ఐపీఎల్ చరిత్రలో ఆదివారం ఒక కీలకమైన ఒప్పందం జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్, ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్, అదర్ పూనావాలాతో కలిసి 1.65 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15,600 కోట్లు) బిడ్ వేసి రాజస్థాన్ రాయల్స్‌లో మెజారిటీ వాటాను దక్కించుకున్నారు. ఈ జట్టులో మిట్టల్ కుటుంబానికి మెజారిటీ వాటా, అంటే 75 శాతం లభిస్తుంది. ఇది లక్ష్మీ మిట్టల్‌కు కొత్త ప్రయాణం కాదు. రాజస్థాన్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి ఎదిగి ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన, నేడు భారత్ కు చెందిన అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఫోర్బ్స్ ప్రకారం ఆయన నికర ఆస్తి సుమారు 28.4 బిలియన్ డాలర్లు (రూ. 2.37 లక్షల కోట్లు) గా ఉంది.
నిరుపేద బాల్యం నుంచి ఉక్కు సామ్రాజ్యం వరకు
లక్ష్మీ నివాస్ మిట్టల్ 1950 జూన్ 15న రాజస్థాన్‌లోని సదుల్‌పూర్‌లో ఒక మార్వాడీ కుటుంబంలో జన్మించారు. ఆయన బాల్యం చాలా సాధారణంగా గడిచింది. ఆయన గ్రాండ్ ఫాదర్ 20 మంది కుటుంబ సభ్యులతో ఒక చిన్న ఇంట్లో నివసించేవారు. కాంక్రీట్ నేలపై నిద్ర, మట్టి పొయ్యి మీద వంట.. ఇది వారి రోజువారీ జీవితం. 1976లో 26 ఏళ్ల వయసులో మిట్టల్ ఇండోనేషియా వెళ్లి తన మొదటి ఉక్కు కర్మాగారం పిటి ఇస్పాత్ ఇండోను స్థాపించారు. నష్టాల్లో ఉన్న ఉక్కు కంపెనీలను కొనుగోలు చేసి లాభాల్లోకి తెచ్చే వ్యూహం ఆయన్ను ప్రపంచ స్థాయికి చేర్చింది. 2006లో మిట్టల్ స్టీల్, ఆర్సెలర్ విలీనం ద్వారా ఆర్సెలార్ మిట్టల్ ఏర్పడింది. ఇప్పుడు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థ. బుర్జ్ ఖలీఫా (ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం) నిర్మాణంలో కూడా మిట్టల్ గ్రూప్ ఉక్కు ఉపయోగించారు.
విలాసవంతమైన జీవనశైలి
2004లో తన కుమార్తె వనిషా మిట్టల్ వివాహం పారిస్‌లో జరిగింది. ఈ వివాహానికి సుమారు 60 మిలియన్ డాలర్లు (రూ. 500 కోట్లు) ఖర్చు చేశారు. ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటి. లండన్‌లోని కెన్సింగ్‌టన్ ప్యాలెస్ గార్డెన్స్ లో ఆయన నివాసం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. ఇటీవల పన్ను విధానాల కారణంగా లండన్ నుంచి స్విట్జర్లాండ్ కు తరలివెళ్లారు.
క్రీడలు, సామాజిక సేవకు సహకారం
ఒలింపిక్స్‌లో భారత్ పేలవ ప్రదర్శన పట్ల ఆందోళన చెందిన మిట్టల్, ‘మిట్టల్ ఛాంపియన్స్ ట్రస్ట్’ను ప్రారంభించారు.
క్రీడలలో దేశం రాణించడానికి సహాయపడటానికి, 9 మిలియన్ డాలర్ల ప్రారంభ విరాళంతో భారతీయ క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందించడం ప్రారంభించారు.
మిట్టల్ దాతృత్వ రంగంలో కూడా గణనీయమైన కృషి చేశారు.
లండన్‌లోని గ్రేట్ ఓర్మాండ్ స్ట్రీట్ హాస్పిటల్‌కు 15 మిలియన్ పౌండ్లను విరాళంగా ఇచ్చారు, ఆ సమయంలో ఆసుపత్రికి అందిన అతిపెద్ద ప్రైవేట్ విరాళంగా అది పరిగణించబడింది.
స్విట్జర్లాండ్ కొత్త గమ్యస్థానం
లక్ష్మీ మిట్టల్ , 61.3 బిలియన్ డాలర్ల ఆదాయం కలిగిన ఉక్కు కంపెనీ అయిన ఆర్సెలార్ మిట్టల్ కు ఛైర్మన్ గా ఉన్నారు . ఉత్పత్తి పరంగా ఈ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు, మైనింగ్ కంపెనీ. 2024లో 1.3 బిలియన్ డాలర్లుగా ఉన్న కంపెనీ నికర లాభం, 2025 నాటికి 3.15 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఆయన చాలా కాలం లండన్‌లో నివసించారు. లండన్ కొత్త పన్నుల విధానంతో నిరాశ చెందిన ఆయన, ఇటీవల స్విట్జర్లాండ్‌కు తరలివెళ్లారు.
ఫోర్బ్స్ జాబితాలో
2005లో, ఫోర్బ్స్ ప్రపంచ టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారత పౌరుడిగా మిట్టల్ నిలిచారు. ఒకానొక సమయంలో, ఆయన ప్రపంచంలో మూడవ అత్యంత ధనవంతుడి స్థానానికి చేరుకున్నారు. నేడు, ఫోర్బ్స్ అత్యంత ధనవంతుల జాబితాలో లక్ష్మీ మిట్టల్ 83వ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ ప్రకారం, ఆయన నికర ఆస్తి విలువ 28.4 బిలియన్ డాలర్లు. ఆయనను ‘కింగ్ ఆఫ్ స్టీల్’ అని కూడా పిలుస్తారు.
