NTV Telugu Site icon

Telegram Scam: వెలుగులోకి టెలిగ్రామ్ కుంభకోణం.. సెబీ సోదాలు.. కేసు నమోదు

దేశంలో ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు సంబంధించి ఓ స్కాం తాజాగా వెలుగు చూసింది. టెలిగ్రామ్‌ను ఉపయోగించుకుని షేర్ల ట్రేడింగ్ కుంభకోణానికి పలు సంస్థలు తెరతీశాయని ఆరోపణలు రావడంతో సెబీ రంగంలోకి దిగింది. దీంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో సెబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆయా సంస్థలు టెలిగ్రామ్‌ ద్వారా 50 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్ల కోసం రికమండేషన్లు అందించినట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన లిస్టెడ్‌ షేర్లకు సంబంధించి సలహాలు ఇవ్వడం ద్వారా ఇన్వెస్టర్లు వీటిలో లావాదేవీలు చేపట్టేలా స్కాంకు పాల్పడినట్లు సమాచారం అందుతోంది.

ఈ మేరకు గుజరాత్‌లోని అహ్మదాబాద్, భావనగర్, మధ్యప్రదేశ్‌లోని నీముచ్, ఢిల్లీ, ముంబైలలో సోదాలు చేసినట్లు సెబీ వెల్లడించింది. ఈ సోదాల ద్వారా 34 మొబైల్‌ ఫోన్లు, 6 ల్యాప్‌టాప్‌లు, 4 డెస్క్‌టాప్‌లు, 4 ట్యాబ్లెట్లతోపాటు.. 2 హార్డ్‌ డిస్కులు, పలు రికార్డులు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సెబీ తెలిపింది. కాగా కృత్రిమంగా సబ్‌స్క్రైబర్లను సృష్టించి ఇన్వెస్టర్ల ద్వారా లావాదేవీలు పెరిగినట్లు చూపించి ధరల పెరుగుదలకు దారిచూపినట్లు టెలిగ్రామ్‌పై ఆరోపణలున్నాయి. దీంతో ఆయా సంస్థలు అధిక ధరల వద్ద షేర్లను విక్రయించేందుకు అవకాశం కలిగింది. తద్వారా రిటైల్‌ ఇన్వెస్టర్లు నష్టపోగా.. ఈ సంస్థలు మాత్రం ధనార్జన పొందినట్లు తెలుస్తోంది.