RBI New Rules 2027: 2027 నుంచి RBI న్యూ రూల్స్.. హోమ్ లోన్, పర్సనల్ లోన్ EMIలు ఎలా మారతాయంటే?

  • హోమ్ లోన్ తీసుకున్నవారికి కీలక అలర్ట్
  • 2027 నుంచి కొత్త RBI రూల్స్
  • మీ హోమ్ లోన్, పర్సనల్ లోన్ EMIలు ఎలా మారతాయంటే?
Rbi

Rbi

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫ్లోటింగ్ రేట్ రుణాలకు సంబంధించి కీలక మార్పులను ప్రతిపాదించింది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే RBI వడ్డీ రేట్లలో చేసే మార్పుల ప్రభావం హోమ్ లోన్లు వంటి ఫ్లోటింగ్ రేట్ రుణాలపై మరింత వేగంగా పడే అవకాశం ఉంది. అయితే రుణగ్రహీతలు వెంటనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఎలాంటి మార్పు లేదు. RBI ప్రతిపాదనలు ఇంకా డ్రాఫ్ట్ దశలోనే ఉన్నాయి. దీనిపై ప్రజల నుంచి సెప్టెంబర్ 11, 2026 వరకు అభిప్రాయాలను కోరింది. ప్రతిపాదనలు తుది రూపం దాల్చితే 2027 ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

వడ్డీ రేట్లు మూడు నెలల్లోపు రీసెట్?

RBI ప్రతిపాదనల్లో ప్రధానమైన మార్పు ఫ్లోటింగ్ రేట్ రుణాల వడ్డీ రీసెట్ ఫ్రీక్వెన్సీకి సంబంధించినది. ప్రస్తుతం చాలా ఫ్లోటింగ్ రేట్ రుణాల్లో వడ్డీ రేటు సంవత్సరానికి ఒకసారి మాత్రమే రీసెట్ అవుతోంది. దీంతో RBI రెపో రేటును తగ్గించినా, ఆ ప్రయోజనం రుణగ్రహీతలకు చేరడానికి కొన్ని నెలలు పట్టే పరిస్థితి ఉంది. కొత్త డ్రాఫ్ట్ ప్రకారం ఫ్లోటింగ్ రేట్ రుణాల వడ్డీ రేటును గరిష్ఠంగా మూడు నెలల్లోపు రీసెట్ చేయాల్సి రావచ్చు. దీంతో RBI రెపో రేటు తగ్గించినప్పుడు హోమ్ లోన్ వడ్డీ తగ్గింపు ప్రయోజనం త్వరగా లభించే అవకాశం ఉంది. అదే సమయంలో రెపో రేటు పెరిగితే వడ్డీ పెరుగుదల ప్రభావం కూడా అంతే వేగంగా రుణగ్రహీతలపై పడవచ్చు.

EMI వెంటనే తగ్గుతుందా?

ప్రతిపాదిత నిబంధనలు అమల్లోకి వచ్చినంత మాత్రాన మీ EMI వెంటనే తగ్గదు. RBI రెపో రేటు, మీ లోన్‌కు అనుసంధానించిన బెంచ్‌మార్క్, బ్యాంక్ విధానం, మీ రుణ ఒప్పందంలోని స్ప్రెడ్ వంటి అంశాలపై EMI మార్పు ఆధారపడి ఉంటుంది. Choice Finserv Private Limited CEO విజయేంద్ర సింగ్ శేఖావత్ అభిప్రాయం ప్రకారం, ఈ మార్పు వల్ల హోమ్ లోన్ రుణగ్రహీతలకు ప్రధాన ప్రయోజనం వెంటనే వడ్డీ తగ్గడం కంటే వడ్డీ మార్పుల టైమింగ్, పారదర్శకతలో ఉంటుంది. కొత్త రుణం తీసుకునేవారు తమ లోన్ ఏ బెంచ్‌మార్క్‌కు అనుసంధానమై ఉందో, వడ్డీ ఎంత తరచుగా మారుతుందో స్పష్టంగా తెలుసుకోవడం ముఖ్యమవుతుంది.

