Site icon NTV Telugu

Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!

Reliance

Reliance

Reliance Q4 FY26 Results: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తమ నాలుగో త్రైమాసిక (Q4 FY26) ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో కంపెనీ ఆదాయం అద్భుతంగా పెరిగినప్పటికీ, నికర లాభంలో మాత్రం కొంత ఒత్తిడి కనిపించింది. ఇదే సమయంలో ఇన్వెస్టర్లకు ఊరటనిస్తూ ప్రతి షేరుకు రూ.6 డివిడెండ్ ప్రకటించింది. కంపెనీ కన్సోలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 13% తగ్గి రూ.16,971 కోట్లకు పరిమితమైంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 13% వృద్ధి చెంది రూ. 2.98 లక్షల కోట్లకు చేరింది.

రంగాల వారీగా పనితీరు ఇదే..
రిలయన్స్ జియో తన దూకుడును కొనసాగిస్తోంది. దీని నికర లాభం రూ.7,022 కోట్ల నుంచి రూ. 7,935 కోట్లకు పెరిగింది. సగటు వినియోగదారు ఆదాయం (ARPU) స్వల్పంగా పెరిగి రూ.214కు చేరింది. మొత్తం యూజర్లు 52.4 కోట్లు దాటగా, అందులో 26.8 కోట్ల మంది 5G యూజర్లు ఉండటం విశేషం. అలాగే రిలయన్స్ రిటైల్ విభాగం స్థిరమైన వృద్ధిని కనబరిచింది. దీని ఆదాయం విషయానికి వస్తే.. గ్రాస్ రెవెన్యూ 10.8% పెరిగి రూ. 98,232 కోట్లకు చేరింది. నికర లాభం రూ. 3,563 కోట్లుగా నమోదైంది. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా ఓమ్నీ ఛానల్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం వల్లే ఈ వృద్ధి సాధ్యమైందని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. ఆయిల్-టు-కెమికల్స్ విభాగం ఆదాయం 12% పెరిగి రూ.1.84 లక్షల కోట్లకు చేరినప్పటికీ, ఎబిటా మాత్రం 4% తగ్గి రూ. 14,520 కోట్లుగా నమోదైంది.

వినోద రంగంలో జియో స్టార్ సంచలనాలు సృష్టిస్తోంది. టీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో 34.2% వాటాతో 81 కోట్ల మంది ప్రేక్షకులను చేరుకుంది. T20 వరల్డ్ కప్ ఫైనల్‌ను ఏకంగా 7.25 కోట్ల మంది ఏకకాలంలో వీక్షించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఫలితాల సందర్భంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. రిలయన్స్ రిటైల్, జియోలు అద్భుతమైన పనితీరు కనబరిచాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా FMCG రంగంలో రిలయన్స్ బ్రాండ్స్ వేగంగా విస్తరిస్తున్నాయని, భారత దేశంలో వినియోగం ఇంకా పెరిగే అవకాశం ఉందని, ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రిలయన్స్ సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version