దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గత కొద్ది రోజులుగా సూచీలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. మొత్తానికి వారం రోజుల తర్వాత మంగళవారం మన మార్కెట్‌కు మంచి రోజులొచ్చాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా లాభాల్లోనే ట్రేడ్ అయ్యాయి. కొద్ది నిమిషాల్లోనే ఇన్వెస్టర్లు రూ.6.50 లక్షల కోట్లకు పైగా రికవరీ చేశారు. ఇక ముగింపులో సెన్సెక్స్ 239 పాయింట్లు లాభపడి 77, 578 దగ్గర ముగియగా.. నిఫ్టీ 64 పాయింట్లు లాభపడి 23, 518 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 84.41 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Food: రాత్రి పూట ఈ ఆహారం తింటున్నారా..? ఈ రోగాలు మీ చెంత చేరినట్లే
నిఫ్టీలో ఎం అండ్ ఎం, ట్రెంట్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐషర్ మోటార్స్ భారీ లాభాల్లో కొనసాగగా.. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్, హిందాల్కో నష్టపోయాయి. సెక్టార్లలో మీడియా, ఆటో, రియల్టీ, ఐటీ, ఫార్మా 0.5-2.5 శాతం, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్ 0.5 శాతం చొప్పున క్షీణించాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ సూచీలు దాదాపు 1 శాతం పెరిగాయి.
ఇది కూడా చదవండి: Minister Rama Naidu: గత ఐదేళ్ల పాలనలో పోలవరం 20 ఏళ్లు వెనక్కి పోయింది..
అమెరికా ఎన్నికలకు ముందు అనిశ్చితి కారణంగా మన మార్కెట్ తీవ్ర నష్టాలను ఎదుర్కొంది. ఎన్నికల ఫలితాల తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. దీంతో మార్కెట్లు బాగా పుంజుకుంటాయని నిపుణులు భావించారు. కానీ అంతా రివర్స్ అయింది. నవంబర్ 6న అమెరికా ఎన్నికల ఫలితాల రోజునే లాభాలు అర్జించింది. మిగతా రోజులన్నీ నష్టాలను చవిచూసింది. మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత మన మార్కెట్‌లో కొత్త కళ సంతరించుకుంది.
మార్కెట్‌కు సెలవు..
బుధవారం మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్‌కు నవంబర్ 20న సెలవు ప్రకటించారు. తిరిగి గురువారం స్టాక్ మార్కెట్ ఓపెన్ అవుతోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా స్టాక్ మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. ఎన్నికల నేపథ్యంలో అన్ని సంస్థలు సెలవులు ప్రకటించాయి. ఓటింగ్ పెంచేందుకు ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది.