డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై ‘టోకనైజేషన్’ గడువును మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. గతంలో ప్రకటించిన గడువు ఈ నెల 30వ తేదీన ముగిసిపోనుండగా.. దాన్ని సెప్టెంబరు 30 వరకు పొడిగించారు. ప్రస్తుత కార్డు వివరాలను ప్రత్యామ్నాయ భద్రతా కోడ్‌గా పిలిచే ‘టోకెన్’తో భర్తీ చేయడాన్ని ‘టోకనైజేషన్’గా పిలుస్తారు. ఈ-కామర్స్ కంపెనీలు.. కస్టమర్ కార్డు సమాచారాన్ని తమ వెబ్‌సైట్లలో నిక్షిప్తం చేయడాన్ని ఇది నిరోధిస్తుంది. దీనివల్ల లావాదేవీలు మరింత సురక్షితం అవుతాయి.
క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చేసే ఆన్‌లైన్ చెల్లింపు లావాదేవీల్లో భద్రతను పెంచడమే టోకనైజేషన్ లక్ష్యం. టోకనైజేషన్‌తో కార్డు వివరాల నిల్వ పరిమితంగా ఉంటుంది. తాజాగా అన్ని ఆన్‌లైన్ చెల్లింపు గేట్‌వేలు, వ్యాపారులు, ఇ-కామర్స్ కంపెనీలు తమ వినియోగదార్లకు చెందిన కార్డుల టోకనైజేషన్‌ను అమలు చేయాలని ఆర్‌బీఐ కోరింది. ఇప్పటిదాకా 19.5 కోట్ల టోకెన్లు సృష్టించారని ఆర్‌బీఐ శుక్రవారం తెలిపింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పెద్ద వ్యాపారులందరూ ఈ వ్యవస్థకు సిద్ధంగానే ఉన్నట్లు తెలిసింది. కొంత మంది మాత్రం ఇంకా ఆ ప్రక్రియలో ఉన్నారు
