NTV Telugu Site icon

Stock market: స్టాక్ మార్కెట్లకు కొత్త ఊపు.. నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డ్

Business

Business

స్టాక్ మార్కెట్లు కొత్త రూపు సంతరించుకున్నాయి. మునుపెన్నడూ లేనంతగా గురువారం సూచీలు లాభాల్లో దూసుకుపోవడం ఆర్థిక నిపుణులకు ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల కంటే ముందే ఈ స్థాయిలో లాభాల్లో దూసుకుపోవడం సరికొత్త ఒరవడిని సృష్టించింది.

ఉదయం నుంచి స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ ప్రారంభం నుంచి ఊహించని రీతిలో లాభాల్లో దూసుకెళ్లాయి. ఇక నిఫ్టీ అయితే ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. 369 పాయింట్లు లాభపడి.. 22, 967 దగ్గర ముగిసింది. ఇక 23 వేల మార్కుకి అతి చేరువలోనే ఉంది. ఈ స్థాయిలో నిఫ్టీ ట్రేడవడం ఇదే తొలిసారి. ఇక సెన్సెక్స్ కూడా భారీ లాభాల్లో దూసుకుపోయింది. 1196 పాయింట్లు లాభపడి 75, 418 దగ్గర సెన్సెక్స్ ముగిసింది.

జూన్ 4 తర్వాత స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకుపోవచ్చని నిపుణులు భావించారు. కానీ అంతకంటే ముందుగానే ఈ స్థాయిలో సూచీలు లాభపడడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనికి తాజాగా ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాలే కారణమని అంతా భావిస్తున్నారు.

నిఫ్టీలో ఆటో, ఐటీ, బ్యాంకులు లాభాల్లో దూసుకుపోయాయి. మెటల్ మరియు ఫార్మా మినహా ఇతర అన్ని రంగాల సూచీలు ఆటో, బ్యాంక్ మరియు క్యాపిటల్ గూడ్స్ 2 శాతం చొప్పున లాభపడ్డాయి. నిఫ్టీలో అత్యధికంగా లాభపడిన వాటిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ కార్ప్, హిండాల్కో, కోల్ ఇండియా ఉన్నాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగాయి. నష్టపోయిన వాటిలో సన్ ఫార్మా మరియు పవర్ గ్రిడ్ ఉన్నాయి. ఇతర నష్టాల్లో హిందాల్కో, కోల్ ఇండియా ఎన్‌టిపీసీ ఉన్నాయి.

స్టాక్ మార్కెట్లు ఈ స్థాయిలో దూసుకెళ్లడానికి ఆర్‌బీఐ తాజాగా నిర్ణయాలే కారణంగా చెబుతున్నారు. ఇటీవల కేంద్రానికి డివిడెండ్‌ ప్రకటించడమే సూచీల పరుగుకు ప్రధాన కారణంగా వ్యాఖ్యానిస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.2.11 లక్షల కోట్లను ఆర్‌బీఐ ప్రభుత్వానికి అందించనుంది. ఇది కేంద్రం ద్రవ్యలోటు పూడ్చుకోవడానికి ఉపయోగపడనుంది. అలాగే సార్వత్రిక ఎన్నికలు కూడా ఒక కారణంగా చెప్పొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా తాజాగా హెచ్‌ఎస్‌బీసీ వెలువరించిన డేటా కూడా సూచీలు రాణించడానికి మరో కారణంగా చెబుతున్నారు.