Digital Arrest Scam: డిజిటల్ మోసాల్లో డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

Supreme Court On Digital Fr

Supreme Court On Digital Fr

Supreme Court on Digital Fraud: దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో సైబర్ నేరగాళ్లు వృద్ధులు, సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని లక్షలాది, కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ మోసాల బాధితులకు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బ్యాంకుల పర్యవేక్షణలో లోపం కారణంగా కస్టమర్లు డబ్బు కోల్పోయినట్లు నిర్ధారణ అయితే, ఆ నష్టానికి బ్యాంకులే పరిహారం చెల్లించేలా నిబంధనలు రూపొందించాలని ఆదేశించింది.

కస్టమర్ల డబ్బును కాపాడాల్సిన బాధ్యత బ్యాంకులదే

‘నకిలీ పత్రాలకు సంబంధించిన డిజిటల్ అరెస్ట్ మోసాల బాధితులు’ అనే అంశంపై సుప్రీంకోర్టు స్వయంగా విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఖాతాదారుల డబ్బును సురక్షితంగా ఉంచడం బ్యాంకుల బాధ్యత అని స్పష్టం చేసింది. బ్యాంకుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం లేదా లోపం కారణంగా డిజిటల్ అరెస్ట్ లేదా ఆన్‌లైన్ మోసం జరిగి, కస్టమర్ డబ్బు కోల్పోయినట్లు తేలితే, నష్టపోయిన మొత్తానికి సమానమైన పరిహారాన్ని బ్యాంకులే చెల్లించేలా నిబంధనలు ఉండాలని పేర్కొంది. ఈ అంశాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూపొందించే కొత్త మార్గదర్శకాల్లో తప్పనిసరిగా చేర్చాలని సూచించింది.

అనుమానాస్పద లావాదేవీలను వెంటనే గుర్తించాలి

ఖాతాదారుల సాధారణ లావాదేవీల విధానానికి భిన్నంగా అకస్మాత్తుగా భారీ మొత్తంలో నగదు బదిలీ జరిగితే బ్యాంకులు వెంటనే అప్రమత్తం కావాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి సాధారణంగా రూ.10 వేలు లేదా రూ.20 వేల చొప్పున లావాదేవీలు చేస్తుంటే, ఒక్కసారిగా అతని ఖాతా నుంచి రూ.50 వేలు బదిలీ అయితే దానిని అనుమానాస్పద లావాదేవీగా ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించింది. ఇలాంటి లావాదేవీలను గుర్తించిన వెంటనే తాత్కాలికంగా నిలిపివేయడం, సంబంధిత అధికారులకు ఆటోమేటిక్‌గా సమాచారం పంపడం, లావాదేవీ నిజమైనదేనా కాదా అని నేరుగా ధ్రువీకరించడం వంటి చర్యలను తప్పనిసరి చేయాలని సూచించింది.

ఏఐ సాంకేతికతతో మోసాలకు అడ్డుకట్ట

బ్యాంకు ఖాతాలను వాటి లావాదేవీల స్వభావం ఆధారంగా వర్గీకరించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా దీర్ఘకాలంగా పొదుపు చేస్తున్న వ్యక్తుల ఖాతాలకు సంబంధించిన పూర్తి వివరాలు బ్యాంకుల వద్ద ఉంటాయని పేర్కొంది. ఈ సమాచారాన్ని ఉపయోగించి కృత్రిమ మేధ (AI) సాంకేతికత సాయంతో అనుమానాస్పద లావాదేవీలను గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చని సూచించింది.

ఒక ఖాతా నుంచి అకస్మాత్తుగా అనుమానాస్పద రీతిలో భారీ మొత్తం బదిలీ అయినప్పుడు, సమీప పోలీస్ స్టేషన్‌కు ఆటోమేటిక్‌గా సమాచారం చేరే విధానాన్ని రూపొందించాలని పేర్కొంది. దీంతో బాధితుడు తన ఇష్టప్రకారమే డబ్బు పంపుతున్నాడా? లేక డిజిటల్ అరెస్ట్ మోసగాళ్ల బెదిరింపులకు భయపడి లావాదేవీ చేస్తున్నాడా? అనే విషయాన్ని పోలీసులు వెంటనే పరిశీలించే అవకాశం ఉంటుందని వివరించింది.

బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకోవాలి

డిజిటల్ మోసాల కారణంగా ప్రజలు కోట్లాది రూపాయలు నష్టపోతున్నప్పటికీ, వాటిని ముందుగానే అడ్డుకునే బలమైన చర్యలు ఇంకా అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. బ్యాంకులపై జరిమానాలు విధించేలా కఠినమైన చర్యలు ఉండాలని పేర్కొంది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే బ్యాంకులపై చర్యలు తీసుకోకపోతే, అవి తమ తప్పులను సరిదిద్దుకునేందుకు ముందుకు రావని వ్యాఖ్యానించింది.

మోసం జరిగిన తర్వాత నివేదికలు తయారు చేయడం కంటే, అసలు మోసం జరగకముందే అడ్డుకోవడం ముఖ్యమని స్పష్టం చేసింది. బాధితులను రక్షించాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ రూపొందించే నిబంధనల్లో బాధ్యత, జవాబుదారీతనానికి సంబంధించిన ప్రత్యేక నిబంధన ఉండాలని ధర్మాసనం ఆదేశించింది. లేనిపక్షంలో కోర్టు ఉత్తర్వుల ద్వారా వాటిని అమలు చేయాల్సి వస్తుందని హెచ్చరించింది.