూప్‌ పోటీకి దిగనుండటం ఆసక్తికరంగా మారింది.

‘అవెన్యూ’ లాభం 680 కోట్లు

అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ సంస్థ అద్భుత ఫలితాలను నమోదుచేసింది. మూడు నెలల (ఏప్రిల్‌, మే, జూన్‌) నివేదికను ఇవాళ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంతో పోల్చితే ఈసారి 6 రెట్లు ఎక్కువ నికర లాభం వచ్చినట్లు తెలిపింది. ఆ విలువ రూ.680 కోట్లని పేర్కొంది. ఒక్క ఏడాదిలోనే 490.30 శాతం ప్రాఫిట్ పెరిగినట్లు ప్రకటించింది. ఇవి స్వతంత్రంగా ఆర్జించిన లాభాలేనని స్పష్టం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసిక లాభం రూ.115 కోట్లు మాత్రమే కావటం గమనార్హం.