Forbes Billionaires List: ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ఇది ఒక సంస్థ వాణిజ్య ప్రకటనే కావొచ్చు.. కానీ, నిజంగా ఒక్క ఐడియా ఎన్నో జీవితాలను మారుస్తుంది.. ఇక, ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రతి రోజు కొత్త విజయగాథలు వెలుగులోకి వస్తుంటాయి. అయితే కొందరి ప్రయాణం మాత్రం సాధారణ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి విజయానికి ఎలా చేరుకోవచ్చో నిరూపిస్తుంది. అలాంటి వారిలో టిక్‌టాక్, బైట్‌డాన్స్ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ ఒకరు. తాజాగా ఆయన ఆసియాలోని అత్యంత ధనవంతుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీని అధిగమించి రెండో స్థానానికి చేరుకున్నారు. తాజా ఫోర్బ్స్ ర్యాంకింగ్స్ ప్రకారం జాంగ్ యిమింగ్ నికర ఆస్తి 92.8 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ముఖేష్ అంబానీ సంపద 86.9 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 117.4 బిలియన్ డాలర్ల ఆస్తులతో గౌతమ్ అదానీ ఆసియాలో అత్యంత ధనవంతుడిగా మొదటి స్థానంలో కొనసాగుతున్నారు.
జాంగ్ యిమింగ్ విజయం కేవలం సంపదకు సంబంధించిన కథ మాత్రమే కాదు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఓ యువకుడు ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన టెక్ కంపెనీలలో ఒకదాన్ని ఎలా నిర్మించాడనే స్ఫూర్తిదాయక గాథ కూడా. చైనాలో జన్మించిన జాంగ్ యిమింగ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ చదివి, ఒక సాధారణ టెక్ ఉద్యోగిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. తన వృత్తి జీవిత ప్రారంభ దశలో ఆయన పలు చిన్న కంపెనీల్లో పనిచేశారు. ఇంటర్నెట్ కేవలం సమాచార వేదిక మాత్రమే కాదని, వినియోగదారుల అభిరుచులను అర్థం చేసుకుని వారికి అనుకూలమైన కంటెంట్‌ను అందించే శక్తివంతమైన సాధనమని ఆయన ముందుగానే గుర్తించారు. ఈ ఆలోచనే తర్వాత ఆయన విజయానికి బాటలు వేసింది.
2012లో జాంగ్ యిమింగ్ బైట్‌డాన్స్ సంస్థను స్థాపించారు. కంపెనీ తొలి ప్రధాన ఉత్పత్తి ‘టౌటియావో’ అనే న్యూస్ యాప్. ఇది సాధారణ న్యూస్ యాప్‌లా కాకుండా, ప్రతి వినియోగదారుడి ఆసక్తులకు అనుగుణంగా వార్తలను చూపించే అల్గారిథమ్ ఆధారిత వ్యవస్థను కలిగి ఉండేది. ఆ సమయంలో ఇది టెక్నాలజీ ప్రపంచంలో విప్లవాత్మక ఆలోచనగా నిలిచింది. టౌటియావో విజయం తర్వాత జాంగ్ యిమింగ్ వీడియో కంటెంట్‌పై దృష్టి సారించారు. దాంతో టిక్‌టాక్ జన్మించింది. షార్ట్ వీడియోల కాన్సెప్ట్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందేలా చేసిన టిక్‌టాక్, సోషల్ మీడియా వినియోగాన్ని పూర్తిగా మార్చేసింది. వినియోగదారులు ఏమి చూడాలనుకుంటున్నారో వేగంగా గుర్తించి వారికి తగిన వీడియోలను చూపించే అల్గారిథమ్ టిక్‌టాక్ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది.
కొద్ది సంవత్సరాల్లోనే టిక్‌టాక్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన యాప్‌గా మారింది. భారతదేశం సహా కొన్ని దేశాల్లో నిషేధాలు ఎదుర్కొన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం కొనసాగుతోంది. టిక్‌టాక్ విజయంతో బైట్‌డాన్స్ ప్రపంచంలోని అత్యంత విలువైన ప్రైవేట్ టెక్ కంపెనీలలో ఒకటిగా ఎదిగింది. టిక్‌టాక్ ప్రభావం ఎంతగా ఉందంటే, మెటా వంటి దిగ్గజ కంపెనీలు కూడా దాని ఫీచర్లను అనుసరించాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఫేస్‌బుక్ షార్ట్ వీడియోలు వంటి సేవలు టిక్‌టాక్ స్ఫూర్తితోనే రూపొందించబడ్డాయని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.
అపారమైన సంపద, ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చినప్పటికీ జాంగ్ యిమింగ్ ప్రచారానికి దూరంగానే ఉంటారు. 2021లో బైట్‌డాన్స్ సీఈవో పదవి నుంచి తప్పుకుని, దీర్ఘకాలిక వ్యూహాలపై దృష్టి సారించారు. వినియోగదారుల అభిరుచులను అర్థం చేసుకునే డేటా, అల్గారిథమ్‌లపై ఆయన ఉంచిన నమ్మకమే ఈ అద్భుత విజయానికి మూల కారణమని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
