SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!

Sip Rules (2)

Sip Rules (2)

SIP Rules : నెలకు వెయ్యి రూపాయలతో మొదలైన పెట్టుబడి కొన్ని సంవత్సరాల తర్వాత లక్షల్లోకి మారుతుందంటే నమ్మడం కాస్త కష్టంగానే అనిపించవచ్చు. కానీ అదే శక్తి SIPలో ఉంది. అందుకే గత కొన్నేళ్లుగా యువత నుంచి ఉద్యోగులు, చిన్న వ్యాపారుల వరకు లక్షలాది మంది SIPలను తమ ఆర్థిక ప్రయాణంలో భాగం చేసుకున్నారు. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, SIP ప్రారంభించడం చాలా మంది చేస్తారు కానీ దాన్ని సరైన పద్ధతిలో కొనసాగించే వారు మాత్రం తక్కువ మంది. కొందరు మార్కెట్ పడిపోతే SIP ఆపేస్తారు. మరికొందరు సంవత్సరాల తరబడి పెట్టుబడి పెడుతున్నా తమ లక్ష్యాలకు సరిపోతుందా లేదా అని కూడా చూసుకోరు. ఇంకొందరు తక్కువ మొత్తంతో మొదలుపెట్టి అదే మొత్తాన్ని జీవితాంతం కొనసాగిస్తారు. మరి SIPలో నిజంగా సంపద సృష్టించేది ఏమిటి? ఎక్కువ రాబడులు పొందేవారు చేసే పని ఏంటి? చాలామంది గుర్తించని చిన్న తప్పులు దీర్ఘకాలంలో ఎంత పెద్ద ప్రభావం చూపిస్తాయి? అనే విషయాలకు సమాధానాలను తెలసుకుందాం.

చాలామంది SIP అంటే కేవలం ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్‌లో పెట్టడం మాత్రమే అనుకుంటారు. కానీ SIP అనేది ఒక పెట్టుబడి విధానం మాత్రమే. అసలు ఫలితాలను నిర్ణయించేది మీరు ఎంచుకున్న ఫండ్, పెట్టుబడి కాలం. నెలకు ఐదు వేల రూపాయలు పెట్టడం కంటే, ఆ పెట్టుబడిని ఎంతకాలం కొనసాగిస్తున్నారనేదే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. పెట్టుబడి ప్రపంచంలో సమయం అనేది అత్యంత విలువైన ఆస్తిగా ఎందుకు భావిస్తారో SIPల విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది.

×
×
Ad

మార్కెట్ పడిపోయినప్పుడు చాలా మంది భయపడతారు. తమ పెట్టుబడి విలువ తగ్గుతున్నట్లు కనిపించగానే SIPలను ఆపేయాలని లేదా డబ్బు వెనక్కి తీసుకోవాలని ఆలోచిస్తారు. అయితే నిజానికి SIPలకు అత్యంత అనుకూలమైన సమయాల్లో మార్కెట్ పతనం కూడా ఒకటి. ఎందుకంటే అదే మొత్తంతో ఎక్కువ యూనిట్లు కొనుగోలు చేసే అవకాశం వస్తుంది. మార్కెట్ తిరిగి కోలుకున్నప్పుడు ఆ యూనిట్ల విలువ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులు మార్కెట్ క్షీణతను ప్రమాదంగా కాకుండా అవకాశంగా చూస్తారు.

మరో సాధారణ తప్పు SIP మొత్తాన్ని సంవత్సరాల పాటు పెంచకపోవడం. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరినప్పుడు నెలకు మూడు వేల రూపాయల SIP ప్రారంభించాడనుకుందాం. ఐదు లేదా పది సంవత్సరాల తర్వాత అతని జీతం రెట్టింపు అయినా, SIP మాత్రం అదే స్థాయిలో కొనసాగుతుంటుంది. దీంతో సంపద సృష్టి వేగం కూడా పరిమితంగానే ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం ఆదాయం పెరిగినప్పుడు SIP మొత్తాన్ని కూడా కొంత పెంచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. దీనిని స్టెప్ అప్ SIP అని పిలుస్తారు.
చాలామంది చేసే ఇంకో పొరపాటు లక్ష్యం లేకుండా పెట్టుబడి పెట్టడం. డబ్బు పెరగాలనే ఆలోచనతో SIP ప్రారంభించడం కంటే, పిల్లల చదువు, ఇల్లు కొనుగోలు, రిటైర్మెంట్, ఆర్థిక స్వేచ్ఛ వంటి స్పష్టమైన లక్ష్యాలతో ప్రారంభిస్తే నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది.

అలాగే చాలా మంది ఒకసారి SIP ప్రారంభించిన తర్వాత దాన్ని పూర్తిగా మర్చిపోతారు. ప్రతి నెలా డబ్బు కట్ అవుతుండటంతో పని అయిపోయిందని భావిస్తారు. కానీ కాలానుగుణంగా ఫండ్ పనితీరును సమీక్షించడం కూడా అవసరం. ఒక ఫండ్ అనుకున్న స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోతే మార్పులు చేసుకోవాల్సి రావచ్చు. అయితే ప్రతి చిన్న మార్కెట్ మార్పుకు భయపడి తరచూ ఫండ్లు మార్చడం కూడా సరైన పద్ధతి కాదు.

SIPలో విజయానికి రహస్యం భారీ మొత్తాలు పెట్టడంలో లేదు. చిన్న మొత్తాలతో ప్రారంభించినా సరే, క్రమశిక్షణతో, దీర్ఘకాల దృష్టితో కొనసాగించడంలో ఉంది. వాస్తవానికి మార్కెట్‌లో ఎక్కువకాలం కొనసాగగలిగిన వారే మెరుగైన ఫలితాలను పొందుతారు. SIP కూడా అదే సూత్రంపై పనిచేస్తుంది. అందుకే తాత్కాలిక లాభాల కోసం SIPను తక్కువ సమయంతో కాకుండా, భవిష్యత్తు ఆర్థిక భద్రత కోసం రూపొందించిన దీర్ఘకాల ప్రయాణంగా చూడాలి. సరైన ఫండ్ ఎంపిక, క్రమం తప్పని పెట్టుబడి, మార్కెట్ పడిపోయినప్పుడు కూడా ఓపిక, ఆదాయం పెరిగేకొద్దీ SIP మొత్తాన్ని పెంచడం వంటి అలవాట్లు దీర్ఘకాలంలో గణనీయమైన మార్పును తీసుకురాగలవు. చిన్న మొత్తంతో మొదలైన ప్రయాణమే ఒక రోజు పెద్ద ఆర్థిక లక్ష్యాలను చేరుకునే మార్గంగా మారవచ్చు.