పర్సనల్ లోన్ EMIలకు ఏమవుతుంది?

ఇక్కడ రుణగ్రహీతలు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ప్రతిపాదిత RBI రీసెట్ విధానం ఫ్లోటింగ్ రేట్ రుణాలకు వర్తిస్తుంది. చాలా పర్సనల్ లోన్లు, ఆటో లోన్లు సాధారణంగా ఫిక్స్‌డ్ రేట్ విధానంలో ఉంటాయి. కాబట్టి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన వెంటనే ఇప్పటికే ఉన్న పర్సనల్ లోన్ EMIలు అకస్మాత్తుగా మారవు. అయితే కొత్తగా రుణం తీసుకునే వారికి మరింత స్పష్టత లభించే అవకాశం ఉంది. లోన్ ఒప్పందంలో ఏ బెంచ్‌మార్క్‌ను అనుసరిస్తున్నారు?, వడ్డీ రేటు, ఎంత తరచుగా రీసెట్ అవుతుంది?, రీసెట్ తేదీ ఎప్పుడు?, బెంచ్‌మార్క్‌పై బ్యాంక్ స్ప్రెడ్ ఎంత? వంటి వివరాలను స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది.

స్ప్రెడ్‌పై కూడా RBI ప్రతిపాదన

RBI డ్రాఫ్ట్‌లో మరో ముఖ్యమైన అంశం స్ప్రెడ్‌లోని నాన్-క్రెడిట్ భాగాన్ని మూడు సంవత్సరాల పాటు మార్చకూడదనే ప్రతిపాదన. దీంతో రుణగ్రహీతలు తమ రుణంపై వాస్తవంగా ఎంత చెల్లిస్తున్నారో అర్థం చేసుకోవడం సులభం కావచ్చు. కొత్త హోమ్ లోన్ తీసుకునే సమయంలో కేవలం బ్యాంక్ ప్రకటించే వడ్డీ రేటును మాత్రమే చూడకుండా, బెంచ్‌మార్క్‌పై ఉన్న స్ప్రెడ్‌ను కూడా పరిశీలించడం చాలా ముఖ్యం.

ఇప్పటికే ఉన్న హోమ్ లోన్ల పరిస్థితి ఏంటి?

ఇప్పటికే ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్ తీసుకున్నవారు ప్రస్తుతం ఎలాంటి చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిపాదిత విధానం ప్రకారం ఇప్పటికే ఉన్న రుణాలను కొత్త నిర్మాణంలోకి 2029 ఏప్రిల్ 1 నాటికి మార్చాల్సి ఉంటుంది. ఈ మార్పుకు రుణగ్రహీత సమ్మతి అవసరం. అంతేకాకుండా మార్పు కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదని ప్రతిపాదించారు. కేవలం కొత్త విధానంలోకి మార్చినందుకు రుణదాత వడ్డీ రేటును పెంచకూడదు.

రుణగ్రహీతలకు మంచి అవకాశం కూడా

లోన్ రీసెట్ సమయంలో రుణగ్రహీతలు తమ ప్రస్తుత రుణాన్ని మరోసారి సమీక్షించుకోవచ్చు. అవకాశం ఉంటే ఫిక్స్‌డ్ రేట్ లోన్‌కు మారడం గురించి పరిశీలించవచ్చు. అలాగే రుణం తీసుకున్న తర్వాత తమ క్రెడిట్ ప్రొఫైల్ మెరుగుపడితే బ్యాంకును సంప్రదించి స్ప్రెడ్ తగ్గించమని కోరే అవకాశం కూడా ఉంటుంది.

రూ.50 లక్షల హోమ్ లోన్‌పై EMI ఎంత?

