Site icon NTV Telugu

Post Office SCSS: పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. వడ్డీతోనే లక్షలు సంపాదించవచ్చు!

Post Office Scss

Post Office Scss

Post Office SCSS: ఈ రోజుల్లో ఆర్థిక క్రమశిక్షణ అనేది ప్రతి ఒక్కరికి కచ్చితంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. పిల్లల చదువుల కోసం, కుమార్తె వివాహం కోసం, సొంత ఇంటి కలను నిజం చేసుకోడానికి కచ్చితంగా డబ్బు పొదుపు చేయాలని చెబుతున్నారు. అందుకే చాలా మంది వారి ఆదాయంలో కొంత ఆదా చేసుకుని, సురక్షితమైన, అధిక రాబడిని ఇచ్చే వాటిలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేసుకుంటారు. ఇలా ప్లాన్ చేసుకునే వారికి పోస్టాఫీస్ పొదుపు పథకాలు చాలా బాగా ఉపయోగపడుతాయని అంటున్నారు. అన్ని పథకాల్లో పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకం ప్రత్యేకమైనదని విశ్లేషకులు పేర్కొన్నారు. ఎందుకంటే దీనిలో పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ ద్వారా నెలకు ₹20,500 వరకు సంపాదించవచ్చని చెబుతున్నారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను ప్రయోజనాలు కూడా అందుకుంటారని వెల్లడించారు.

READ ALSO: Wines Tender : రేపు మద్యం షాపులకు డ్రా.. ఏర్పాట్లు చేసిన ఎక్సైజ్‌ శాఖ

పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ పథకం ప్రత్యేకతలు..
పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ పథకం అనేది అత్యంత ప్రజాదరణ పొందిన పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలలో ఒకటి. ఇందులో ఒకేసారి పెట్టుబడి పెట్టడం వల్ల నెలకు రూ. 20 వేల కంటే ఎక్కువ వడ్డీ వస్తుంది. ఇది పదవీ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోకుండా, క్రమం తప్పకుండా నెలవారీ ఆదాయం వచ్చేలా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పోస్టాఫీసు పథకం ప్రభుత్వం నుంచి డిపాజిట్లపై అద్భుతమైన వడ్డీ రేట్లను అందిస్తుంది. పెట్టుబడిదారులు వార్షిక వడ్డీ రేటు 8.2% పొందుతారు. అలాగే ఇది మీ పెట్టుబడిపై క్రమం తప్పకుండా నెలవారీ ఆదాయాన్ని అందిస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది అనేక బ్యాంకులు అందించే స్థిర డిపాజిట్ల కంటే చాలా ఎక్కువ వడ్డీ రేటును ఇస్తుంది. ఇంకా ఈ పథకంలో పెట్టిన పెట్టుబడులపై ప్రభుత్వం సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు ఆదాయపు పన్ను ప్రయోజనాలను అందిస్తుంది.

ఏ వయస్సులో పెట్టుబడి పెట్టాలి..
ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా వృద్ధాప్యాన్ని సంతోషంగా గడపవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో పెట్టబడి పెట్టే వయస్సు 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వాళ్లు సింగిల్ లేదా జాయింట్ ఖాతాను తెరవవచ్చు. దీనితో పాటు ప్రభుత్వం నుంచి VRS తీసుకున్న 55 నుంచి 60 ఏళ్ల వయస్సు గల వ్యక్తులు లేదా రక్షణ రంగంలో (ఆర్మీ, వైమానిక దళం, నేవీ, ఇతర భద్రతా దళాల నుంచి రిటైర్డ్) 50 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ఖాతాను ఓపెన్ చేయవచ్చు.

ఇంట్లో కూర్చొని లక్షల సంపాదించవచ్చు..
ఈ పోస్టాఫీస్ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఇంట్లో కూర్చొని లక్షలు ఎలా సంపాదించవచ్చో తెలుసుకుందాం. ఉదాహరణకు ఒకరు రూ.30 లక్షలు ఒకేసారి ఈ పథకంలో పెట్టుబడి పెట్టారని అనుకుందాం. ప్రభుత్వం నిర్వచించిన 8.2% వడ్డీ రేటు వద్ద, ఈ పెట్టుబడి వార్షిక వడ్డీ రూ.2.46 లక్షలు వస్తుంది. ఈ మొత్తాన్ని నెలవారీగా విభజిస్తే నెలకు రూ.20,500 ఆదాయాన్ని పొందవచ్చు. ఈ పథకం కాలం 5 సంవత్సరాలు ఉంటుంది.

ఈ పథకంలో ఎలా పొదుపు చేయాలి..
పోస్టాఫీస్ SCSS పథకం కింద ఖాతాను సమీపంలోని ఏదైనా పోస్టాఫీస్ నుంచి ఓపెన్ చేయాలి. పెట్టుబడిదారులు ఖాతాను తెరిచిన తర్వాత ఎప్పుడైనా మూసివేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఖాతా తెరిచిన ఒక సంవత్సరం లోపు మూసివేస్తే, పెట్టుబడి మొత్తంపై ఎటువంటి వడ్డీ లభించదు. మీరు దానిని 1 సంవత్సరం పూర్తయిన తర్వాత లేదా 2 ఏళ్ల మధ్య మూసివేస్తే, వడ్డీ మొత్తంలో 1.5% తీసి వేయస్తారు. అలాగే 2 నుంచి 5 సంవత్సరాల మధ్య ఖాతా మూసివేస్తే, వడ్డీ మొత్తంలో 1% తగ్గిస్తారు.

READ ALSO: SIR 2025: రేపు దేశవ్యాప్తంగా SIR అమలుపై ఈసీ ప్రెస్‌మీట్

Exit mobile version