Ratan Tata: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడంలో ముందుంటారు. తాజాగా ఆయన గుడ్ ఫెల్లోస్ అనే స్టార్టప్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. మంగళవారం జరిగిన ఈ స్టార్టప్ కంపెనీ ప్రారంభోత్సవంలో రతన్ టాటా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంటరితనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక తోడుంటే బాగుండు అని ఒంటరిగా సమయం గడిపే వరకు.. ఒంటరితనమంటే తెలియదని రతన్ టాటా వ్యాఖ్యానించారు. అలాగే వాస్తవంగా వయసు మళ్లే వరకు వృద్ధాప్యం గురించి ఎవరూ పట్టించుకోరని తెలిపారు. ప్రస్తుతం సహజంగా అందరితో కలిసి ఉండటం సవాలుతో కూడుకుందని రతన్ టాటా వెల్లడించారు.
Read Also: Kerala: కేరళలో దారుణం.. మైనర్ పై తండ్రి స్నేహితుల అత్యాచారం
కాగా వృద్ధులకు ప్రతి పనిలో ఆసరాగా నిలిచేలా శంతను నాయుడు అనే యువకుడు ప్రారంభించిన ‘గుడ్ ఫెల్లోస్’ స్టార్టప్‌లో రతన్ టాటా పెట్టుబడులు పెట్టడం విశేషం. శంతను నాయుడు న్యూయార్క్‌లోని కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. 2018 నుంచి రతన్ టాటాకు అసిస్టెంట్‌గా ఉంటున్నారు. అనంతర కాలంలో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. రతన్ టాటాకు, ఈ యువకుడికి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అయితే శునకాలపై ప్రేమ వీరిద్దరిని కలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 మిలియన్ల మంది వృద్ధులు స్వతహాగా జీవిస్తున్నారని, వారితో జీవితాన్ని పంచుకునే వ్యక్తులు లేకుండా ఉన్నారని శంతను నాయుడు వ్యాఖ్యానించారు. ఒంటరితనం లేదా సహవాసం లేకపోవడం మానసిక క్షీణతకు ప్రధాన కారణమన్నారు. ఒంటరితనం కారణంగా శారీరక ఆరోగ్యం కూడా క్షీణిస్తుందని అభిప్రాయపడ్డారు. అందుకే ఈ స్టార్టప్ కంపెనీ కింద సానుభూతితో వ్యవహరించేవారిని, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కలిగిన వారిని నియమించుకుంటామని తెలిపారు. వారు వృద్ధులకు సహచరుల్లా వ్యవహరిస్తూ ప్రతి పనిలో ఆసరాగా నిలుస్తారని పేర్కొన్నారు.
