Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్‌ను దాటిన డాలర్ విలువ!

Indian Rupee

Indian Rupee

Dollar vs Rupee: అంతర్జాతీయ మార్కెట్లో భారత కరెన్సీ (రూపాయి) విలువ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ పతనాన్ని చవిచూసింది. శుక్రవారం ట్రేడింగ్‌లో యుఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ సరికొత్త చారిత్రక కనిష్ట స్థాయి 96.07 కి పడిపోయింది. పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్)లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు విపరీతంగా పెరగడంతో రూపాయి వరుసగా మూడో రోజు కూడా తన నష్టాల పరంపరను కొనసాగించింది.

ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ ప్రారంభంలోనే డాలర్‌తో పోలిస్తే రూపాయి 95.86 వద్ద బలహీనంగా ఓపెన్ అయింది. ఆ తర్వాత మరింత క్షీణించి, మునుపటి ముగింపుతో పోలిస్తే 30 పైసలు నష్టపోయి 95.94 వద్దకు చేరింది. గురువారం కూడా రూపాయి రికార్డు స్థాయిలో 95.64 వద్ద ముగియగా.. ఇంట్రాడేలో 95.96 గరిష్ట కనిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే.

రూపాయి పతనానికి ప్రధాన కారణాలు ఇవే..
ఫారెక్స్ ట్రేడర్ల విశ్లేషణ ప్రకారం.. మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పూర్తిగా దెబ్బతినడానికి ప్రధానంగా మూడు ముఖ్య కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం భారతదేశ దిగుమతి భారాన్ని పెంచుతోంది. ప్రపంచంలోని ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే యుఎస్ డాలర్ బలాన్ని కొలిచే ‘డాలర్ ఇండెక్స్’ 0.24 శాతం పెరిగి 99.05 వద్ద ట్రేడవుతోంది. మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ ఇంధన సరఫరాకు ఆటంకం కలుగుతుందనే ఆందోళనలు ఇన్వెస్టర్లలో వ్యక్తమవుతున్నాయి.

రూ. 107 దాటిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్
గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ అయిన ‘బ్రెంట్ క్రూడ్’ ఫ్యూచర్స్ మార్కెట్లో 1.30 శాతం పెరిగి బ్యారెల్‌కు $107.09 కి చేరుకుంది. భారతదేశం తన ముడి చమురు అవసరాలలో అత్యధిక భాగాన్ని దిగుమతుల ద్వారానే పొందుతుంది. కాబట్టి క్రూడ్ ధరలు పెరిగిన ప్రతిసారీ దేశంలో డాలర్లకు డిమాండ్ పెరిగి, రూపాయిపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. భూగోళ రాజకీయ అనిశ్చితి ప్రపంచ ఆర్థిక మార్కెట్లను మరింత ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఇంధన డిమాండ్‌ను నియంత్రించడానికి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCs) పై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరల పెంపుతో సామాన్యుడి జేబుకు మరింత చిల్లు పడనుంది.