ఉదాహరణకు రూ.50 లక్షల ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్‌ను 8 శాతం వడ్డీతో 20 ఏళ్ల కాలానికి తీసుకున్నారని అనుకుందాం. ఈ రుణానికి నెలవారీ EMI సుమారు రూ.41,800 ఉంటుంది. వడ్డీ రేటులో కేవలం 0.5 శాతం పాయింట్ల తేడా వచ్చినా మొత్తం 20 ఏళ్ల కాలంలో సుమారు రూ.3.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు అదనపు వడ్డీ భారం పడే అవకాశం ఉంటుంది. అందుకే తక్కువ వడ్డీ రేటు అని ప్రకటనలో కనిపించిన సంఖ్యను మాత్రమే చూసి లోన్ తీసుకోవడం సరైన నిర్ణయం కాకపోవచ్చు.

లోన్ తీసుకునే ముందు ఈ మూడు విషయాలు చూడండి

1. స్ప్రెడ్ ఎంత?

బ్యాంక్ ప్రకటించే వడ్డీ రేటుతో పాటు బెంచ్‌మార్క్‌పై బ్యాంక్ వసూలు చేసే స్ప్రెడ్‌ను పరిశీలించాలి. దీర్ఘకాలంలో ఇది చాలా కీలకం.

2. రీసెట్ ఫ్రీక్వెన్సీ ఎంత?

మీ రుణదాత వడ్డీ రేటును ఎప్పుడు మార్చగలడు? మూడు నెలలకోసారి, ఆరు నెలలకోసారి లేదా మరేదైనా వ్యవధిలోనా అనే విషయాన్ని లోన్ ఒప్పందంలో స్పష్టంగా తెలుసుకోవాలి.

3. EMIకి కొంత అదనపు బడ్జెట్ ఉంచండి

భవిష్యత్తులో RBI రెపో రేటు పెరిగితే మీ లోన్ వడ్డీ కూడా పెరగవచ్చు. అలాంటి పరిస్థితుల్లో EMI పెరిగినా లేదా రుణ కాలవ్యవధి పెరిగినా మీ నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడకుండా కొంత అదనపు ఆర్థిక వెసులుబాటు ఉంచుకోవడం మంచిది.

RBI రెపో రేటు 5.25 శాతం వద్ద కొనసాగింపు

ఆగస్టు 2026లో RBI రెపో రేటును 5.25 శాతం వద్ద కొనసాగించింది. 2025లో రెపో రేటులో మొత్తంగా 125 బేసిస్ పాయింట్ల తగ్గింపు తర్వాత ఈ స్థాయిలో కొనసాగుతోంది. భవిష్యత్తులో RBI రెపో రేటులో మార్పులు చేస్తే, కొత్త ప్రతిపాదిత విధానం అమల్లో ఉన్న సందర్భంలో వాటి ప్రభావం ఫ్లోటింగ్ రేట్ రుణాలపై మరింత వేగంగా పడే అవకాశం ఉంది. రెపో రేటు తగ్గితే రుణగ్రహీతలకు వడ్డీ భారం త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. అదే సమయంలో రెపో రేటు పెరిగితే EMI పెరగడం లేదా రుణ చెల్లింపు కాలవ్యవధి వేగంగా పెరగడం వంటి ప్రభావాలు కూడా ఉండవచ్చు.

మొత్తంగా ఏం మారొచ్చు?

RBI ప్రతిపాదనలు తుది రూపం దాల్చి 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తే, ఫ్లోటింగ్ రేట్ రుణాలపై RBI వడ్డీ రేటు మార్పుల ప్రభావం ప్రస్తుతం ఉన్నదానికంటే వేగంగా రుణగ్రహీతలకు చేరే అవకాశం ఉంది. అయితే 2027లో ప్రతి ఒక్కరి EMI తప్పనిసరిగా పెరుగుతుంది లేదా తగ్గుతుంది అని చెప్పలేం. అది RBI రెపో రేటు, లోన్ బెంచ్‌మార్క్, స్ప్రెడ్, రీసెట్ తేదీ, రుణ ఒప్పందం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల కొత్తగా హోమ్ లేదా ఇతర ఫ్లోటింగ్ రేట్ లోన్ తీసుకునేవారు వడ్డీ రేటుతో పాటు బెంచ్‌మార్క్, స్ప్రెడ్, రీసెట్ ఫ్రీక్వెన్సీ వంటి వివరాలను తప్పనిసరిగా పరిశీలించడం మంచిది.