RBI Fact Check: జనవరి 1, 2027 నుంచి కొత్త చెక్‌బుక్ రూల్స్?.. పాత చెక్‌బుక్‌లపై RBI కీలక ప్రకటన

Rbi

Rbi

RBI Fact Check: భారత్ లో జనవరి 1, 2027 నుంచి కొత్త చెక్‌బుక్ నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న చెక్‌బుక్‌లను డిసెంబర్ 31, 2026 తర్వాత మార్చుకోవాల్సి ఉంటుందని, వాటి స్థానంలో మరింత మెరుగైన భద్రతా ప్రమాణాలతో కూడిన కొత్త చెక్‌బుక్‌లను బ్యాంకులు అందించనున్నాయని కొన్ని సందేశాలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న చెక్‌బుక్‌ల విషయంలో ఎలాంటి మార్పులు చేయడం లేదని RBI స్పష్టం చేసింది. కొత్త చెక్‌బుక్‌లు తప్పనిసరిగా తీసుకోవాలనే నిబంధనను కూడా ప్రకటించలేదని వెల్లడించింది. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది.

కొత్త చెక్‌బుక్‌లు తప్పనిసరిగా మార్చుకోవాలా?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందేశాల ప్రకారం.. 2026 డిసెంబర్ 31 తర్వాత ప్రస్తుతం ఉపయోగిస్తున్న స్టాండర్డ్ చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (CTS) చెక్‌బుక్‌లు చెల్లవని, 2027 జనవరి 1 నుంచి కొత్త భద్రతా ఫీచర్లతో కూడిన చెక్‌బుక్‌లు అమల్లోకి వస్తాయని ప్రచారం జరిగింది. దీంతో ఖాతాదారులు తమ పాత చెక్‌బుక్‌లను మార్చుకోవాల్సి ఉంటుందనే ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రచారాన్ని RBI పూర్తిగా ఖండించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న CTS చెక్‌బుక్‌లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేసింది.

సోషల్ మీడియా ‘X’ వేదికగా RBI వివరణ

ఈ అంశంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ తన అధికారిక సోషల్ మీడియా వేదిక ‘X’ ద్వారా ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న స్టాండర్డ్ CTS చెక్‌బుక్‌లు 2026 డిసెంబర్ 31 నుంచి మారిపోతాయని, 2027 జనవరి 1 నుంచి కొత్త భద్రతా ప్రమాణాలతో కూడిన చెక్‌బుక్‌లు అందుబాటులోకి వస్తాయని సోషల్ మీడియాలో ఒక సందేశం ప్రచారంలో ఉందని RBI పేర్కొంది. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర బ్యాంకు స్పష్టం చేసింది. CTS చెక్‌బుక్‌లకు సంబంధించి ప్రస్తుతం RBI అలాంటి ఎలాంటి మార్పులను చేపట్టడం లేదని వెల్లడించింది.

పాత చెక్‌బుక్‌ల పరిస్థితి ఏమిటి?

RBI ఇచ్చిన స్పష్టత ప్రకారం.. ప్రస్తుతం బ్యాంకులు అందిస్తున్న CTS చెక్‌బుక్‌లను మార్చుకోవాల్సిన అవసరం లేదు. 2026 డిసెంబర్ 31 తర్వాత పాత చెక్‌బుక్‌లు చెల్లవనే ప్రచారానికి ఎలాంటి అధికారిక ఆధారం లేదు. అందువల్ల కొత్త చెక్‌బుక్‌ల కోసం బ్యాంకులను సంప్రదించాల్సిన అవసరం లేదని ఈ ప్రకటన ద్వారా స్పష్టమవుతోంది. బ్యాంకింగ్ సేవలకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మవద్దని RBI ప్రజలకు సూచించింది. ముఖ్యంగా చెక్‌బుక్‌లు, బ్యాంకింగ్ నిబంధనలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మార్పులపై సమాచారం తెలుసుకోవాలంటే RBI అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని కోరింది.