NTV Telugu Site icon

Jet Airways: ముగిసిన జెట్ ఎయిర్‌వేస్ ప్రస్థానం.. ఆస్తుల విక్రయానికి సుప్రీంకోర్టు ఆదేశాలు

Jetairways

Jetairways

ఆర్థిక కష్టాలతో కుదేలైన దేశీయ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్ ప్రస్థానం సమాప్తమైంది. విమానయాన సంస్థకు చెందిన ఆస్తులను విక్రయించడానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. దివాలా పరిష్కార ప్రయత్నాలు విఫలమవ్వడంతో.. రుణదాతలు, ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీజేఐ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక కష్టాలతో జెట్‌ ఎయిర్‌వేస్‌ 2019లోనే కార్యకలాపాలు నిలిపివేసింది. దీంతో ఈ వ్యవహారం నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు వెళ్లగా.. అక్కడ దివాలా ప్రక్రియ మొదలైంది. ఇందులో జలాన్- కర్లాక్‌ కన్సార్షియం బిడ్డింగ్‌లో జెట్‌ ఎయిర్‌వేస్‌ను దక్కించుకుంది. తర్వాత కన్సార్షియానికి, రుణదాతలకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేతృత్వంలోని రుణదాతలు ఎన్‌సీఎల్‌ఏటీకి వెళ్లారు. యాజమాన్య హక్కుల బదిలీ విషయంలో ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన ఆదేశాలను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ కూడా సమర్థించింది.

ఇది కూడా చదవండి: KTR: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినందుకు నా మీద కేసులు పెడతారా..

అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఎస్‌బీఐ, ఇతర రుణదాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సీజేఐ, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలను పక్కనపెట్టింది. దివాలా ప్రక్రియలో విమానయాన సంస్థను చేజిక్కించుకున్న జలాన్‌ కర్లాక్‌ కన్షార్షియం.. ఉద్యోగుల జీత భత్యాలు, నిధులు వెచ్చించడంలో విఫలమైనందున రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 ద్వారా సంక్రమించిన అధికారాలను వినియోగించి లిక్విడేషన్‌కు ఆదేశాలు ఇచ్చింది. రుణదాతలు, ఉద్యోగులు, ఇతర భాగస్వామ్య పక్షాల ప్రయోజనార్థం ఈ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆస్తులను నగదుగా మార్చనున్నారు. వాస్తవాలను పూర్తిగా పరిశీలించకుండా జలాన్‌ కర్లాక్‌ కన్షార్షియానికి అనుకూలంగా తీర్పు వెలువరించినందుకు నేషనల్ లా ట్రిబ్యునల్‌ను కూడా కోర్టు మందలించింది.

ఇది కూడా చదవండి: Supreme Court: ప్రభుత్వ ఉద్యోగాల నియామక నిబంధనలు మధ్యలో మార్చొద్దు..

Show comments